ద్రవ్యోల్బణ గణాంకాలపై ఫోకస్‌ | Crude oil prices West Asia developments likely to steer markets this week | Sakshi
Sakshi News home page

ద్రవ్యోల్బణ గణాంకాలపై ఫోకస్‌

Aug 10 2026 4:29 AM | Updated on Aug 10 2026 4:29 AM

Crude oil prices West Asia developments likely to steer markets this week

పశ్చిమాసియా పరిణామాలు కీలకం 

చమురు ధరలు, రూపాయికీ ప్రాధాన్యం 

క్యూ1 ఫలితాలతో ఆయా షేర్లపై ప్రభావం 

ఈ వారం మార్కెట్‌ ట్రెండ్‌పై అంచనా

దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ఈ వారం ప్రధానంగా రిటైల్, హోల్‌సేల్‌ ధరల (ద్రవ్యోల్బణం) గణాంకాలతోపాటు.. పలు ఇతర అంశాలు నిర్దేశించనున్నాయి. ఓవైపు పశ్చిమాసియా వివాదాలు కొనసాగుతుండగా, మరోపక్క చమురు ధరలలో హెచ్చుతగ్గులు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 
వివరాలు చూద్దాం..  
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

హార్మూజ్‌ జలసంధిలో రవాణాపై నెలకొన్న అనిశ్చితికి అనుగుణంగా ప్రపంచ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఊగిసలాడుతున్నాయి. ఇది దేశీయంగా స్టాక్‌ మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. గత నెల(జూలై)కు రిటైల్‌ ధరలు, టోకు ధరల ద్రవ్యోల్బణ వివరాలు ఈ వారం వెలువడనున్నాయి. వీటితోపాటు.. విదేశీ మారక నిల్వల తాజా పరిస్థితి వెల్లడికానుంది. ఇప్పటికే ప్రారంభమైన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌) ఫలితాల సీజన్‌ సైతం ముగింపునకు రానుంది. ఈ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. 

ఫలితాల జాబితాలో 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న కంపెనీల జాబితాలో ఈ వారం టాటా మోటార్స్‌ ద్వయం, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌(హెచ్‌ఏఎల్‌), గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్, అశోక్‌ లేలాండ్, భారత్‌ ఫోర్జ్, బాష్, వొడాఫోన్‌ ఐడియా, క్యాడిలా హెల్త్, అపోలో హాస్పిటల్స్, లెన్స్‌కార్ట్‌ తదితరాలున్నాయి. క్యూ1 పనితీరు ఆధారంగా ఆయా కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. 

12న గణాంకాలు 
గత నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు 12న విడుదలకానున్నాయి. ఈ బాటలో ప్రభుత్వం టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలను 14న ప్రకటించనుంది. జూన్‌లో సీపీఐ 2024 డిసెంబర్‌ తరువాత అత్యధికంగా 4.38 శాతానికి చేరగా.. డబ్ల్యూపీఐ 9.87 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. గత సమీక్షలో రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగిస్తూ.. ధరల అంశంపై మరింత స్పష్టత కోసం వేచిచూడనున్నట్లు తెలియజేసింది.

పరపతి సమీక్షలో ఆర్‌బీఐ ధరల పెరుగుదలకు ప్రాధాన్యమిచ్చే విషయం విదితమే. కాగా.. మరోపక్క యూఎస్‌ సీపీఐ, ప్రొడ్యూసర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌(పీపీఐ), రిటైల్‌ సేల్స్‌ తదితర గణాంకాలు సైతం ఇదే సమయంలో విడుదలకానున్నాయి. పశ్చిమాసియా పరిస్థితులు, ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ల నడకను నిర్దేశించే వీలున్నట్లు ఎన్‌రిచ్‌ మనీ సీఈవో ఆర్‌.పొన్మూడి అభిప్రాయపడ్డారు.

గత వారమిలా 
సెబీ క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌(సీఏఎస్‌)కు తెరతీసిన నేపథ్యంలో గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య స్వల్ప వెనకడుగు వేశాయి. సెన్సెక్స్‌ 140 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 78,499 వద్ద ముగిసింది. నిఫ్టీ 204 పాయింట్ల(0.8 శాతం) నష్టంతో 24,571 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతంపైగా పుంజుకున్నాయి.

కొనసాగుతున్న ఎఫ్‌పీఐల దన్ను
రూ. 12,924 కోట్ల పెట్టుబడులు 
గత నెలలో పెట్టుబడుల యూటర్న్‌ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈ నెలలోనూ కొనుగోళ్లు చేపడుతున్నారు. వెరసి దేశీ స్టాక్స్‌లో తొలి వారం రూ. 12,924 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. జూలైలో రూ. 20,200 కోట్ల విలువైన స్టాక్స్‌ సొంతం చేసుకోగా.. అంతకుముందు జూన్‌లో రూ. 49,340 కోట్లు, మే లో రూ. 32,963 కోట్లు, ఏప్రిల్‌లో ఏకంగా రూ. 1.17 లక్షల కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. యూఎస్‌లో వడ్డీ రేట్ల కోత అంచనాలు, ప్రోత్సాహకర క్యూ1 ఫలితాలు తదితర అంశాలు ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదపడుతున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు.

సాంకేతికంగా చూస్తే 
అంచనాలకు అనుగుణంగా గత వారం ప్రధాన ఇండెక్సులు లాభాలతో ప్రారంభమై ఫ్లాట్‌గా కదిలినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సాంకేతిక అంచనాల ప్రకారం ఈ వారం నిఫ్టీ 24,750–24,850 వరకూ బలపడవచ్చు. ఈ స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురైతే దిగువస్థాయిలో 24,400– 24,200 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించే అవకాశం ఉంది.  
⇒ సెన్సెక్స్‌ 79,500 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్‌ను ఎదుర్కోవచ్చు. ఆపై 80,000వరకూ పుంజుకునే వీలుంది. ఒకవేళ నీరసిస్తే 77,500 పాయింట్ల వద్ద సపోర్ట్‌ కనిపించవచ్చు. ఆపై 77,000వరకూ బలహీనపడవచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement