మార్కెట్ ముగింపు ధరలను నిర్ణయించే విధానంలో ఇటీవల వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) డే ట్రేడర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్త విధానం రిటైల్ ట్రేడర్ల కంటే పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉందని ఆరోపిస్తూ కొందరు ట్రేడర్లు ఆగస్టు 12న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ను ఒకరోజు బహిష్కరించాలని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. సీఏఎస్‌తో పాటు అధిక సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT), తరచూ మారుతున్న మార్కెట్ నిబంధనలపైనా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ‘నో ట్రేడ్ డే’
దాదాపు 1.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఓ ట్రేడర్ ఎక్స్‌లో “ఎస్‌టీటీ, సీఏఎస్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 12న నో ట్రేడ్ డే” అంటూ పోస్టు చేశారు. మరో పోస్టులో రిటైల్ ట్రేడర్లపై ప్రభావం చూపుతున్న నిబంధనలు, పెరుగుతున్న పన్నులకు నిరసనగా ఒకరోజు ట్రేడింగ్ బహిష్కరణకు పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రచారం ఎంతమంది ట్రేడర్లను వాస్తవంగా ట్రేడింగ్‌కు దూరంగా ఉంచుతుందన్నది ఇంకా స్పష్టంగా లేదు.
అసలు సీఏఎస్‌లో ఏం మారింది?
సెక్యూరిటీస్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నిర్ణయం మేరకు సీఏఎస్‌ను 2026 ఆగస్టు 3 నుంచి అమల్లోకి తెచ్చారు. తొలిదశలో డెరివేటివ్స్ కాంట్రాక్టులు అందుబాటులో ఉన్న స్టాక్స్‌కు ఇది వర్తిస్తోంది. ఇంతకుముందు ఈ స్టాక్స్ ముగింపు ధరను సాధారణ ట్రేడింగ్‌లో చివరి 30 నిమిషాల్లో జరిగిన లావాదేవీల VWAP ఆధారంగా నిర్ణయించేవారు.
కొత్త విధానంలో సంబంధిత స్టాక్స్ సాధారణ నిరంతర ట్రేడింగ్ మధ్యాహ్నం 3:15 గంటలకే ముగుస్తుంది. అనంతరం 3:15–3:35 మధ్య 20 నిమిషాల సీఏఎస్ జరుగుతుంది. 3:00–3:15 మధ్య ట్రేడింగ్ ఆధారంగా రిఫరెన్స్ ధరను నిర్ణయించి, ఆ తర్వాత కొనుగోలు, విక్రయ ఆర్డర్లను ఒకచోట సమీకరిస్తారు. చివరికి గరిష్ఠంగా సాధ్యమైన లావాదేవీల పరిమాణాన్ని అమలు చేయగల ఈక్విలిబ్రియం ధరనే ఆ రోజు అధికారిక ముగింపు ధరగా నిర్ణయిస్తారు. ఆర్డర్ ఎంట్రీ చివరి దశలో 3:28–3:30 మధ్య యాదృచ్ఛికంగా ముగిసే విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు.
నిఫ్టీ–సెన్సెక్స్ మధ్య వ్యత్యాసమే అసలు భయం?
సీఏఎస్ అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లో నిఫ్టీ, సెన్సెక్స్ ముగింపు స్థాయిల్లో అసాధారణ వ్యత్యాసం కనిపించడం ట్రేడర్ల ఆందోళనకు మరో కారణంగా మారింది. సీఏఎస్ కారణంగా F&O స్టాక్స్ క్యాష్ మార్కెట్ ముగింపు ధర నిర్ణయించే సమయం, ఇతర స్టాక్స్ ట్రేడింగ్ సమయం వేర్వేరుగా మారడంతో సూచీల కదలికల్లో తేడాలు కనిపించాయి. ముఖ్యంగా డెరివేటివ్స్ గడువు ముగిసే రోజుల్లో చివరి దశలో ధరల్లో వేగవంతమైన మార్పులు రావడంతో ఆప్షన్ ట్రేడర్లకు అనూహ్యమైన లాభనష్టాలు ఏర్పడే పరిస్థితి కనిపించింది.
సెబీ వాదన మాత్రం వేరే..
అయితే సీఏఎస్‌ను తీసుకురావడం వెనుక ఉద్దేశం రిటైల్ ట్రేడర్లకు నష్టం చేయడం కాదని నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. చివరి నిమిషాల్లో పెద్ద ఆర్డర్ల ప్రభావంతో ధరలు అస్థిరంగా మారకుండా, ఒకే ధర వద్ద ఎక్కువ లిక్విడిటీని సమీకరించి మరింత స్థిరమైన, పారదర్శకమైన ముగింపు ధరను కనుగొనడమే లక్ష్యమని సెబీ పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లలోనూ ఇలాంటి క్లోజింగ్ ఆక్షన్ విధానాలు అమల్లో ఉన్నాయని తెలిపింది.
ప్రత్యేకంగా మ్యూచువల్ ఫండ్స్, పాసివ్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు వంటి సంస్థలకు ఒకే ముగింపు ధర వద్ద లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కల్పించడం ద్వారా ఇండెక్స్ ట్రాకింగ్ ఎర్రర్‌ను తగ్గించవచ్చని సెబీ అభిప్రాయపడుతోంది. అలాగే చివరి నిమిషాల్లో జరిగే భారీ సంస్థాగత లావాదేవీల వల్ల ధరల్లో ఏర్పడే వక్రీకరణలను తగ్గించడంలో సీఏఎస్ సహాయపడుతుందని రెగ్యులేటర్ భావిస్తోంది.
ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 12పైనే..
సీఏఎస్ అమల్లోకి వచ్చి వారం రోజులు కూడా పూర్తికాకముందే ట్రేడర్ల నుంచి నిరసనకు పిలుపు రావడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు ధరల ఆవిష్కరణను మెరుగుపరచడమే సీఏఎస్ లక్ష్యమని సెబీ చెబుతుండగా, మరోవైపు చివరి 20 నిమిషాల్లో మార్కెట్ కదలికలను అర్థం చేసుకోవడం కష్టమవుతోందని డే ట్రేడర్లు వాదిస్తున్నారు. దీంతో ఆగస్టు 12న పిలుపునిచ్చిన ‘నో ట్రేడ్ డే’కు ఎంతమేర స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం ఇది ట్రేడర్ల సోషల్ మీడియా ప్రచారమే తప్ప అధికారిక ట్రేడింగ్ బంద్ కాదు.
12 August 2026. One day. No trades. No orders. 📵
Retail traders are standing together to peacefully protest the SEBI rules and rising taxes that hit the small trader hardest.
We trade. We pay taxes. We deserve fair rules.
If you back it, take part peacefully on 12th Aug and… pic.twitter.com/fniGkUKIJl— FIIDII Data (@Fii_Dii_Data) August 7, 2026


