వేగవంతమైన డెలివరీల పేరుతో క్విక్-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ బ్లింకిట్‌కు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌డీఏ) గట్టి షాక్ ఇచ్చింది. ముంబైలోని మలాడ్ వెస్ట్ పరిధిలో ఉన్న బ్లింకిట్ డార్క్ స్టోర్‌లో తీవ్రమైన పారిశుధ్య లోపాలు, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు ఆ స్టోర్ లైసెన్స్‌ను (లైసెన్స్ సంఖ్య: 11524010000119) సస్పెండ్ చేస్తూ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.
తనిఖీల్లో వెలుగుచూసిన ఘోరాలు
ఎఫ్‌డీఏ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. స్టోర్‌లోని పండ్లు, కూరగాయల విభాగంలో పెద్ద ఎత్తున బొద్దింకల సంచారం, తుప్పు పట్టిన రాక్‌లపై, నేరుగా నేలపై ఆహార పదార్థాల పొట్లాలను నిల్వ ఉంచడం అధికారుల దృష్టికి వచ్చింది. కోల్డ్ స్టోరేజ్ విభాగాన్ని ఏమాత్రం శుభ్రపరచకపోవడమే కాకుండా, గడువు తీరిన (ఎక్స్‌పైర్డ్), దెబ్బతిన్న ఆహార ఉత్పత్తులు ప్యాకింగ్ నిల్వల్లో ఉండటం గమనార్హం. ఆహార నిర్వహణలో పాటించాల్సిన ఫస్ట్-ఇన్ ఫస్ట్-అవుట్/ ఫస్ట్-ఎక్స్‌పైరీ, ఫస్ట్-అవుట్ పద్ధతులను పూర్తిగా విస్మరించారని ఎఫ్‌డీఏ తన నివేదికలో తెలిపింది. ఎలుకలు, కీటకాల నివారణ చర్యలు శూన్యమని స్పష్టం చేసింది.
సిబ్బంది ఆరోగ్యంపై నిర్లక్ష్యం
ఆహారాన్ని నిర్వహించే సిబ్బందికి సంబంధించి ఎలాంటి ఉచిత వైద్య తనిఖీలు లేదా ఆరోగ్య రికార్డులు అందుబాటులో లేవని, వారి వ్యక్తిగత పరిశుభ్రత కూడా అధ్వానంగా ఉందని తనిఖీల్లో తేలింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 (FSS Act) సెక్షన్ 32(3) ప్రకారం ఈ సస్పెన్షన్ వేటు వేశారు. ఉత్తర్వులు అమల్లో ఉన్నంతకాలం ఈ ఫెసిలిటీ నుంచి ఎలాంటి ఆహార విక్రయాలు లేదా పంపిణీ చేయకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.
వినియోగదారుల ఆరోగ్యం ప్రశ్నార్థకం
10 నిమిషాల డెలివరీ పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు బ్యాక్ ఎండ్‌లో కనీస పారిశుధ్యాన్ని కూడా విస్మరించడం వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడటమే. సేవల్లో వేగం ఎంత ముఖ్యమో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల నిర్వహణ అంతకంటే ముఖ్యమని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..


