ఖర్చులతో.. కళ్లుచెదిరే లాభాలు! | An expenditure-driven economy grows because people spend more money | Sakshi
Sakshi News home page

ఖర్చులతో.. కళ్లుచెదిరే లాభాలు!

Aug 10 2026 4:13 AM | Updated on Aug 10 2026 4:13 AM

An expenditure-driven economy grows because people spend more money

పొదుపు వదిలి...  ఖర్చులవైపు ఆర్థిక వ్యవస్థ

పెరుగుతున్న ఆదాయాలు, అభిరుచులే కారణం

క్విక్‌ కామర్స్‌ నుంచి పెట్‌ కేర్‌ వరకూ కొత్త అవకాశాలు

ట్రెండ్‌కు తగ్గట్టుగా వస్తున్న కొత్త కంపెనీలు

జ్యుయలరీ, ట్రావెల్, ఫిట్‌నెస్, లగ్జరీ థీమ్‌లకూ గిరాకీ

15–20 ఏళ్లలో ఎకానమీలో సమూల మార్పు

ట్రెండ్‌ను గమనిస్తే భవిష్యత్‌ దిగ్గజాలను గుర్తించటం ఈజీ

పొదుపు. భారతీయుల సంస్కృతి. పొదుపరి అంటే... అదో కిరీటం. వచ్చే ప్రతి రూపాయిలో కొంత దాచాకే మిగతాది ఖర్చుచేయాలనే పెద్దలు... నీళ్లు, కరెంటు వాడకంలోనూ ‘పొదుపుగా..’ అని చెబుతూనే ఉంటారు. అవసరం లేనివి కొనొద్దని, రుణాలు తీసుకోవద్దని... ఇదంతా కొన్ని తరాల పాటు సాగిన ఆర్థిక రీతి.  కానీ... నేటి యువతరం ఈ కిరీటాలను కోరుకోవటం లేదు. నచ్చింది కొంటున్నారు. కావాల్సింది తింటున్నారు.

కొంగొత్త అనుభవాలు, అప్పుడప్పుడు ఆడంబరాల కోసం అప్పులకైనా సై అంటున్నారు. ఈఎంఐలకు ఓటేస్తున్నారు. మొత్తంగా పొదుపు ఆధారిత భారత ఆర్థిక వ్యవస్థను ఖర్చులపై పరుగులు పెట్టే ఎకానమీగా మారుస్తున్నారు. దీన్లోని మంచిచెడ్డలను పక్కన బెడితే... ఈ  మార్పు బోలెడన్ని కొత్త వ్యాపారాలను సృష్టిస్తోంది. ఈ ఖర్చును ఆదాయంగా మార్చుకుంటున్న కంపెనీలు వేగంగా ఎదుగుతున్నాయి. మరి ఆ కంపెనీలేంటో తెలుసుకోవటమెలా? దీర్ఘకాలంలో సంపద సృష్టించే అవకాశాలు ఎక్కడెక్కడున్నాయి? ఈ విశ్లేషణే మన ‘వెల్త్‌ స్టోరీ’...

రమణమూర్తి మంథా 
టైటన్, డీమార్ట్, ట్రెంట్, జుబ్లియెంట్‌ ఫుడ్‌వర్క్స్, బజాజ్‌ ఫైనాన్స్, ఏసియన్‌ పెయింట్స్‌... భారతీయ ఇన్వెస్టర్లకు కాసులు కురిపించిన ఈ కంపెనీలు ఒక రంగానికి చెందినవేమీ కావు. కానీ ఇవన్నీ దిగ్గజాలుగా ఎదగటానికి కారణమైతే ఒకటే. పెరిగిన మన ఖర్చుల సంస్కృతి. ఎందుకంటే పాతికేళ్లకు ముందు మన ఆర్థిక సంస్కృతి వేరు. ఖర్చు చేసేదంతా ఇంటద్దె, తిండి, దుస్తులు, చదువు, వైద్యం వంటి మౌలికావసరాలకే. వాటిని దాటి మిగిలేది అంతంతే. అందుకనే అప్పట్లో ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్‌ కంపెనీలు, సిమెంట్, ఉక్కు, సాధారణ బ్యాంకింగ్, టెక్స్‌టైల్‌ రంగాలు మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్లకు ఆకర్షణీయంగా కనిపించేవి. 

కానీ 2000 తరవాత పరిస్థితి మారింది. ఆర్థిక సంస్కరణలు ఐటీ ఐద్యోగాలను తెచ్చాయి. పెరిగిన జీతాలు ఖర్చుల కల్చర్‌ను  మార్చాయి. మెరుగైన ఇళ్లు, కార్లు, ఏసీలు, స్మార్ట్‌ఫోన్లు, విదేశీ ప్రయాణాలు, ప్రీమియం విద్యపై జనం ఖర్చు పెంచారు. దీంతో ఆటోమొబైల్స్, హౌసింగ్‌ ఫైనాన్స్, వినియోగ వస్తువులు, పెయింట్లు, రిటైల్‌ చెయిన్ల కంపెనీలు సంపద సృష్టించాయి.  

2020 తరవాత... ‘కొనటం కాదు.. అనుభవం ముఖ్యం’ అనే ధోరణి మొదలైంది. ఏది కొనాలి? బదులు... ఇది కొంటే ఏంటి? అనే ప్రశ్న మొదలైంది. హాలిడే ప్రయాణాలు, రెస్టారెంట్లు, జిమ్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, ప్రీమియం హెల్త్‌కేర్, కచేరీలు, థీమ్‌పార్క్‌లు, ఎడ్వంచర్‌ టూరిజం పెరిగాయి. ఈ సంస్కృతి ఎంతలా విస్తరిస్తోందంటే .. గతంలో రూ.5 వేల ఖర్చుకే ఆలోచించే జనం... యూపీఐ, క్రెడిట్‌ కార్డ్‌లు, బీఎన్‌పీఎల్, తక్షణ రుణాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. డబ్బు అతివేగంగా చేతులు మారుతోంది. నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై, క్లౌడ్‌ స్టోరేజీ, మొబైల్‌ గేమ్స్, ఫిట్‌నెస్‌ సబ్ర్‌స్కిప్షన్లు, క్విక్‌ కామర్స్, ఫుడ్‌ డెలివరీ, పెట్‌ కేర్, ఆర్గానిక్‌ ఫుడ్స్‌ వంటివి ఇప్పుడు నిత్యావసరాల జాబితాలోకి వచ్చేశాయి.

ఇప్పుడు ఎక్కువ కొనటమే కాదు. ప్రీమియం వస్తువులు కొంటున్నారు. వస్తువులపైనే కాదు. సేవలపైనా వెచ్చిస్తున్నారు. బీమా, వెల్త్‌ మేనేజ్‌మెంట్, మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌లు, ఫైనాన్షియల్‌ సబ్ర్‌స్కిప్షన్లు కూడా ఖర్చుల్లో భాగం అవుతున్నాయి. ఆరోగ్యమనేది జీవనశైలిగా మారిపోయింది. విద్య అనేది ఏ దశలోనూ ఆగకుండా నిరంతరమైపోయింది. నిత్యావసరాలు పోను మిగిలే సొమ్ము పెరుగుతున్న కొద్దీ... మాల్స్, మల్టీప్లెక్స్‌లు, రిసార్ట్స్, కాన్సెర్ట్‌ల వంటి లీజర్‌ పరిశ్రమ విపరీతంగా విస్తరించింది.  

ఇదిగో... కొత్త ఎకానమీ 
డబ్బు కన్నా సమయానికే ఎక్కువ విలువిచ్చేవాళ్లు పెరగటంతో సౌలభ్య ఎకానమీ బాగా పెరుగుతోంది. 10 నిమిషాల్లో గ్రాసరీ డెలివరీ, తక్షణం పనిమనిషిని పంపే కంపెనీలు, హౌస్‌ క్లీనింగ్, క్లౌడ్‌ కిచెన్లు, ఇళ్ల నిర్వహణ సేవలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పెంపుడు జంతువులపై ఇష్టం కూడా పెరుగుతుండటం కొత్త ఎకానమీని సృష్టిస్తోంది. డిజిటల్‌ సబ్ర్‌స్కిప్షన్లతో పాటు వృద్ధులు పెరగటం... వారి ఖర్చులు మారటం మరో తరహా ఎకానమీకి దారులు తెరుస్తున్నాయి. సీనియర్‌ హెల్త్‌కేర్, వృద్ధుల సహాయకులు, హోమ్‌ నర్సింగ్, వృద్ధుల వైద్య పరికరాలు, రిటైర్‌మెంట్‌ ఇళ్లు ఇవన్నీ దీనికి ఉదాహరణలు. ఇవన్నీ ఎందుకంటే... రిటైల్‌ ఇన్వెస్టర్లు ఇపుడు చూడాల్సింది ఏ షేర్‌ అయితే  రెట్టింపు అవుతుంది? అని కాదు. మనవాళ్లు మరిన్ని లక్షల కోట్లను ఎక్కడ ఖర్చు చేయబోతున్నారు? అని. ఎందుకంటే దేనిపై ఎక్కువ ఖర్చుపెడితే ఆ రంగం లబ్ధి పొందుతుందన్నది కొత్త ఇన్వెస్టర్లకు సైతం అర్థమయ్యే అంశం. అందుకే ఏ రకమైన ఖర్చుల వల్ల ఎలాంటి రంగాలు లబ్ధి పొందుతాయో ఒకసారి చూద్దాం...

మరి భవిష్యత్తేంటి? 
అమెరికా, జపాన్, చైనా వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే మన తలసరి ఆదాయం అసలు లెక్కలోకే రాదు. రూపాయల్లో చూస్తే అమెరికా 90 లక్షలు, జపాన్‌ 34 లక్షలు, చైనా 14 లక్షల వద్ద ఉండగా మన తలసరి ఆదాయం కేవలం 2.67 లక్షలు. కానీ ఆదాయాలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 15–20 సంవత్సరాల్లో ఖర్చుల ధోరణి బాగా మారనుంది. 

స్మార్ట్‌ ఇళ్లు– గృహోపకరణాలు, ఏఐ సబ్ర్‌స్కిప్షన్లు– వ్యక్తిగత డిజిటల్‌ అసిస్టెంట్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, వృద్ధుల సంరక్షణ సేవలు, అనుభవానికి ప్రాధాన్యమిచ్చే లగ్జరీ, డేటా– డిజిటల్‌ ఇన్‌ఫ్రా ఎకోసిస్టమ్‌ వంటివి భవిష్యత్‌ను శాసించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగని ప్రతి రంగంలోనూ వెల్త్‌ క్రియేటర్లు రాకపోవచ్చు. ఎందుకంటే వేగంగా ఎదుగుతున్న కంపెనీలైనా అప్పటికే బాగా పెరిగి ఉంటే మన పెట్టుబడికి తగిన రాబడి వస్తుందని చెప్పలేం. ట్రెండ్‌ను గుర్తించి, క్వాలిటీ స్టాక్స్‌ను దీర్ఘ కాలానికి సరైన ధరకు కొంటేనే స్టాక్‌ మార్కెట్‌ కుబేరులవుతారు.  

చివరిగా చెప్పేదొకటే. ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందిన ప్రతిసారీ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలొస్తాయి. భారతదేశం కూడా వ్యవసాయ ఆధారితం నుంచి తయారీకి.. అక్కడి నుంచి సేవలకు మారుతూ వచ్చింది. తదుపరి అధ్యాయానికి పునాది పెరుగుతున్న ఖర్చుల సంస్కృతే కావచ్చు. ఆ ఖర్చుల సంస్కృతికి ప్రతినిధులైన ప్రధాన లిస్టెడ్‌ కంపెనీల వివరాలివిగో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement