గోల్డ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌, డెరివేటివ్‌లకు కొత్త రూల్స్ | SEBI Rules Reform What New Vaulting Norms Mean for Gold Silver ETF Investors | Sakshi
Sakshi News home page

గోల్డ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌, డెరివేటివ్‌లకు కొత్త రూల్స్

Aug 12 2026 8:46 AM | Updated on Aug 12 2026 8:46 AM

SEBI Rules Reform What New Vaulting Norms Mean for Gold Silver ETF Investors

దేశీయ మూలధన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గోల్డ్, సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌), బులియన్ డెరివేటివ్‌లకు భద్రతగా ఉండే భౌతిక బంగారం, వెండి నిల్వల నిర్వహణపై కీలక సంస్కరణలు చేపట్టింది. 2021 నాటి సెబీ (వాల్ట్ మేనేజర్స్) నిబంధనల పరిధిని విస్తరిస్తూ తాజాగా ఒక సమగ్ర ప్రతిపాదనా పత్రాన్ని విడుదల చేసింది.

ప్రస్తుతం కేవలం ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్‌) వ్యవస్థకు మాత్రమే పరిమితమైన వాల్ట్ మేనేజర్ల నిబంధనలను ఇకపై సెబీ పరిధిలోకి వచ్చే అన్ని పసిడి, వెండి ఈటీఎఫ్‌లు, కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్టుల వెనుక ఉన్న భౌతిక బులియన్ నిల్వలకు కూడా వర్తింపజేయాలని భావిస్తోంది. (డిజిటల్‌గా లేదా స్టాక్ మార్కెట్లో గోల్డ్/సిల్వర్ ఈటీఎఫ్‌లు లేదా కమోడిటీ కాంట్రాక్టులు కొన్నప్పుడు ఆ పెట్టుబడికి సమానమైన అసలైన భౌతిక బంగారాన్ని లాకర్లలో(వాల్ట్‌) సురక్షితంగా ఉంచాల్సి ఉంటుంది. అలా ఉంచే సెక్యూరిటీ సంస్థలనే వాల్ట్ మేనేజర్లు అంటారు).

ముఖ్యమైన సంస్కరణలు

  • మ్యూచువల్ ఫండ్స్, కమోడిటీ ఎక్స్ఛేంజీలు భద్రపరిచే భౌతిక బంగారం, వెండి నాణ్యతా పరిశీలన, ఆడిటింగ్, డిజిటలైజేషన్, సెక్యూరిటీ విధానాల్లో కఠినమైన ఏకరూపత ఏర్పడుతుంది.

  • వాల్ట్ మేనేజర్లను నేరుగా సెబీ నియంత్రణ పరిధిలోకి తీసుకురావడం వల్ల భౌతిక నిల్వల నిర్వహణలో వ్యత్యాసాలు, అక్రమాలకు తావుండదు. ఇది అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు స్టోరేజ్‌ భద్రతపై మరింత నమ్మకాన్ని ఇస్తుంది.

  • స్వదేశీ ఎక్స్ఛేంజీల స్పాట్ ధరలను వర్తింపజేసేందుకు సెబీ ఇప్పుడు భౌతిక నిల్వల భద్రతలోనూ సమగ్ర పారదర్శకత తీసుకొస్తోంది.

ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల వేళ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల్లో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం, ఆస్తుల పరిమాణం నిత్యం మారుతోంది. ఈ నేపథ్యంలో సెబీ తీసుకొస్తున్న నిబంధనల విస్తరణ భారతీయ బులియన్ మార్కెట్ల స్థిరత్వానికి, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు కీలకమైన అడుగుగా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై వాటాదారులు, మార్కెట్ వర్గాల నుంచి సెబీ ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది.

ఇదీ చదవండి: ‘నన్ను నగ్నంగా మార్చకండి!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement