నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహించి మంత్రి లోకేశ్ తప్పుకోవాలని నిరుద్యోగుల డిమాండ్
మెగా డీఎస్సీ పేరిట నిరుద్యోగులను నిలువునా దగా చేసిన చంద్రబాబు సర్కారు
స్పోర్ట్స్ కోటా కింద అంగట్లో సరుకుల్లా టీచర్ పోస్టులు అమ్ముకున్న వైనం.. ఈ కుంభకోణం చేయడం కోసమే జీవో 4.. 47 జారీ
టెట్, డీఎస్సీ రాత పరీక్ష.. అసలు డిగ్రీ లేకుండానే టీచర్ ఉద్యోగాలు
జాతీయ స్థాయి క్రీడల్లో పతకాలు వచ్చిన వారిని పక్కనపెట్టి.. పాల్గొన్న వారికి కొలువులు
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల ద్వారా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు జారీ
పని పూర్తవ్వగానే జీవో 4.. 47 రద్దు..
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతికి ప్రశ్న పత్రాల అప్‌లోడ్ బాధ్యత.. కృష్ణా జిల్లా ఫస్ట్ ర్యాంకర్‌గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి
ఫస్ట్ లిస్ట్‌లో ఉన్న పేరు సెకండ్ లిస్ట్‌లో మాయం.. కోర్టుకు వెళ్లిన అభ్యర్థి
ఇతని ఐడీ బ్లాక్ చేసి.. డేటాను చెరిపేసి కబుర్లు
ఒక్కో టీచర్ పోస్టుకు రూ.15– 20 లక్షలకు బేరసారాల ఆడియో బట్టబయలు
1:1 నిష్పత్తిలో వెరిఫికేషన్‌కు పిలిచి.. అన్ని సక్రమంగా ఉన్న అభ్యర్థులకు మొండి చేయి
కుంభకోణం జరిగిందనేందుకు కళ్లెదుట ఇన్ని సాక్ష్యాలున్నా స్పందించని బాబు సర్కారు
ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్ర సర్కారు వైఖరిపై విస్తృత చర్చ
సాక్షి, అమరావతి: నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై దేశ వ్యాప్తంగా యువత ఆందోళనకు దిగడంతో ఎట్టకేలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్ బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నష్టపోయిన డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో టెట్, డీఎస్సీ పరీక్ష, అసలు డిగ్రీనే లేకున్నా బరితెగించి టీచర్ పోస్టులు కట్టబెట్టడంపై సాక్షాధారాలతో రుజువైనా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నాపత్నం అప్‌లోడ్ ప్రక్రియలో పాల్గొన్న కాంట్రాక్టు సిబ్బందే డీఎస్సీ పరీక్షల్లో టాప్ ర్యాంకర్లుగా నిలవడం.. మొదటి జాబితాలో ఉన్న వారి పేర్లు రెండో జాబితాలో మాయం కావడం.. ఆపై అభ్యర్థి కోర్టుకు వెళ్లడం.. అతని ఐడీని బ్లాక్ చేయడం.. ఒక్కో పోస్టు రూ.15 లక్షలు అంటూ అంగట్లో సరుకులా బేరం పెట్టి అమ్మిన ఆడియోలు బట్టబయలు కావడం.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి పోస్టులు ఇవ్వకపోవడం.. కేవలం జిల్లా, జోన్ స్థాయి ఆటల్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం.. ఆ సర్టిఫికెట్లు కూడా టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలే ఇవ్వడం.. ఇలా ఎన్నో సాక్ష్యాధారాలు స్కామ్‌ను బట్టబయలు చేశాయి. ఈ స్కామ్‌ను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సర్కార్ చేసిన విన్యాసాలు.. తప్పుమీద తప్పులు చేయడాలు.. అధికారులతో అబద్ధాలు చెప్పించడాలు అందరికీ తెలిసిందే. ఇంత అరాచకంగా, లెక్కలేనితనంతో సాగించిన ఈ స్కామ్.. నీట్ పేపర్ లీక్ కంటే రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించింది. డీఎస్సీ బాధితులు రోడ్లెక్కి నిరసనలు, ఆందోళనలు చేశారు. అయినప్పటికీ బాబు సర్కార్ కనీస బాధ్యత వహించలేదు. తాజాగా నీట్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ప్రధాన్ రాజీనామా చేసిన క్రమంలో డీఎస్సీ స్కామ్‌కు లోకేశ్ బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందేనని నిరుద్యోగులు పట్టుబడుతున్నారు.
జాతీయ స్థాయి క్రీడాకారులకు అన్యాయం
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ–2025ను బాబు ప్రభుత్వం నిర్వహించింది. 16 వేల పోస్టుల్లో 3 శాతం పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద రిజర్వు చేసింది. స్పోర్ట్స్ కోటా డీఎస్సీ అంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా అక్రమాలకు పాల్పడి కావాల్సిన వారికి దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చేశారు. ఈ కుంభకోణం కోసమే జీవో 4.. 47 తెచ్చారు. తద్వారా టెట్, రాత పరీక్ష, అసలు డిగ్రీనే లేకుండా టీచర్ పోస్టు కట్టబెట్టే దారుణానికి బరితెగించారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేస్తూ చంద్రబాబు బంధువు.. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చైర్మన్‌గా ఉన్న క్రీడా సంఘాలు జారీ చేసిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ల ఆధారంగా తమ వాళ్లకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసుకున్నారు. ఒక్కో టీచర్ పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు అమ్మేసుకునే బేరసారాలకు సంబంధించిన వీడియో, ఆడియో సాక్ష్యాలు బయటకు వచ్చాయి.
మరోవైపు సాధారణ డీఎస్సీ కింద టీచర్ పోస్టుల భర్తీలోను పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన స్పోర్ట్స్ డీఎస్సీ కుంభకోణంతో నిజమైన క్రీడాకారులం నష్టపోయామని ఎందరో రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన తనకు టీచర్ ఉద్యోగం రాలేదని పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు దుర్గయ్య వంటి వారెందరో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ వాళ్లకు ఉద్యోగాలన్నీ ఇచ్చేసుకున్న తర్వాత జీవో 23.. 25.. 56 జారీ చేసి.. అంతకు ముందు ఇచ్చిన జీవో 4.. 47ను రద్దు చేసేశారు. ఇలా స్పోర్ట్స్ కోటా డీఎస్సీ రూపంలో జరిగిన స్కామ్ రాష్ట్ర ప్రజల కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. దుర్గయ్య తరహాలో మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులెందరో స్పోర్ట్స్ డీఎస్సీలో దగాకు గురయ్యారు. నష్టపోయిన వీరంతా తమకు అన్యాయం జరిగిందని ఎక్కడికక్కడ నిలదీసినా చంద్రబాబు సర్కార్‌లో కనీస చలనం లేదు. 
ఐడీ బ్లాక్ చేసి.. వివరాలు తొలగించి..
ఈ కుంభకోణం కోసమే పక్కా స్కెచ్‌లో భాగంగా డీఎస్సీ కన్వీనర్‌ను చంద్రబాబు ప్రభుత్వం తొలుతే పక్కన పెట్టేసింది. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కే అప్పగించింది. గోప్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్‌లోడ్ ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) తెలుగు పరీక్షలో కూడా జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. డీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ అయిందనడానికి ఇదే పెద్ద నిదర్శనం. నవీన్ విషయం బయటకు వస్తే గుట్టురట్టు అవుతుందని అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదని చెప్పింది. తీరా అతని ఐడీని బ్లాక్ చేసి.. వివరాలు డీఎస్సీ డేటాలోనే లేకుండా ప్రభుత్వం చెరిపేసి కుట్రకు పాల్పడింది. అయితే మెరిట్ సాధించినా తనకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదని నవీన్ కోర్టును ఆశ్రయించడంతో బాబు సర్కార్ కుట్రలు బెడిసికొట్టాయి. ఈ ఘటన అనంతరం డీఎస్సీ పేపర్ లీక్.. నవీన్ ఒక్కడితో ఆగలేదని, సీబీఐ విచారణ చేసి వాస్తవాలను నిగ్గు తేల్చాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. 

1:1 నిష్పత్తిలో పిలిచి మొండి చేయి
డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. పోస్టుల భర్తీకి 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. అన్ని నిబంధనలు, జీవోలను పరిగణనలోకి తీసుకుని.. డీఎస్సీ కమిటీ మెరిట్, రోస్టర్‌ను సిద్ధం చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రూల్ నంబర్ 20 చెబుతోంది. ఈ నిబంధన ఆధారంగా ఒక పోస్టుకు ఒకరి చొప్పున కాల్ లెటర్ పంపి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచింది. ఈ క్రమంలో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నట్టు తేల్చిన అభ్యర్థుల్లో పలువురికి పోస్టులు దక్కలేదు. సెలక్షన్ లిస్ట్‌లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పించారు. ఇలా డీఎస్సీ ప్రక్రియలో ఆద్యంతం అక్రమాలు, అన్యాయాలు, బరితెగింపులు చోటు చేసుకున్నాయి. జరిగిన ప్రతి అక్రమం పక్కా సాక్ష్యాలతో బట్టబయలు అయింది. నష్టపోయిన అభ్యర్థులు కళ్లెదుటే కనిపిస్తున్నారు. వారంతా సీబీఐ విచారణ చేపట్టి అక్రమాలను నిగ్గు తేల్చాలని, లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకుండా పోయింది. తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో లోకేశ్ సైతం అదే బాటలో రాజీనామా చేసి, డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహించాలని రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత డిమాండ్ చేస్తున్నారు.
వీటినేమంటారు?
⇒ స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిఫేట్ చేసిన సర్టిఫికెట్స్‌తో 270 పోస్టులు ఇచ్చేశారు.
⇒ ఆయా గేమ్స్‌లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటెన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.
⇒ వివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇంటర్ డిస్ట్రిక్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వివిధ యూనివర్సిటీల నుంచి పార్టిసిపేట్ సర్టిఫికెట్‌లతో ఉద్యోగాలు ఇచ్చారు. 
⇒ ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షలు అంటూ బేరసారాలు ఆడిన వీడియో బయటపడింది. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్‌ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం అన్నింటికంటే దారుణం.
⇒ ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలు, ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్లిస్టల్ క్లియర్‌గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది.
అందుకే థర్డ్ పార్టీ ఎంక్వైరీ.. అంటే సీబీఐతో విచారణ జరిపించాలి.


