పశ్చిమాసియా ఘర్షణ ప్రభావం కొంతే
మార్జిన్లు 100 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చు
శాంతి ఒప్పందం కొనసాగితేనే
క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఘర్షణల కారణంగా భారత కంపెనీల లాభాదాయకత ముందు అంచనా వేసిన స్థాయిలో ప్రభావితం కాకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. యూఎస్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగడంతోపాటు, ఇంధన సరఫరాలు సాధారణ స్థితికి రావడంపైనే ఈ ప్రభావం ఆధారపడి ఉంటుందని తెలిపింది.
పశ్చిమాసియా సంక్షోభంతో 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీల నిర్వహణ మార్జిన్లు 100 బేసిస్ పాయింట్లు (ఒక శాతం) తగ్గిపోవచ్చని తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఘర్షణలు ఎక్కువ కాలం పాటు కొనసాగొచ్చని, హర్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకోకపోవచ్చన్న అంచనా ఆధారంగా.. కంపెనీల లాభదాయకత 200 బేసిస్ పాయింట్లు తగ్గిపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ లోగడ పేర్కొనడం గమనార్హం. అమెరికా–ఇరాన్ మధ్య ఈ నెలలో కుదిరిన అవగాహన ఒప్పందంతో హర్మూజ్ జలసంధి తెరుచుకోవడం తెలిసిందే.
దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా దిగొచ్చాయి. బ్రెంట్ బ్యారెల్ 73 డాలర్ల స్థాయికి పడిపోయింది. యుద్ధ సమయంలో ఒక దశలో 121 డాలర్ల వరకు వెళ్లడం చూశాం. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటూ, గ్యాస్ సరఫరా సాధారణ స్థాయికి చేరుకునేందుకు చాలా కాలమే పట్టొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కార్పొరేట్ ఇండియా సరఫరా వైవిధ్యంపై దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు సగటున 80–85 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది.
కొన్ని రంగాలపై ఎక్కువ ప్రభావం..
పశ్చిమాసియా ఘర్షణలతో 22 రంగాల కంపెనీల లాభదాయకతపై ఎక్కువ ఒత్తిడి పడొచ్చని క్రిసిల్ లోగడ అంచనా వేయగా.. ఇప్పుడు పది రంగాలపైనే ఈ ప్రభావం చెప్పకోతగ్గ స్థాయిలో ఉంటుందని తెలిపింది. అంతేకానీ, భారీగా ఆదాయం, లాభాలు తగ్గడం ఉండదని స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్స్ (విమానయాన సంస్థలు), సిరామిక్స్, పాలిస్టర్ టెక్స్‌టైల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్యాకేజింగ్, వజ్రాల పాలిíÙంగ్ కంపెనీలపై ఎక్కువగా ఒత్తిళ్లు ఉండొచ్చంటూ.. వీటికి ధరల నిర్ణయంలో వెసులుబాటు లేకపోవడం, సరఫరా సమస్యలు, అధిక ముడి సరకుల వ్యయాలు, బలహీన లాభదాయకత, అధిక మూలధన అసవసరాలు, బలహీన బ్యాలన్స్ షీట్లను కారణాలుగా పేర్కొంది. దీంతో ఈ కంపెనీల క్రెడిట్ రేటింగ్ ప్రతికూలంగా మారే రిస్క్ లేకపోలేదని తెలిపింది.
ముడి చమురు ధరలు దిగిరావడం, గ్యాస్ సరఫరాలు మెరుగుపడడం చాలా రంగాలకు ఉపశమనాన్నిస్తుందని అంచనా వేసింది. దీనికితోడు ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై నిధులు ఖర్చు చేస్తుండడం, దేశీ వినియోగ డిమాండ్ ఆదాయ వృద్ధికి అనుకూలిస్తాయని తెలిపింది. అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్) 5.0 కింద రూ.2.55 లక్షల కోట్ల అదనపు రుణ సాయం, ఎయిర్‌లైన్స్‌కు ప్రత్యేకంగా రూ.5,000 కోట్లు అన్నవి నిధుల అవసరాలను తీరుస్తాయని అభిప్రాయపడింది.
లాభాల్లోకి చమురు కంపెనీలు
ఇంధన ధరలు తగ్గడంతో ఆయిల్ మార్కెటింగ్, ఎరువుల కంపెనీలు ఎక్కువగా ప్రయోజనం పొందుతాయని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు మార్చి నుంచి మే మధ్య రూ.40,000–45,000 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నాయని, ధరలు దిగిరావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవి నిర్వహణ లాభంలోకి తిరిగి అడుగు పెడతాయని తన నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా రెండు రిస్‌్కలు పొంచి ఉన్నట్టు తెలిపింది. యూఎస్–ఇరాన్ ఒప్పందం ముందుకు వెళ్లకుండా, ఘర్షణలు తిరిగి మొదలు కావడం ఒకటి కాగా.. ఎల్‌నినో కారణంగా వర్షాలు బలహీనపడితే గ్రామీణ వినియోగం సన్నగిల్లుతుందని అంచనా వేసింది.


