కేంద్రం కీలక నిర్ణయం.. EV కొనేవారికి గుడ్‌న్యూస్‌! | Govt Extends PM E Drive Subsidy for Electric Two Wheelers to FY28 | Sakshi
Sakshi News home page

కేంద్రం కీలక నిర్ణయం.. EV కొనేవారికి గుడ్‌న్యూస్‌!

Aug 11 2026 4:51 PM | Updated on Aug 11 2026 5:10 PM

Govt Extends PM E Drive Subsidy for Electric Two Wheelers to FY28

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ డ్రైవ్ (PM E-Drive) పథకం కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు ఇచ్చే సబ్సిడీని 2028 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించింది.

నిజానికి ఈ సబ్సిడీ గడువు 2026 ఆర్థిక సంవత్సరంతో ముగియాల్సి ఉండగా, మరో రెండేళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించనుంది.

పెరిగిన బడ్జెట్
ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే?.. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కోసం కేటాయించిన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం పెంచింది. ఇదివరకు దీనికోసం రూ.1,772 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. ఇప్పుడు దీనిని రూ.2,767 కోట్లకు పెంచింది. అంతే కాకుండా.. సబ్సిడీ పొందే వాహనాల సంఖ్యను 24 లక్షల నుంచి 45.7 లక్షలకు పెంచారు.

ఎలక్ట్రిక్ టూ-వీలర్‌కు బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలోవాట్‌కు రూ. 2,500 సబ్సిడీ లభిస్తుంది. గరిష్ఠంగా రూ.5,000 వరకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఈ సబ్సిడీని క్లెయిమ్ చేసుకునే చివరి తేదీ 2027 డిసెంబర్ 31గా నిర్ణయించారు.

పెరుగుతున్న ఈవీ సేల్స్
దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 2021-22లో సుమారు 2.53 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడవగా, 2025-26 నాటికి ఈ సంఖ్య 14.6 లక్షలకు చేరింది. మరోవైపు పెట్రోల్ టూ-వీలర్ల అమ్మకాలు కొంత తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం వల్ల పెట్రోల్ ఖర్చు తగ్గడంతో పాటు, దేశం ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా టూ-వీలర్లు దేశంలో పెద్ద మొత్తంలో పెట్రోల్ వినియోగిస్తున్నందున, ఈ మార్పు ప్రభావం గణనీయంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం వల్ల కాలుష్యాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు. మరోవైపు సబ్సిడీని 2028 వరకు కొనసాగించడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు కూడా భవిష్యత్తుపై మరింత స్పష్టత వస్తుంది. దీంతో కంపెనీలు పెట్టుబడులు పెంచి ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉంది. మొత్తం మీద.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులతో పాటు దేశంలో ఈవీ మార్కెట్‌కు కూడా ఊతమిచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement