కరెన్సీ నోట్ల విషయంలో కేంద్రం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పేపర్ నోట్లకు బదులుగా పాలిమర్(ప్లాస్టిక్)తో తయారు చేసిన నోట్లను ప్రయోగాత్మకంగా తీసుకురావడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.
ముందు రూ.10, రూ.20 నోట్లపై ఈ ప్రయోగం చేయనున్నారు. ఒక్కో డినామినేషన్‌కు 100 కోట్ల నోట్లను తయారు చేసి, ప్రజల మధ్య చలామణిలోకి తీసుకువచ్చి ఎలా పనిచేస్తాయో పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని పాలిమర్ కరెన్సీ నోట్లు వచ్చే అవకాశం ఉంటుంది.
కొత్త పాలిమర్ నోట్లు వస్తున్నాయని.. పాత పేపర్ నోట్లు వెంటనే రద్దు అవుతాయని ప్రజలు భయపడాల్సిన అవకాశం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉన్న పేపర్ నోట్లతో పాటు కొత్త పాలిమర్ నోట్లు కూడా చలామణిలో ఉంటాయి. ముందుగా ఈ నోట్లు రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎంతకాలం మనగలుగుతున్నాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి వంటి విషయాలను రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తుంది.
ట్రయల్స్ సక్సెస్ అయితే.. తర్వాత వీటిని రెగ్యులర్‌గా చలామణిలోకి తీసుకురావాలని ఆర్‌బీఐ ఆలోచిస్తోంది. పాలిమర్ నోట్లు.. కాగితం నోట్ల కంటే కొంత భిన్నంగా ఉంటాయి. ఇవి పలుచని ప్లాస్టిక్ లాంటి పదార్థంతో తయారవుతాయి. అందువల్ల నీటికి, తేమకు, దుమ్ముకు తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.
పేపర్ నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. నకిలీ నోట్లను తయారు చేయడం కూడా కొంత కష్టంగా ఉండేలా భద్రతా ఫీచర్లు ఏర్పాటు చేయవచ్చు. ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని పాలిమర్ నోట్లు వాడుతున్నారు. భారత్‌లో కూడా గతంలో పరిమిత స్థాయిలో వీటిని పరీక్షించారు.
కొత్త నోట్లు ఎప్పటి నుంచి మన చేతుల్లోకి వస్తాయనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. పాలిమర్ నోట్ల తయారీకి సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదటి దశలోనే ఉందని ప్రభుత్వం తెలిపింది. నోట్ల తయారీకి అవసరమైన మెటీరియల్, ప్రింటింగ్ ఏర్పాట్లు, ట్రయల్స్ ఎక్కడ నిర్వహించాలి వంటి విషయాలపై ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్!


