ఏఐపై మానవ పర్యవేక్షణ ఉండాల్సిందే...
బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నిర్దేశం
ముంబై: బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడళ్లను రూపొందించేటప్పుడు, నిర్ణయాలపై అర్థవంతమైన మానవ పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలని బ్యాంకర్లకు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. తప్పుడు నిర్ణయాలకు టెక్నాలజీ టూల్స్‌ను నిందించడం ఆర్‌బీఐకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ జరిగిన వార్షిక ‘ఫిబాక్’ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు మానవ విచక్షణను ఏఐతో భర్తీ చేస్తే సరిపోదని, నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే విధంగా ఏఐని సరైన రీతిలో వినియోగించుకోవాలని బ్యాంకులను కోరారు.
ఏఐని అదుపులో పెట్టాల్సిన ఒక రిసు్కలా కాకుండా, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన సామర్థ్యంగానే ఆర్‌బీఐ పరిగణిస్తోందని మల్హోత్రా చెప్పారు. కాబట్టి బ్యాంకులు ప్రేక్షక పాత్రకు పరిమితం కాకుండా, ఈ టూల్స్‌ను అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘ఒక బ్యాంకు తీసుకునే నిర్ణయానికి అంతిమ బాధ్యత దానిదే కావాలి తప్ప విక్రేతదో లేదంటే ఆల్గారిథమ్‌దో కాకూడదు. ఏఐ మోడల్ నిర్ణయం తీసుకుందని మనం చెప్పలేం. వినియోగదారుడికైనా, అదేవిధంగా బ్యాంకుకైనా అది ఎప్పటికీ ఆమోదయోగ్యమైన సమాధానం కాదు’ అని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు. కస్టమర్ సర్వీసులతో సహా వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ఈ మధ్య పలు భారతీయ బ్యాంకులు ఏఐ టూల్స్‌ను భారీగా వాడుకోవడం, ఏఐ వల్ల కొంత కాలానికి వివిధ రంగాల్లో ఉద్యోగ కోతలు తప్పవన్న ఆందోళనల నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సైబర్ సెక్యూరిటీ రిసు్కలు పొంచి ఉన్నాయ్...
సైబర్ సెక్యూరిటీ రిసు్కలతో సహా ఏఐ వల్ల బ్యాంకింగ్ రంగానికి తలెత్తే ముప్పుల పట్ల బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. ఇటీవల ఒక ఏఐ మోడల్ స్వయంగా సిస్టమ్‌పై దాడి చేసిన సంఘటనను ఆయన ఉదహరించారు. ఏఐ మోడళ్లు పక్షపాత ధోరణితో వ్యవహరించే రిస్కులు కూడా ఉంటాయన్నారు. ముఖ్యంగా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలు, హోదాలు, అదేవిధంగా కొన్ని వర్గాల పట్ల ఇష్టం, అయిష్టం చూపించే ధోరణులు ఉండొచ్చని ఆయన హెచ్చరించారు. డేటా గోప్యత అనేది కేవలం చట్టపరమైన నిబంధనలను పాటించడానికే పరిమితం కాకుండా చూసుకోవాలన్నారు. బ్యాంకుల్లో వాస్తవంగా ఎలాంటి ఏఐ మోడళ్లు పనిచేస్తున్నాయనేది ఆర్‌బీఐకి తెలియాలని, కాబట్టి ఆయా మోడల్స్‌కు సంబంధించిన పూర్తి జాబితాను నిర్వహించాలని కూడా బ్యాంకులకు మల్హోత్రా సూచించారు.


