ఈవీ బ్యాటరీల్లో సంచలనం.. ఛాయ్‌ తాగేలోపు ఫుల్‌ ఛార్జింగ్‌! | 100 Km Range in 1 Minute Sunwoda Unveils Ultra-Fast Charging EV Battery | Sakshi
Sakshi News home page

ఈవీ బ్యాటరీల్లో సంచలనం.. ఛాయ్‌ తాగేలోపు ఫుల్‌ ఛార్జింగ్‌!

Sep 21 2026 1:53 PM | Updated on Sep 21 2026 2:13 PM

100 Km Range in 1 Minute Sunwoda Unveils Ultra-Fast Charging EV Battery

ఎలక్ట్రిక్‌ వాహనాల (EV) వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. అయినప్పటికీ ఎక్కువ దూరం వెళ్లలేకపోవడం, ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాల వల్ల చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో ఛార్జింగ్‌ సమయాన్ని మరింత తగ్గించే దిశగా సంచలన టెక్నాలజీతో ముందుకు వచ్చింది చైనాకు చెందిన ఓ బ్యాటరీ తయారీ సంస్థ.

చైనా బ్యాటరీ తయారీ సంస్థ సన్‌వోడా (Sunwoda EVB) ‘15సీ స్మార్ట్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌’ (15C Smart Flash Charging) అనే అల్ట్రా-ఫాస్ట్‌ ఛార్జింగ్‌ బ్యాటరీ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం, గది ఉష్ణోగ్రత వద్ద కేవలం ఒక నిమిషం ఛార్జింగ్‌తో సుమారు 100 కిలోమీటర్ల డ్రైవింగ్‌ రేంజ్‌ పొందవచ్చు. అలాగే బ్యాటరీని 10 శాతం నుంచి 70 శాతానికి 5 నిమిషాల్లో, 10 శాతం నుంచి 97 శాతానికి కేవలం 9 నిమిషాల్లో ఛార్జ్‌ చేయగలదని సన్‌వోడా చెబుతోంది. ఈ టెక్నాలజీని సెప్టెంబర్‌ 16–17న చైనాలోని షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌ జావోజువాంగ్‌లో జరిగిన బ్యాటరీ పరిశ్రమ సదస్సులో ప్రదర్శించింది.

ఈ టెక్నాలజీలో మరో కీలక అంశం ఉష్ణోగ్రత నియంత్రణ. అత్యంత వేగంగా ఛార్జింగ్‌ చేయడం వల్ల బ్యాటరీలో అధిక వేడి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. దీనిని నియంత్రించేందుకు సన్‌వోడా తన ఫ్లాష్‌ ఛార్జింగ్‌ వ్యవస్థలో అధిక సామర్థ్యం కలిగిన లిక్విడ్‌-కూల్డ్‌ ఛార్జింగ్‌ టెర్మినల్స్‌, మెగావాట్‌ స్థాయి ఛార్జింగ్‌ యూనిట్లు, ఎనర్జీ స్టోరేజ్‌ వ్యవస్థలు, AI ఆధారిత క్లౌడ్‌ కంట్రోల్‌ వంటి సాంకేతికతలను కలిపింది.

చలికాలంలోనూ ఫాస్ట్‌ ఛార్జింగ్ సాధ్యమవుతుందని కంపెనీ చెబుతోంది. మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో కూడా 10 నుంచి 97 శాతం వరకు ఛార్జ్‌ చేయడానికి సుమారు 15 నిమిషాలు చాలని సంస్థ వెల్లడించింది. సాధారణ పరిస్థితుల్లో 700 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్‌ రేంజ్‌ అందించే బ్యాటరీ ప్యాక్‌లకు ఈ వ్యవస్థను ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది.

ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఈవీ వాహనదారుల ఇబ్బందులు తీరిపోతాయి. ప్రయాణం మధ్యలో ఎక్కువ సేపు ఛార్జింగ్‌ కోసం వేచిఉండాల్సిన అవసరం ఉండదు. ఛాయ్‌ తాగినంత సేపులో ఈవీ బ్యాటరీ ఛార్జింగ్‌ దాదాపు పూర్తవుతుంది!

ఇదీ చదవండి: కియా కొత్త సీఎన్‌జీ కార్లు వచ్చేశాయ్‌.. ధరల్లో భారీ తేడా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement