మాటలు కొల్ల.. పెట్టుబడులు డొల్ల! | Fake investment companies in Chandrababu government | Sakshi
Sakshi News home page

మాటలు కొల్ల.. పెట్టుబడులు డొల్ల!

Jul 26 2026 6:33 AM | Updated on Jul 26 2026 6:33 AM

Fake investment companies in Chandrababu government

ఎకోరన్‌ ఎండీ యర్రంనేని లక్ష్మీప్రసాద్‌తో ఒప్పందం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు

చంద్రబాబు సర్కారు గొప్ప పెట్టుబడుల్లో మరో బురిడీ కంపెనీ ఎకోరన్‌

జీఎస్టీ ఎగవేత కేసుల్లో ఆ సంస్థ ఎండీ యర్రంనేని లక్ష్మీప్రసాద్‌ అరెస్ట్‌ 

డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి రూ.64 కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ ఎగవేత

ఇలాంటి కంపెనీ రాష్ట్రంలో రూ.76,250 కోట్లతో పెట్టుబడులకు ఒప్పందాలు 

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్న ఎకోరన్‌ 

ఆ వెంటనే రాష్ట్రంలో ఎనిమిది చోట్ల భారీ ఎత్తున భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు 

ఇందులో మతలబు ఏమిటని అధికార వర్గాల్లో తీవ్ర చర్చ 

ఎకోరన్‌ ఎండీ అరెస్ట్‌తో బడాయి పెట్టుబడుల బండారం బట్టబయలు

తండ్రీ కొడుకులు నోరు తెరిస్తే చాలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడుతున్నాయంటూ వేదిక ఎక్కినప్పుడల్లా ఊదరగొడుతున్నారు. ఆ పెట్టుబడుల్లో విశ్వసనీయత ఎంత అని మాత్రం ఎవరూ అడగకూడదు.. ఒకవేళ అడిగారంటే వారు అభివృద్ధి నిరోధకులంటూ బాబు అండ్‌ గ్యాంగ్‌ ఎదురుదాడికి దిగుతుంది. ఆయా కంపెనీలు పెట్టే పెట్టుబడులకు.. వారికి కల్పించే రాయితీలకు పొంతనే ఉండదు. వేల కోట్ల రూపాయల విలువయ్యే భూములను ధారాదత్తం చేసి.. రాయితీలిచ్చి.. ఆనక నీకింత–నాకింత అంటూ పంచుకోవడం తప్ప మరేమీ కాదని ‘ఎకోరన్‌’ బాగోతం స్పష్టం చేస్తోంది.  

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టుబడుల కట్టుకథ మోసం మరోసారి బయటపడింది. సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ పేరిట చంద్రబాబు చేసే ప్రచార ఆర్భాటాల డొల్లతనాన్ని ఎకోరన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ బయట పెట్టింది. గతేడాది నవంబర్‌లో విశాఖ వేదికగా రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.76,250 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకున్న ఎకోరన్‌ ఎనర్జీ అసలు రూపాన్ని కేంద్ర జీఎస్టీ అధికారులు ప్రపంచానికి వెల్లడించారు.

డొల్ల కంపెనీలు పెడుతూ తప్పుడు ఇన్‌వాయిస్‌లతో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను కొల్లగొట్టడంలో ఆరితేరిన కంపెనీ ఎకోరన్‌ అని నిగ్గు తేల్చారు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఎకోరన్‌ ఈ విధంగా రూ.64 కోట్ల ఐటీసీని అక్రమంగా కొల్లగొట్టిందంటూ హైదరాబాద్‌ జీఎస్టీ అధికారులు.. ఆ కంపెనీ ఎండీ యర్రంనేని లక్ష్మీప్రసాద్‌ను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా, ఆగస్టు 7 వరకు ఆయనకు రిమాండ్‌ విధించింది. దీంతో లక్ష్మీప్రసాద్‌ను చంచల్‌ గూడా జైలుకు తరలించారు. డొల్ల, దొంగ కంపెనీలు ఏర్పాటు చేసి తప్పుడు కొనుగోలు, అమ్మకం బిల్లులతో పన్ను ఎగ్గొట్టినట్లు యర్రంనేని తన వాంగ్మూలంలో అంగీకరించారు. ఇలా కొల్లగొట్టిన మొత్తం రూ.5 కోట్లకుపైగా ఉండటంతో బెయిల్‌ ఇవ్వడానికి వీలులేని జీఎస్టీ చట్టం సెక్షన్‌ 132(1)(సీ) మరియు 132(1)(ఐ)ల కింద ఆయన్ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. 

సింగపూర్‌ కంపెనీలకు కేటాయింపు 
రాష్ట్రంలో రూ.76,250 కోట్లతో 8 గిగావాట్ల రెన్యువబుల్‌ ఎనర్జీ (విండ్, సోలార్‌), 1.25 ఎంటీపీఏ సామర్థ్యంతో గ్రీన్‌ మాడ్యూల్స్‌ తయారు చేసేలా ఎకోరన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే సమయంలో తెలంగాణాలో మరో 27,000 కోట్లతో 5.5 గిగావాట్ల రెన్యువబుల్‌ ఎనర్జీ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలను సమర్పించింది.

రూ.1,000 కోట్ల లోపు ఆస్తులుండి ఏటా రూ.6 కోట్ల లాభాన్ని మాత్రమే పొందుతున్న కంపెనీ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఏకంగా రూ.1,03,250 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకోవడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక అధికార పార్టీ పెద్దల ప్రమేయం ఉందని.. తొలుత ఎకోరన్‌కు భూములు కేటాయించి.. ఆ తర్వాత వాటిని సింగపూర్‌ కేంద్రంగా నమోదైన ఓ2 పవర్‌ ఎస్‌జీ పీటీఈ, ఓ2 పవర్‌ ఎస్‌జీ2 పీటీఈ కంపెనీలకు భూములను బదలాయించడాన్ని ఎత్తి చూపుతున్నారు. దీని వెనుక తరుచూ సింగపూర్‌ వెళ్లివస్తూ నిరంతరం సింగపూర్‌ నామం జపించే సర్కారు పెద్దల హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎకోరన్‌పై అవ్యాజమైన ప్రేమ 
లక్ష్మీ ప్రసాద్‌ యర్రంనేని ఎండీ, సునీల్‌ కుమార్‌ తల్లా సీఈవోగా హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పడిన ఎకోరన్‌ ఎనర్జీపై చంద్రబాబు సర్కారు అవ్యాజమైన ప్రేమను కనపర్చింది. ఇది ఎంతలా అంటే కేవలం 12 నెలల్లో ఏకంగా 13 జీవోలను విడుదల చేసింది. ఇందులో కొన్ని జీవోలు ఏకంగా 508.66 ఎకరాల భూమిని వివిధ జిల్లాలో కేటాయిస్తూ ఇస్తే.. మరికొన్ని జీవోలు కేటాయించిన భూములను డొల్ల కంపెనీలకు మారుస్తూ ఇచ్చారు. తొలుత ఎకోరన్‌కు రాయితీలు కల్పిస్తూ జీవోలు ఇస్తే, వాటిని ఏఎంప్లస్‌ ఎవరెస్ట్, ఏఎంప్లస్‌ ఐఐఎఫ్‌ఏ సోలార్, దేశ్‌రాజ్‌ సోలార్‌ ఎనర్జీ, ఓ2 పవర్‌ ఎస్‌జీ పీటీఈ, అయన రెన్యువబుల్‌ ఎనర్జీ, ఓ2 పవర్‌ ఎస్‌జీ2 పీటీఈ, ఆంపిన్‌ ఎనర్జీ, ఎన్‌ఎస్‌ఎల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ పేరు మీదకు మారుస్తూ అనేక ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా ఈ కంపెనీపై చంద్రబాబు సర్కారు ఎంత ప్రత్యేకమైన ప్రేమను కనపర్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement