క్యూ1లో రూ. 8,167 కోట్లు
43.6 కోట్లకు దేశీ కస్టమర్లు
ఏఆర్‌పీయూ @ రూ. 264
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 37 శాతం జంప్‌చేసి రూ. 8,167 కోట్లను తాకింది. భారత్‌సహా ఆఫ్రికా కార్యకలాపాలలో వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2025–26) ఇదే కాలంలో రూ. 5,948 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 18 శాతం ఎగసి రూ. 58,539 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 49,463 కోట్ల టర్నోవర్ అందుకుంది. మొత్తం కస్టమర్ల(సబ్‌్రస్కయిబర్లు) సంఖ్య 13 శాతం బలపడి 60.5 కోట్లను తాకింది. దీనిలో దేశీ వినియోగదారుల సంఖ్య సైతం 13 శాతం వృద్ధితో 43.6 కోట్లకు చేరింది.
డేటా వినియోగం అప్
తాజా సమీక్షా కాలంలో ఎయిర్‌టెల్.. ఒక్కో వినియోగదారునిపై రూ. 264 చొప్పున సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) ఆర్జించింది. ఇది 6 శాతం అధికంకాగా, గతేడాది క్యూ1లో ఇది రూ. 250గా నమోదైంది. ఇందుకు మొబైల్ విభాగంలో ధరలు మెరుగుపడటం(ప్రీమియమైజేషన్)తోపాటు.. హోమ్స్, ఎయిర్‌టెల్ బిజినెస్‌ల వృద్ధి తోడ్పాటునిచ్చినట్లు కంపెనీ పేర్కొంది. క్యూ1లో మొత్తం 5 మిలియన్ కస్టమర్లను జత చేసుకున్నట్లు తెలియజేసింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా పోస్ట్‌పెయిడ్ విభాగంలో 10 లక్షలమంది కస్టమర్లను జత చేసుకున్నట్లు కంపెనీ చైర్మన్ గోపాల్ విఠల్ వెల్లడించారు.
వెరసి పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల సంఖ్య 3 కోట్లకు చేరింది. దేశీయంగా డేటా సగటు వినియోగం 28 శాతం జంప్‌చేసి 34.4 జీబీని తాకింది. కన్సాలిడేటెడ్ పెట్టుబడి వ్యయాలు రూ. 13,386 కోట్లుకాగా.. దీనిలో దేశీ వాటా రూ. 9,698 కోట్లు. కంపెనీ నికర రుణ భారం 35 శాతం తగ్గి రూ. 81,852 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ షేరు స్వల్ప లాభంతో రూ. 1,957 వద్ద ముగిసింది.


