దేశీయ ఐటీ సేవల రంగానికి చెందిన ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగుల వ్యక్తిగత వివరాల లీకేజీ వార్తలపై అధికారికంగా స్పందించింది. కొంతమంది ఉద్యోగులకు సంబంధించిన ప్రాథమిక సమాచారం బహిర్గతం అయ్యే అవకాశం ఉందంటూ 'త్రెట్ ఇంటెలిజెన్స్' హెచ్చరికలు జారీ చేసింది. దాంతో సంస్థ స్పందించి సైబర్ భద్రతా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో తమ కస్టమర్ల డేటా, వ్యాపార వ్యవస్థలు, అంతర్గత నెట్‌వర్క్‌లు అత్యంత సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి డేటా చోరీ జరగలేదని టీసీఎస్ స్పష్టం చేసింది.
నాలుగేళ్ల క్రితం నాటి డేటా?
బహిర్గతం అయినట్లు ప్రచారం జరుగుతున్న ఉద్యోగుల డేటా దాదాపు నాలుగేళ్ల క్రితం నాటిదని, అది కూడా కేవలం ప్రాథమిక వివరాలకు మాత్రమే పరిమితమైందని టీసీఎస్ వెల్లడించింది. హ్యాకర్లు ‘పాస్‌వర్డ్ స్ప్రే’, 'మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫెటీగ్' వంటి సైబర్ దాడి పద్ధతులను ఉపయోగించినట్లు దావా వేసినప్పటికీ తమ రక్షణ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఈ తరహా సైబర్ దాడులను నిరోధించేందుకు అత్యంత బలమైన సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను అమలు చేస్తున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ దాఖలు చేసిన నివేదికలో పేర్కొంది.
సైబర్ భద్రతపై ముమ్మర నిఘా
క్లయింట్ల నమ్మకాన్ని, డేటా భద్రతను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేసిన టీసీఎస్ ప్రస్తుతం ఐటీ నెట్‌వర్క్ వాతావరణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. సైబర్ ముప్పులపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ అవసరమైన తక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.
ఇటీవలే టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి సంస్థలు సైబర్ దాడులను ఎదుర్కొన్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం టీసీఎస్ సైబర్ భద్రతా విభాగాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. సంస్థల సమాచార భద్రతపై గ్లోబల్ క్లయింట్లలో ఎటువంటి ఆందోళన కలగకుండా ముందస్తుగా ఈ ప్రకటన విడుదల చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..


