‘కోటక్ మల్టీ అసెట్ అలొకేషన్’ఫండ్ రివ్యూ
మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావాన్ని తగ్గించుకుంటూ వివిధ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ‘కోటక్ మల్టీ అసెట్ అలొకేషన్’ ఫండ్ ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. కేవలం ఈక్విటీలకే పరిమితం కాకుండా, ఒకే పథకం ద్వారా ఈక్విటీ, డెట్, కమోడిటీస్ (బంగారం, వెండి) వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడులు చేసేలా ఈ ఫండ్‌ను రూపొందించారు. వివిధ అసెట్ క్లాస్‌లు భిన్నమైన మార్కెట్ పరిస్థితుల్లో భిన్నంగా స్పందించడం వల్ల పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం ఏర్పడుతుంది.
కోటక్ ఫండ్ కూడా ఈక్విటీ, డెట్, మనీ మార్కెట్ సాధనాలతో పాటు కమోడిటీ ఈటీఎఫ్‌లు, కమోడిటీ డెరివేటివ్స్‌లో పెట్టుబడులు చేస్తుంది. కావున ఒకే పథకం ద్వారా వివిధ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది పరిశీలించదగిన ఎంపిక. సిప్ ద్వారా క్రమంగా పెట్టుబడి చేసే అవకాశం ఉండటం మరో సౌలభ్యం. అయితే పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఫండ్ రిస్క్, ఆస్తుల కేటాయింపు, గత పనితీరు వంటి అంశాలను పరిశీలించడం అవసరం.
‘మూడు ఆస్తులపై పెట్టుబడి’ వ్యూహం
కోటక్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ పెట్టుబడి వ్యూహంలో ఈక్విటీ, డెట్, కమోడిటీస్‌కు సమాన ప్రాధాన్యం ఉంది. షేర్లతో పాటు డెట్, మనీ మార్కెట్ సాధనాలు, కమోడిటీ ఈటీఎఫ్‌లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్‌లో పెట్టుబడి చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఆగస్టు 31, 2026 నాటికి ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో 37.13% లార్జ్‌క్యాప్, 16.07% మిడ్‌క్యాప్, 16.51% స్మాల్‌క్యాప్ షేర్లు ఉండగా.. మరో 30.29% డెట్ అండ్ మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇక కమోడిటీస్ విభాగంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు చోటు కల్పించారు. ఈ విధంగా భిన్నమైన అసెట్ క్లాసెస్‌లలో నిధులను విభజించడం ద్వారా ఒకే మార్కెట్‌పై పూర్తిగా ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నం కనిపిస్తుంది. అయితే, మల్టీ అసెట్ విధానం మార్కెట్ ఒడుదుడుకుల నుంచి కొంత రక్షణ కల్పించినప్పటికీ, నష్టాల నుంచి పూర్తిస్థాయిలో హామీ ఇస్తుందని భావించలేము.
ఈక్విటీకి సింహభాగం
ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఆగస్టు 31, 2026 నాటికి ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఏకంగా 70.05% మేర నిధులను పెట్టుబడి పెట్టారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్స్, పవర్, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం వంటి అగ్రగామి రంగాల్లో ఈ పెట్టుబడులు విస్తరించి ఉన్నాయి. రంగాలవారీగా పరిశీలిస్తే.. బ్యాంకింగ్ రంగం 11.33% వాటాతో అగ్రస్థానంలో ఉండగా, ఫైనాన్స్ 5.98%, ఆటోమొబైల్స్ 5.02%, పవర్ 4.92% చొప్పున నిధులను కేటాయించారు. ప్రధాన హోల్డింగ్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతీ సుజుకీ, ఎటర్నల్, ఎన్‌టీపీసీ, ఐటీసీ ఉన్నాయి.
వివిధ రంగాలు, కంపెనీలకు పెట్టుబడులను విస్తరించడం ద్వారా ఈక్విటీ భాగాన్ని నిర్మించారు. తద్వారా కేవలం లార్జ్‌క్యాప్ కంపెనీలకే పరిమితం కాకుండా, వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండే మధ్య, చిన్న స్థాయి సంస్థలకూ పోర్ట్‌ఫోలియోలో సముచిత స్థానం కల్పించారు. మిగిలిన నిధులను డెట్, మనీ మార్కెట్, బంగారం, వెండి వంటి ప్రత్యామ్నాయ సాధనాల్లో ఉంచడం ద్వారా ఈక్విటీ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి పోర్ట్‌ఫోలియోకు రక్షణ కల్పిస్తూ చక్కటి సమతుల్యతను పాటించారు. మొత్తం ఫండ్ ఆస్తుల పరిమాణం ఆగస్టు చివరికి రూ.15,282 కోట్లుగా ఉంది.
బంగారం, వెండితో పోర్ట్‌ఫోలియో వైవిధ్యం
ఈ ఫండ్ వ్యూహంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు సముచిత స్థానం కల్పించారు. సాధారణంగా ఈక్విటీ మార్కెట్ల కదలికలకు భిన్నంగా స్పందించే కమోడిటీ సాధనాలను పోర్ట్‌ఫోలియోలో చేర్చడం ద్వారా పెట్టుబడుల రిస్క్‌ను మరింత విస్తరించారు. బంగారం, వెండి ధరల కదలికలు అంతర్జాతీయ మార్కెట్లు, డాలర్ మారకపు విలువ, వడ్డీ రేట్లు, సరఫరా–డిమాండ్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఈ సాధనాలకు ఈక్విటీలతో పోలిస్తే భిన్నమైన ‘రిటర్న్ ప్రోఫైల్’ ఉండే అవకాశం ఉంది.
కోటక్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ కేవలం భౌతిక రూపంలో కాకుండా, కమోడిటీ ఈటీఎఫ్‌లతో పాటు ఎక్సే్చంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టే వెసులుబాటు కలిగి ఉంది. ఆగస్టు 31 నాటికి పోర్ట్‌ఫోలియోలో కేవలం ‘కమోడిటీ ఫ్యూచర్స్’ వాటానే 3.61 శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే, విలువైన లోహాలకు కేటాయింపు చేయడం ఈ ఫండ్ మల్టీ అసెట్ పెట్టుబడి విధానంలో మరో కీలకమైన బలంగా కనిపిస్తుంది.
రాబడుల్లో బెంచ్‌మార్క్‌పై ఆధిక్యం
కోటక్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఆగస్టు 31, 2026 నాటికి ఏడాది కాల వ్యవధిలో 16.02% రాబడిని నమోదు చేసింది. ఇదే సమయంలో దీని బెంచ్‌మార్క్ రాబడి 8.05% వద్ద మాత్రమే ఉంది. ఇక పథకం ప్రారంభం నుంచి చూస్తే.. ఫండ్ సీఏజీఆర్ రాబడి 16.90% కాగా, బెంచ్‌మార్క్ రాబడి 13.51%గా నమోదైంది. అయితే, గత ఆరు నెలల కాలంలో ఈ ఫండ్ 2.55% రాబడిని ఇవ్వగా.. బెంచ్‌మార్క్ 3.15% రాబడితో దీనికంటే కొంత ముందుంది. దీన్నిబట్టి స్వల్పకాలిక పనితీరులో కొన్ని హెచ్చుతగ్గులు సహజమే అయినప్పటికీ, ఏడాది, ప్రారంభం నుంచి చూస్తే మాత్రం ఈ ఫండ్ బెంచ్‌మార్క్‌ను మించి మెరుగైన రాబడులను అందించినట్లు స్పష్టమవుతోంది.

ఎవరికి అనుకూలం..?
ఈ ఫండ్ ద్వారా ఈక్విటీతో పాటు డెట్, బంగారం, వెండి వంటి మల్లీ అసెట్‌లో ఒకే పథకం ద్వారా పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది చక్కటి ఎంపిక కావచ్చు. ముఖ్యంగా కనీసం అయిదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పెట్టుబడిని కొనసాగించగల శక్తి ఉన్నవారికి, వివిధ అసెట్ క్లాసెస్‌లో రిస్క్‌ను విస్తరించుకోవాలనుకునే వారికి ఈ ఫండ్ పరిశీలించదగినది. అయితే, ఈ ఫండ్‌లో ఈక్విటీ వాటా గణనీయంగా (సుమారు 70%) ఉండటంతో మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం పూర్తిగా తొలగిపోదని గమనించాలి.
అందువల్ల, స్వల్పకాలంలో స్థిరమైన రాబడులను ఆశించే వారి కంటే.. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోగల సామర్థ్యం ఉండి, దీర్ఘకాలిక సంపద సృష్టిని కోరుకునే వారు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ ప్రొఫైల్‌కు తగినట్లుగా నిపుణుల సలహాతో నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. కోటక్ మ్యూచువల్ ఫండ్ అధికారిక మార్గదర్శకాల ప్రకారం కూడా ఈ పథకానికి కనీసం అయిదేళ్ల లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి కాలపరిమితి సరిపోతుందని సూచించబడింది.


