న్యూఢిల్లీ: భారత్‌లో ఫోన్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. త్వరలో మొబైల్ రీఛార్జ్ బిల్లులు (టెలికాం టారిఫ్‌లు) మరో 12శాతం నుండి 15శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. టెలికాం మార్కెట్‌లో పోటీదారుల సంఖ్య తగ్గి, కొన్ని ప్రధాన కంపెనీల ఆధిపత్యం పెరగడంతో ధరల పెంపునకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఈ నివేదిక పేర్కొంది.
నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ల కారణంగా వినియోగదారులు వేగంగా 2జీ నుండి 4జీ,5జీ నెట్‌వర్క్‌లకు మారుతుండటంతో జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల సగటు ఆదాయం 1 నుండి 1.5 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.
మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. వొడాఫోన్ ఐడియా కంపెనీ తన చందాదారులను కోల్పోతుండగా, ఆ వాటాను జియో, ఎయిర్‌టెల్ దక్కించుకుంటున్నాయి. ఈ త్రైమాసికంలో జియో కొత్తగా 70 లక్షల మంది, ఎయిర్‌టెల్ 50 లక్షల మంది చందాదారులను చేర్చుకునే అవకాశం ఉండగా, వొడాఫోన్ ఐడియా కేవలం 2 లక్షల మంది వినియోగదారులను మాత్రమే పొందే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు దేశంలోని 90 శాతానికి పైగా జిల్లాల్లో తమ 5జీ సేవలను విస్తరించగా, వొడాఫోన్ ఐడియా సుమారు 100 నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చి, దానిని మరింత విస్తరించే పనిలో పడింది.
కాగా, వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల భారం రూ.25వేల కోట్లకు తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. రాబోయే రోజుల్లో 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల వాడకం మరింత పెరగనుండటంతో వినియోగదారుల డేటా వినియోగం కూడా భారీగా కొనసాగుతుందని నివేదిక స్పష్టం చేసింది.


