'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో చరిత్రలోనే అతిపెద్ద మార్కెట్ క్రాష్ వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దీంతో పెట్టుబడిదారుల్లో మరోసారి చర్చ మొదలైంది.
ప్రస్తుతం కియోసాకి హెచ్చరిక కంటే.. ఆయన గతంలో చేసిన అంచనాలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే.. గత కొన్నేళ్లుగా కియోసాకి మార్కెట్ పతనం గురించి పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వాటిలో చాలా వరకు నిజం కాలేదు.
ఉదాహరణకు, 2023 నాటికి బిట్‌కాయిన్ 75 వేల డాలర్లకు చేరుతుందని, 2024 ఆగస్టులో 3.5 లక్షల డాలర్లకు వెళ్తుందని, 2025 చివరికి 5 లక్షల డాలర్లను తాకుతుందని ఆయన అంచనా వేశారు. అయితే ఆ గడువుల్లో ఆ లక్ష్యాలు నెరవేరలేదు.
స్టాక్ మార్కెట్ విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. 2018లో 'చరిత్రలోనే అతిపెద్ద మార్కెట్ పతనం వస్తోంది' అని చెప్పిన తర్వాత, అమెరికా ఎస్‌అండ్‌పీ 500 సూచీ దాదాపు 115 శాతం పెరిగింది. అలాగే.. కరోనా సమయంలో 'ఇప్పుడే అసలు పతనం మొదలైంది' అని వ్యాఖ్యానించినా, ఆ తర్వాత ఏడాది మార్కెట్ 50 శాతానికి పైగా లాభపడింది.
2020లో అన్నీ కుప్పకూలిపోతాయి, 2021 అక్టోబర్‌లో భారీ క్రాష్ వస్తుంది, 2022లో ఎవరీథింగ్ బబుల్ ఎవరీథింగ్ క్రాష్‌గా మారుతుంది, 2024లో క్రాష్ ఇప్పటికే ప్రారంభమైంది అంటూ పలుమార్లు కియోసాకి హెచ్చరించారు. కానీ ఆయా.. సందర్భాల్లో మార్కెట్లు పెద్దగా కుప్పకూలకపోగా.. వృద్ధినే నమోదు చేశాయి.
గతాన్ని పరిశీలించిన తరువాత, ఇప్పుడు ఆయన చేసిన 2026 క్రాష్ నిజమేనా? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. కొందరు మాత్రం కియోసాకి అంచనాలను పూర్తిగా కొట్టిపారేయలేమని అంటున్నారు. ఎందుకంటే ఆయన తక్షణ మార్కెట్ కదలికల కంటే, అప్పుల భారం, కరెన్సీ విలువ, ఆర్థిక వ్యవస్థలోని దీర్ఘకాలిక సమస్యల గురించి హెచ్చరిస్తుంటారని వారి వాదన. మరోవైపు.. విమర్శకులు మాత్రం గత రికార్డును చూపిస్తూ ఆయన అంచనాలను జాగ్రత్తగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు.
నిజానికి.. మార్కెట్ ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు పెరుగుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే.. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, యుద్ధాలు, ప్రభుత్వ విధానాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అనేక అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అందుకే.. ఒక్కరి అంచనాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం కంటే, పూర్తి సమాచారం సేకరించి, దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: రూ.28 వేల కోట్ల సబ్సిడీ.. 50 లక్షల కుటుంబాలకు లబ్ది!
అందువల్ల, 2026లో నిజంగానే అతిపెద్ద మార్కెట్ క్రాష్ వస్తుందా? అనే ప్రశ్నకు ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం లేదు. ఇది కేవలం కియోసాకి వ్యక్తిగత అంచనా మాత్రమే. గతంలో ఆయన చేసిన అనేక అంచనాలు నిజం కాకపోవడంతో, ఈసారి కూడా పెట్టుబడిదారులు ఆశలు లేదా భయాలతో కాకుండా, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకోవడం అవసరం.
Robert Kiyosaki just said the biggest crash is coming this 2026
But he has a track record of predictions and every single one of them is wrong
- Bitcoin will hit 75k by 2023 (never broke 74k)
- Bitcoin will hit 350k by August 2024
- Bitcoin will hit 500k by end of 2025
-… pic.twitter.com/ynJjUhyTMi— StarPlatinum (@StarPlatinum_) August 3, 2026


