సాధారణంగా ఐఫోన్ కొనాలంటే.. యాపిల్ స్టోరుకు వెళ్తారు, లేదా అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సైట్లలో సేల్ కోసం చూస్తుంటారు. కొనుగోలు చేయడానికి ముందు బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా చెక్ చేస్తారు. కానీ ఇప్పుడు కొంతమంది మాత్రం భారత్‌లో కొనడం కంటే.. దుబాయ్‌కి వెళ్లి ఐఫోన్ కొనడం చౌకగా ఉంటుందని భావిస్తారు. నిజంగా దుబాయ్‌లో ఐఫోన్ తక్కువ ధరకే లభిస్తుందా?, నిజమెంత అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంత తేడా..
దుబాయ్‌లో ఐఫోన్ 18 ప్రో 256జీబీ ధర 5099 దిర్హామ్‌లు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.1.32-1.33 లక్షలు. కానీ ఇదే ఫోన్ భారతదేశంలో రూ.1,64,900. అంటే ఇండియాలో దాదాపు రూ.33,000 ఎక్కువన్నమాట. అదే విధంగా ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర దుబాయ్‌లో 5499 దిర్హామ్‌లు (రూ.1.42-1.44 లక్షలు). భారత్‌లో దీని ధర రూ.1,79,900. అంటే రూ.38,000 తేడా అన్నమాట.
ఇండియాలో కంటే దుబాయ్‌లో కొంత తక్కువ ధరలకు లభిస్తుండటంతో.. కొంతమంది, ఫ్లైట్ టికెట్, వీసా ఖర్చులు పెట్టుకుని దుబాయ్‌కి వెళ్తే మనకు లాభమేనా?.. అని ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే, మీకు దుబాయ్‌లో తెలిసిన వ్యక్తి ఉంటే.. మీరు వెళ్లకుండానే ఐఫోన్ తెప్పించుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం. అయితే ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు దుబాయ్‌లో కొంటే ఇంకా ఎక్కువ ఆదా అవుతుంది.
దుబాయ్‌లో ఐఫోన్ ఎందుకు చౌక?
దుబాయ్‌లో ఐఫోన్ రేటు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. పన్నుల తేడా. ఇక్కడ వ్యాట్ 5 శాతం ఉంటుంది. కానీ భారతదేశంలో స్మార్ట్‌ఫోన్లపై పన్నులు, దిగుమతి సుంకాలు మరియు ఇతర ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కలిపినప్పుడు ఫోన్ ధర పెరుగుతుంది. అందుకే ఐఫోన్ ధరలు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే?, ఒక ఐఫోన్ కొనుగోలు చేయడానికి మాత్రమే దుబాయ్ వెళ్తే.. విమాన టికెట్, వీసా, హోటల్, ఆహారం వంటి ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది. కాబట్టి.. ఇక్కడ మీరు అదా చేయాలనుకున్న డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ఫోన్‌ను భారత్‌కు తీసుకొచ్చేటప్పుడు కస్టమ్స్ నిబంధనలు, ప్రయాణికుల పరిమితులు, వర్తించే పన్నులు కూడా తెలుసుకోవాలి. ఇవి కూడా మొత్తం లెక్కలో భాగమే.
కేవలం దుబాయ్‌లో మాత్రమే కాకుండా.. మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి కొన్ని దేశాల్లో కూడా ఐఫోన్ ధరలు భారతదేశం కంటే తక్కువే కావడం గమనార్హం. కానీ కేవలం ఫోన్ ధర చూసి నిర్ణయం తీసుకోకూడదు. ఫోన్ ధర + ప్రయాణ ఖర్చు + వీసా + కస్టమ్స్ అన్నీ కలిపి చూసిన తర్వాతే నిజంగా ఎంత డబ్బు ఆదా అవుతుందో తెలుస్తుంది.


