ఈ వారం పబ్లిక్ ఇష్యూల జోరు
జాబితాలో మిల్కీ మిస్ట్ డెయిరీ, షిప్ రాకెట్, ధూత్ ట్రాన్స్‌మిషన్, మాల్బియో డయాగ్నోస్టిక్స్
ఇప్పటికే ప్రారంభమైన లీప్ ఇండియా, టెక్నోక్రాఫ్ట్
న్యూఢిల్లీ: ఈ వారం ప్రైమరీ మార్కెట్లు సందడి చేయనున్నాయి. ఇప్పటికే లీప్ ఇండియా, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీవోలు ప్రారంభంకాగా.. మిల్కీ మిస్ట్ డయిరీ ఫుడ్, ఆటో విడిభాగాల ధూత్ ట్రాన్స్‌మిషన్, టెమాసెక్‌కు పెట్టుబడులున్న షిప్‌రాకెట్, పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నోస్టిక్ సేవలందించే మాల్బియో మార్కెట్లను పలకరించనున్నాయి. కాగా.. శుక్రవారం(7న) మొదలైన లీప్ ఇండియా, టెక్నోక్రాఫ్ట్ ఐపీవోలు 11న ముగియనున్నాయి. వెరసి ఈ ఏడాది ఐపీవోల సంఖ్య 47కు చేరనుంది. మరోపక్క వచ్చే వారానికల్లా బ్లాక్‌స్టోన్ గ్రూప్ సంస్థ హారిజన్ ఇండ్రస్టియల్ పార్క్స్, గాజా క్యాపిటల్‌కు పెట్టుబడులున్న శంకేష్ జ్యువెలర్స్ తదితర కంపెనీలు ఐపీవోకు ధరల శ్రేణి ప్రకటించనున్నాయి. దీంతో ఇకపై ప్రైమరీ మార్కెట్లు మరింత కళకళలాడనున్నాయి.
నేటి నుంచి..
మాల్బియో డయాగ్నోస్టిక్స్, ధూత్ ట్రాన్స్‌మిషన్ ఐపీవోలు నేటి(10) నుంచి ప్రారంభంకానుండగా.. మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ 11న ఓపెన్‌కానుంది. ఈ బాటలో ఈకామర్స్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్ షిప్‌రాకెట్, ఇంజనీరింగ్ క్యాస్టింగ్స్, అలాయ్ స్టీల్ ప్రొడక్టుల తయారీ కంపెనీ బెహారీ లాల్ ఇంజనీరింగ్ పబ్లిక్ ఇష్యూలు 12న మొదలుకానున్నాయి. ఇవన్నీ ఉమ్మడిగా రూ. 7,443 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఇష్యూ నిధులను ప్రధానంగా వ్యాపార విస్తరణ, పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు తదితరాలకు వెచ్చించనున్నాయి.
ధరల శ్రేణి వెల్లడి
ధూత్ ట్రాన్స్‌మిషన్ ఐపీవోకు రూ. 829–871 ధరల శ్రేణి ప్రకటించింది. తద్వారా రూ. 3,067 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా రూ. 1,400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయడంతోపాటు.. 1.91 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. మోతీలాల్ ఓస్వాల్ పీఈకి సైతం వాటాలున్న మాల్బియో డయాగ్నోస్టిక్స్ ఇష్యూకి రూ. 768–807 ధరల శ్రేణి ఖరారు చేసింది. తద్వారా రూ. 940 కోట్లవరకూ సమీకరించాలని ఆశిస్తోంది. దీనిలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 91.66 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. దొడ్ల డెయిరీలో 2021 జూన్‌లో ఇన్వెస్ట్ చేసిన ఐఎఫ్‌సీ తిరిగి ఐదేళ్ల తదుపరి మాల్బియోలో రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టడం గమనార్హం!
ఇష్యూల తీరిలా
మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ ఐపీవో ద్వారా రూ. 1,553 కోట్లు అందుకోవాలని చూస్తోంది. ఇందుకు రూ. 133–140 ధరల శ్రేణి నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రూ. 1,428 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో రూ. 125 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఇక షిప్‌రాకెట్ ఐపీవోకు రూ. 92–97 ధరల శ్రేణి ప్రకటించింది.
ఇష్యూలో భాగంగా రూ. 886 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు.. ప్రస్తుత వాటాదారులు రూ. 732 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. వెరసి దాదాపు రూ. 1,618 కోట్లు సమీకరించ తలపెట్టింది. 12న ప్రారంభంకానున్న బెహారీ లాల్ ఇంజనీరింగ్ ఐపీవోకు రూ. 271–285 ధరల శ్రేణి ప్రకటించింది. దీనిలో భాగంగా రూ. 93 కోట్ల తాజా ఈక్విటీ జారీసహా.. 73.2 లక్షల షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. ఇష్యూ ద్వారా రూ. 302 కోట్ల సమీకరణపై కన్నేసింది.


