చిరువ్యాపారులతో మాట్లాడుతున్న దేవినేని అవినాష్, విష్ణు, వెలంపల్లి
విజయవాడ లెనిన్ సెంటర్‌పై గద్దల్లా వాలిన బొండా అనుచరులు
చిరు వ్యాపారుల నుంచి షాపునకు రూ.ఐదు లక్షల చొప్పున అక్రమ వసూళ్లు
పాదయాత్ర చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు అవినాష్, మల్లాది, వెలంపల్లి
గాందీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ లెనిన్ సెంటర్‌లో రైవస్ కాలువ ఒడ్డున గత 30, 40 ఏళ్లుగా దుకాణాలు నడుపుతున్న చిరువ్యాపారుల జోలికి వస్తే సహించేది లేదని వైఎస్సార్ సీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు అధికారపార్టీ నేతలను హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల కన్ను లెనిన్ సెంటర్‌పై పడిందని, ఈ ప్రాంతంపై గద్దల్లా వాలిపోయారని విమర్శించారు. గత ఆరు నెలలుగా మామూళ్ల కోసం వ్యాపారులను వేధిస్తున్నారని మండిపడ్డారు. మామూళ్లు ఇవ్వడానికి నిరాకరించిన చిరువ్యాపారులపై దౌర్జన్యం చేస్తున్నారని, షాపులకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం, షాపులు తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారని దుయ్యబట్టారు.
చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసే వారి నుంచి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. లెనిన్ సెంటర్‌లో అధికారులు కరెంట్ కట్ చేసిన దుకాణాలను శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడారు. దుకాణాలకు విద్యుత్ సౌకర్యం కట్ చేసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లెనిన్ సెంటర్ నుంచి ఐఎంఏ హాలు వరకు పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆగడాలు మితిమీరిపోయాయని, ఈ ప్రాంతంలో 290 దుకాణాలు ఉంటే టీడీపీ నేతలు షాపునకు రూ.5 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారని విమర్శించారు. స్కానింగ్ సెంటర్లు, డయాగి్నస్టిక్ సెంటర్లు, హాస్పిటల్స్ చివరికి డాక్టర్ల వద్ద కూడా బొండా అనుచరులు వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చేతిలో టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, పోలీసు శాఖలు కీలు»ొమ్మలుగా మారాయని మండిపడ్డారు. చిరువ్యాపారుల జోలికి వెళితే సహించేది లేదన్నారు. చిరువ్యాపారులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.


