లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్..
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే విషయంలో ‘పెట్టుబడి పెట్టాలా వద్దా’ అని కాకుండా .. ‘ఎందులో పెట్టాలి’ అనేదే అత్యంత క్లిష్టమైన సవాలుగా అనిపిస్తుంది. సాధారణంగా చాలాకాలంగా లార్జ్ క్యాప్ కంపెనీలు స్థిరత్వానికి, నిలకడైన వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ, పోర్ట్‌ఫోలియోలకు దన్నుగా నిలుస్తున్నాయి. మరోవైపు, మిడ్ క్యాప్ స్టాక్స్.. కార్పొరేట్ రంగ తదుపరి వృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశాలను కల్పిస్తున్నాయి. అయితే, ఈ రెండింటికీ పోర్ట్‌ఫోలియోల్లో స్థానం ఉంటున్నప్పటికీ, వీటి మధ్య సరైన సమతుల్యతను సాధించడం చెప్పినంత ఈజీ కాదు.
మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ డేటా ప్రకారం ’లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్’ కేటగిరీలోకి నిధుల ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2025 జూన్‌లో రూ. 3,497 కోట్లుగా ఉన్న పెట్టుబడులు, 2026 జూన్ నాటికి 24 శాతం పెరిగి రూ. 4,321 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఫక్తు లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలోకి పెట్టుబడులు ఒక మోస్తరుగానే వృద్ధి చెంది రూ. 2,067 కోట్లు వచ్చాయి. ఈక్విటీ పెట్టుబడుల్లోనే డైవర్సిఫికేషన్ ద్వారా మిడ్ క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి సామర్థ్యాన్ని, లార్జ్ క్యాప్ కంపెనీల స్థిరత్వం అలాగే లిక్విడిటీ ప్రయోజనాలను కూడా పొందాలని భావిస్తున్న ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఇది
తెలియజేస్తోంది.
ఈ కేటగిరీకి ఎందుకింత ప్రాధాన్యత..
లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ప్రత్యేకత అంతా కూడా దీన్ని నిర్వహించే విధానంలోనే ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం ఈ ఫండ్స్ తమ దగ్గరున్న నిధుల్లో కనీసం 35 శాతాన్ని లార్జ్ క్యాప్ కంపెనీల్లో, మరో 35 శాతాన్ని మిడ్ క్యాప్ కంపెనీల్లో తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. మిగతా భాగాన్ని ఫండ్ మేనేజర్ తన విచక్షణకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ విధానం వల్ల రెండు విభాగాల్లోనూ ఎప్పుడూ సరైన ప్రాతినిధ్యం ఉండటమే కాకుండా, అధిక లాభాలకు ఆస్కారమున్న సాధనానికి కేటాయింపులను పెంచేందుకు వీలుంటుంది.
డబుల్ ప్రయోజనాలు..
సాధారణంగా లార్జ్ క్యాప్ కంపెనీలకు నిరూపితమైన వ్యాపార మోడల్స్, పటిష్టమైన బ్యాలెన్స్ ఉంటాయి. ఆర్థిక సవాళ్లను తట్టుకుని నిలబడే సామర్థ్యాలు ఉండటం వల్ల మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా కూడా పోర్ట్‌ఫోలియోకి ఇవి కొంత స్థిరత్వాన్ని ఇస్తాయి. ఇక మిడ్ క్యాప్ కంపెనీలను చూస్తే ఇవి చిన్న సంస్థలకంటే మెరుగైన వృద్ధి దశలో ఉండి, ఇంకా లార్జ్ క్యాప్ స్థాయికి చేరుకోనివై ఉంటాయి. వ్యాపార విస్తరణ, మార్కెట్‌లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, లాభదాయకతను పెంచుకోవడం ద్వారా ఇవి దీర్ఘకాలంలో అధిక ఆదాయ వృద్ధిని అందిస్తాయి.
అయితే, దీనికి తగ్గట్లుగానే వీటిలో రిస్క్‌లు, ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ రెండింటి కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెట్లోని పలు రంగాల్లో లార్జ్ క్యాప్‌లు ఆకర్షణీయమైన విలువకే లభిస్తుండగా, మిడ్ క్యాప్‌లు మరింత మెరుగైన రాబడిని పొందే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ రెండింటినీ కలపడం ద్వారా ఒకే పోర్ట్‌ఫోలియో ద్వారా ఇన్వెస్టర్లు స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలనూ పొందవచ్చు.
నిబంధనలకు ప్రాధాన్యత..
ఈ కేటగిరీ కేవలం విభిన్న క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీల కలయికగా మాత్రమే కాకుండా, పెట్టుబడులను సొంతంగా నిర్వహించుకునే ఇన్వెస్టర్లకు ఎదురయ్యే ఒక ప్రధాన సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా చూపుతుంది. చాలామంది ఇన్వెస్టర్లు ఇటీవల బాగా రాణించిన రంగాల్లోనే పెట్టుబడులు పెట్టడమో లేదా నష్టాల్లో ఉన్న విభాగాల నుంచి వెంటనే పెట్టుబడులను వెనక్కి తీసుకోవడమో చేస్తుంటారు. ఇలాంటి ఆలోచన విధానం సహజమే అయినప్పటికీ, మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు పోర్ట్‌ఫోలియో తీవ్రంగా దెబ్బతింటుంది.
లార్జ్–క్యాప్, మిడ్–క్యాప్ కంపెనీలకి తప్పనిసరిగా కేటాయింపులు ఉండేలా చూడటం ద్వారా ఇలాంటి ఆలోచనా ధోరణుల వల్ల, ఇన్వెస్టర్లు నష్టాల బారిన పడకుండా చూసేందుకు తోడ్పడుతుంది. ఇన్వెస్టర్ వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడకుండా, ఈ ఫండ్ నిర్మాణ స్వరూపంలోనే క్రమశిక్షణ ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ విభాగాల్లో ఏది ఎప్పుడు మెరుగ్గా రాణిస్తుందో అనేది అంచనాలు వేసుకోవాల్సిన పని ఇన్వెస్టర్లకు ఉండదు. పోర్ట్‌ఫోలియోలో ఎప్పుడూ రెండూ ఉంటాయి కాబట్టి, మార్కెట్ ఎలా ఉన్నా, ఆయా సమయాల్లో లభించే అవకాశాలను ఇది అందిపుచ్చుకుంటుంది.
ఎవరికి అనుకూలం..?
ఈక్విటీల్లో పెట్టుబడులపరంగా వీలైనన్ని ఎక్కువ ప్రయోజనాలను కోరుకుంటున్నా, మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు తమ పెట్టుబడులను తాము స్వయంగా నిర్వహించుకోలేని ఇన్వెస్టర్లకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ అనువుగా ఉంటాయి.
లార్జ్–క్యాప్, మిడ్–క్యాప్ ఫండ్లను విడివిడిగా కొనుగోలు చేసి నిర్వహించుకోవడానికి బదులుగా, స్థిరత్వం అలాగే వృద్ధి రెండింటినీ ఒకే ఫండ్ ద్వారా పొందాలనుకునే కొత్త ఇన్వెస్టర్లకు ఇది సరైన ఎంపిక.
ఇప్పటికే లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, స్మాల్ క్యాప్స్‌లో రిస్కుల బారిన పడకుండా, అధిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈక్విటీల్లో మరింత ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి కూడా ఇది అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ కేటగిరీ ఫండ్స్ ఇటు లార్జ్ క్యాప్స్, అటు మిడ్ క్యాప్స్‌కి అర్థవంతంగా పెట్టుబడులు కేటాయిస్తూనే, కొంత మేర స్మాల్ క్యాప్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఈక్విటీ మార్కెట్లలో అవకాశాలను సమతూకంతో అందించే ప్రయత్నం చేస్తాయి.
వేర్వేరు ఫండ్లలో పెట్టుబడులు పెట్టి వాటిని తరచూ రీబ్యాలెన్స్ చేసే శ్రమ లేకుండా, ఒకే ఈక్విటీ ఫండ్ తమ పోర్ట్‌ఫోలియోకి ప్రధాన ఆధారంగా ఉండాలని కోరుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
చివరిగా..
ఈక్విటీ పెట్టుబడుల విషయంలో అందరికీ ఒకే సూత్రం వర్తించదు. ఏ ఒక్క ఫండ్ కేటగిరీ కూడా అన్ని అవసరాలనూ తీర్చలేదు. అయితే, లార్జ్ అండ్ మిడ్–క్యాప్ ఫండ్లు నిరూపితమైన పెద్ద కంపెనీల స్థిరత్వాన్ని, ఎదుగుతున్న కంపెనీల వృద్ధి సామర్థ్యాలని ఒక నియమావళికి లోబడి ఇన్వెస్టర్లకు అందిస్తాయి. గడిచిన ఏడాది కాలంగా ఈ ఫండ్స్‌లోకి పెరిగిన నిధులను చూస్తే, ఇన్వెస్టర్లు కేవలం ఒకే రకమైన మార్కెట్–క్యాప్‌పై ఆధారపడకుండా స్థిరత్వంతో కూడిన వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. పెట్టుబడుల కేటాయింపుల్లో క్రియాశీలకంగా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇటు స్థిరత్వం అటు వృద్ధి ప్రయోజనాలను పొందాలనుకునే వారికి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉంటాయి.
మార్కెట్లో ఒక్కో సెగ్మెంట్ ఒక్కో సందర్భంలో రాణిస్తుంది. తదుపరి రాణించబోయే సెగ్మెంట్ గురించి అంచనాలు వేసుకంటూ, ఊహాగానాల్లో ఉండిపోకుండా, పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడులను కొనసాగించిన వారికే ప్రయోజనాలు దక్కుతాయనేది గుర్తుంచుకోవాలి. ఇందుకోసం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ క్రమశిక్షణతో కూడుకున్న విధానంగా ఉపయోగపడతాయి.


