ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) పథకం కింద ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా 50.06 లక్షల గృహాలు లబ్ధి పొందాయి. ప్రారంభం నుంచి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో గణనీయమైన పెరుగుదల కనిపించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేవలం రెండేళ్లలోనే ఈ పథకం పతాకస్థాయిలో ఆదరణ పొందినట్లు పేర్కొంది.
పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కోసం.. కేంద్ర ప్రభుత్వం రూ.75,021 కోట్ల భారీ నిధులను కేటాయించింది. అయితే ఈ పథకం అమలు చేయడానికి ముందు పదేళ్లలో.. దేశవ్యాప్తంగా కేవలం 7.94 లక్షల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు మాత్రమే ఏర్పాటు అయ్యాయి. కానీ ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన రెండేళ్లలోనే 50 లక్షలకు పైగా కుటుంబాలు సోలార్‌ను స్వీకరించాయి. దీన్నిబట్టి చూస్తే.. ప్రజల్లో అవహగాన పెరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది.
ఒక్క నెలలోనే 5.06 లక్షలు
ప్రస్తుతం ప్రతి ఆరు రోజులకు లక్ష మంది కొత్త లబ్ధిదారులు ఈ పథకంలో చేరుతున్నట్లు సమాచారం. గత తొమ్మిది నెలల్లో సోలార్ వ్యవస్థల ఏర్పాటు వేగం మూడు రెట్లకు పైగా పెరిగింది. ముఖ్యంగా 2026 జూలైలో ఒక్క నెలలోనే 5.06 లక్షల ఇళ్లలో సోలార్ ప్యానెల్లు ఏర్పాటు కావడం ఒక కొత్త రికార్డు. రోజుకు సగటున 16 వేలకుపైగా ఇళ్లలో సోలార్ వ్యవస్థలు అమర్చడం ఈ కార్యక్రమం ఎంత వేగంగా ముందుకు సాగుతోందో తెలియజేస్తోంది.
ఈ పథకం వల్ల ప్రజలకు నేరుగా ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.28,024 కోట్ల సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఫలితంగా సుమారు 19 లక్షల కుటుంబాలు విద్యుత్ బిల్లు లేకుండానే జీవిస్తున్నాయి.
అదనపు ఆదాయం కూడా..
అంతేకాదు.. అవసరానికి మించి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలు అదనపు ఆదాయం కూడా సంపాదిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కుటుంబాలు కలిపి రూ.421 కోట్ల ఆదాయం పొందగా, ఒక్కో కుటుంబానికి సగటున ఏడాదికి రూ.3,500 వరకు అదనపు ఆదాయం వచ్చింది.
ఇదీ చదవండి: UPI యూజర్లకు అలర్ట్.. డబ్బులు పంపే ముందు కొత్త స్టెప్!
దరఖాస్తు నుంచి సబ్సిడీ విడుదల వరకు మొత్తం ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఆన్‌లైన్ చేసింది. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా సేవలు పొందుతున్నారు. కాగా.. ఈ పథకం వల్ల ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి.
A people-powered solar revolution is transforming India. Under Hon'ble PM Shri @narendramodi ji’s @PMSuryaGhar Muft Bijli Yojana, 50 lakh families are harnessing the power of the sun for cleaner energy, lower electricity bills, and a brighter tomorrow. #50LakhPMSuryaGhar pic.twitter.com/dhRgyDvnhI
— Ministry of New and Renewable Energy (MNRE) (@mnreindia) August 4, 2026


