2028 మార్చి 31 వరకు పెంపు – సబ్సిడీ సగానికి కోత
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ’పీఎం ఈ–డ్రైవ్’ స్కీము గడువును 2028 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. అయితే, దీనిపై ఇచ్చే సబ్సిడీని రూ. 5,000 నుంచి (కిలోవాట్‌హవర్‌కి – కేడబ్ల్యూహెచ్) సగానికి రూ. 2,500కి తగ్గించింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 2025 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ప్రతి కేడబ్ల్యూహెచ్ సామర్థ్యానికి రూ. 2,500 మేర సబ్సిడీ పొందవచ్చు. ఒక్కో వాహనంపై సబ్సిడీ గరిష్టంగా రూ. 5,000 ఉంటుంది.
గతంలో, అంటే, 2024–25 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ ప్రతి కేడబ్ల్యూహెచ్‌కి రూ. 5,000గాను, గరిష్ట పరిమితి రూ. 10,000గాను ఉంది. తాజా ప్రోత్సాహకాన్ని పొందాలంటే ఈ–టూవీలర్ ఎక్స్–ఫ్యాక్టరీ రేటు గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలుగా ఉంటుంది. ఈ స్కీము తాజా విడత కోసం కేంద్రం రూ. 2,767 కోట్లు కేటాయించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు అమలయ్యే పీఎం ఈ–డ్రైవ్ పథకానికి మొత్తం రూ. 11,900 కోట్లు వెచ్చిస్తోంది.


