ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలో.. కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఒక మధుర జ్ఞాపకాన్ని వేదాంత సంస్థ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. తన వ్యాపార జీవితంలో అత్యంత కీలకమైన విజయానికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన సహాయం కారణమని ఆయన తెలిపారు.
భారతీయ కంపెనీలకు దేశీయ స్టాక్ మార్కెట్‌లో తగిన గుర్తింపు, విలువ లభించడం లేదని అనిల్ అగర్వాల్ భావించారు. దీంతో.. వేదాంతను లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే.. విదేశీ స్టాక్ మార్కెట్‌లో భారతదేశ కంపెనీని లిస్ట్ చేయాలంటే ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోవడం తప్పనిసరి. ఆ అనుమతి పొందడం చాలా కష్టమైన పని.
10 December 2003!
मुझे आज भी London की वो सुबह याद है, जब Vedanta के साथ-साथ, हिंदुस्तान भी इतिहास रचने के लिए तैयार था।
उस समय मुझे अक्सर लगता था कि भारतीय businesses को सही value और growth नहीं मिल रही।
मैंने तय कर लिया कि Vedanta को London Stock Exchange पर list करेंगे।
पर… pic.twitter.com/DyX1GE6eCb— Anil Agarwal (@AnilAgarwal_Ved) August 5, 2026
ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అనిల్ అగర్వాల్ ఢిల్లీకి వెళ్లి పలువురు అధికారులను కలిశారు. చివరకు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని కలిసి తన ఆలోచనను వివరించే అవకాశం దక్కింది. ఆయన చెప్పిన విషయాన్ని వాజ్‌పేయి ఎంతో శ్రద్ధగా విన్నారు. తర్వాత.. అప్పటి ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్‌ను చూసి,''ఈ అబ్బాయి మంచివాడిలా కనిపిస్తున్నాడు. ఇతనికి సహాయం చేద్దాం. దీని వల్ల విదేశీ మారకద్రవ్యం దేశానికి వస్తుంది'' అని చెప్పారు.
ప్రధానమంత్రి మద్దతుతో ప్రభుత్వం వెంటనే అవసరమైన ఎన్ఓసీను జారీ చేసింది. ఆ అనుమతి పత్రంతో.. అనిల్ అగర్వాల్ తిరిగి లండన్ వెళ్లి తన కలను నిజం చేసుకున్నారు. వేదాంత సంస్థ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్ పొందిన తొలి భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఎఫ్‌టీఎస్‌ఈ 100 ఇండెక్స్‌లో కూడా స్థానం సంపాదించింది. ఈ విజయాన్ని అనిల్ అగర్వాల్ తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు.


