ముంబై: మళ్లీ ప్రైమరీ మార్కెట్ ఊపందుకుంటోంది. ఈ వారాంతాన రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానుండగా.. మరో కంపెనీ సెబీకి ప్రాథమిక దరఖాస్తు దాఖలు చేసింది. పీఈ దిగ్గజం కేకేఆర్‌కు పెట్టుబడులున్న లీప్ ఇండియా, మౌలిక రంగ టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీవో చేపట్టనున్నాయి. వివరాలు చూద్దాం..
రూ. 2,480 కోట్లకు రెడీ
సప్లై చైన్ నిర్వహణ కంపెనీ లీప్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి రూ. 151–159 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 7న ప్రారంభంకానుండగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లు ఆఫర్ చేయనుంది. 11న ముగియనున్న ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 480 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 2,480 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. రిటైలర్లు కనీసం 94 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 360 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ఈ నెల 14న లిస్ట్‌కానుంది.
2013లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా సప్లై చైన్ నిర్వహణ రంగంలో పంచుకోవడం, పునర్వినియోగం(షేర్ అండ్ రీయూజ్) పద్ధతిన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తద్వారా సరఫరా సంబంధ సౌకర్యాలను తాత్కాలిక ప్రాతిపదికన కస్టమర్లు వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఫలితంగా కస్టమర్లు తయారీ దగ్గరనుంచి వస్తువుల పంపిణీసహా.. రిటైల్(పీవోఎస్)వరకూ సేవలు సమకూరుస్తోంది. గతేడాది(2025-26) రూ. 747 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 62 కోట్ల నికర లాభం ఆర్జించింది.
రూ. 252 కోట్లపై కన్ను
ప్రధానంగా ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు చేపట్టే ఈపీసీ కంపెనీ టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీవోకు రూ. 200–212 ధరల శ్రేణి నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 7న ప్రారంభంకానుండగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు 6న షేర్లు ఆఫర్ చేయనుంది. 11న ముగియనున్న ఐపీవోలో భాగంగా కంపెనీ 95.05 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది.
అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్ సంస్థ కార్తికేయ కన్‌స్ట్రక్షన్స్ మరో 23.76 లక్షల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 252 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 150 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. గతేడాది(2025–26) రూ. 345 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 43 కోట్ల నికర లాభం ఆర్జించింది.
ఎన్‌క్యూబ్ ఎథికల్స్ సెబీకి దరఖాస్తు
స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఎన్‌క్యూబ్ ఎథికల్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్ మేహుల్ మధుసూదన్ షా, ప్రస్తుత వాటాదారు ఫ్రంటియర్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి.
దీంతో ఇష్యూ నిధులు కంపెనీ ప్రమోటర్‌తోపాటు, ఇన్వెస్టర్ సంస్థకు మాత్రమే చేరనున్నాయి. 1995లో ఏర్పాటైన కంపెనీ ప్రపంచవ్యాప్త ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల ప్లాట్‌ఫామ్‌గా సర్వీసులందిస్తోంది. సాంకేతికంగా క్లిష్టతరహా(కాంప్లెక్స్) టాపికల్, ట్రాన్స్‌డెర్మల్ డోసేజీలను రూపొందిస్తోంది. భారత్‌సహా.. యూఎస్, యూకే, యూరప్ తదితర రెగ్యులేటెడ్ మార్కెట్లకు ప్రొడక్టులను అందిస్తోంది. గతేడాది(2025–26) రూ. 1,849 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 437 కోట్ల నికర లాభం ఆర్జించింది.


