సౌరశక్తితో నడిచే విత్తన గుళికల యంత్రం! | Solar-powered seed pellet machine | Sakshi
Sakshi News home page

సౌరశక్తితో నడిచే విత్తన గుళికల యంత్రం!

Jul 28 2026 6:22 AM | Updated on Jul 28 2026 6:22 AM

Solar-powered seed pellet machine

సాధారణంగా చిన్నసైజులో ఉండే, తేలికపాటి విత్తనాలను రైతులు పొలంలో వెదజల్లి సాగు చేస్తుంటారు. విత్తనాలు వెద పెట్టిన తర్వాత నీరు పారించినప్పుడు లేదా పెద్ద వర్షం పడినప్పుడు అవి కొట్టుకుపోయి ఒకే చోట పోగుపడటం లేదా మట్టిలో ఎక్కువగా పూడిపోవడం జరుగుతుంటుంది. దీనివల్ల మొలకలు సరిగ్గా రాక దిగుబడి తగ్గుతుంది. 

ఈ సమస్యకు ఒడిశా, గుజరాత్‌ యూనివర్సిటీల పరిశోధకులు సులువైన పరిష్కారం కనుగొన్నారు. సౌరశక్తితో నడిచే విత్తనాల పెల్లెటింగ్‌ (కోటింగ్‌) యంత్రానికి రూపకల్పన చేశారు. క్యాబేజీ, ఉల్లి, నువ్వులు వంటి అతిచిన్న, తేలిక విత్తనాలతో పంటలు సాగు చేసే రైతులతో పాటు.. వానకు ముందే పొడి దుక్కిలో విత్తనాలు విత్తుకునే ‘ప్రీమాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌ (పీఎండీఎస్‌)’ పద్ధతిని అనుసరించే రైతులకు ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుంది.

రెండు యూనివర్సిటీల కృషి
కోరాపుట్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఒడిశా(సీయూఓ), గుజరాత్‌లోని నవ్‌సరి అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(ఎన్‌ఏయూ) పరిశోధకులు డా. మంజుశ్రీ సింగ్, డా. విపుల్‌ టి. షిండే, డా. ఆశిష్‌ సొనావనే, ఎర్‌. సుభమ్‌ ధాకడ్‌ బృందం, విద్యార్థినులు స్వప్నరాణి బిస్వాల్, అభిసిక్త సాహు సహకారంతో ఈ వినూత్న యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రానికి ఇటీవలే పేటెంట్‌ మంజూరైందని సీయూఓ వ్యవసాయ విభాగం అధిపతి డా. మంజుశ్రీ సింగ్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. దీనితో తయారు చేసిన విత్తన గుళికలను పొలంలో వెదజల్లి నీరు పెట్టినా కొట్టుకుపోకుండా ఉండి, పొలమంతా సరిగ్గా మొలుస్తాయన్నారు.

క్యాబేజీ, ఉల్లి, నువ్వులు.. 
ఈ యంత్రం 330 వాట్ల సోలార్‌ ΄్యానెల్, 24 వీ డీసీ మోటార్, 35 ఏహెచ్‌ బ్యాటరీలు, లిక్విడ్‌ ట్యాంక్‌తో పనిచేస్తుంది. క్యాబేజీ, ఉల్లి, నువ్వులు వంటి చిన్న విత్తనాలకు అనువైన కోటింగ్‌ ఇవ్వటానికి దీన్ని రూపొందించారు. చిన్న విత్తనాల చుట్టూ మట్టి, పోషకాలతో లేపనం చేసి సీడ్‌ పెల్లెట్లు తయారు చేయటం వల్ల విత్తన పరిమాణం, బరువు పెరుగుతాయి.

పోషకాల లభ్యత 
విత్తనానికి లేపనం చేసేటప్పుడే ఎరువులు, సూక్ష్మ పోషకాలు కలిపి కోటింగ్‌ చెయ్యటం వల్ల విత్తనం మొలకెత్తిన వెంటనే మొక్కకు అవసరమైన బలం లభిస్తుంది. విద్యుత్తు అందుబాటు లేని గ్రామీణ ప్రాంతాల్లో కూడా సోలార్‌ ఎనర్జీతో ఖర్చులేకుండా పర్యావరణహితంగా ఈ యంత్రాన్ని నడుపుకోవచ్చు.

సమాన మొలక శాతం
విత్తన గుళికలు నీటి ఉధృతికి కొట్టుకుపోకుండా సరైన దూరంలో నిలిచి ఉండి సమానంగా మొలకెత్తుతాయి.  నాణ్యమైన కోటింగ్‌ వల్ల విత్తనాలు వృథా కాకుండా పంట దిగుబడి పెరుగుతుంది. సాంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకపోవటం వల్ల నిర్వహణ ఖర్చు ఉండదు. చిన్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటానికి ఈ సోలార్‌ కోటింగ్‌ యంత్రం ఎంతగానో తోడ్పడుతుందని డా. మంజుశ్రీ సింగ్‌ తెలిపారు. ఇతర వివరాలకు అమెను సంప్రదించవచ్చు: జిౌఛీ.్చజటజీఃఛిఠౌ.్చఛి.జీn                          
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement