టాటా సన్స్ చైర్మన్ గా ఎన్. చంద్రశేఖరన్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందన్న వార్తలతో గురువారం టాటా గ్రూప్ కంపెనీల షేర్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ప్రధానంగా టాటా కెమికల్స్, టాటా మోటార్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ స్టాక్స్ నిఫ్టీ రికవరీకి బలమైన ఊతాన్నిచ్చాయి.
బోర్డు నిర్ణయం వెనుక..
టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరితో ముగియనుంది. ఆయన మొదట పదవీ కాలాన్ని పొడిగించుకోవడానికి ఆసక్తి చూపకపోయినప్పటికీ, గ్రూప్ నాయకత్వం, కార్పొరేట్ పరివర్తన సమర్థవంతంగా సాగాలంటే ఆయనే కొనసాగాలని నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ కోరింది.
దీంతో ఆయన ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. బోర్డు సమావేశంలో నోయల్ టాటా మినహా మిగతా సభ్యులందరూ చంద్రశేఖరన్ పునఃనియామకానికి అనుకూలంగా ఓటు వేసినట్లు సమాచారం.
స్టాక్ మార్కెట్లో మార్మోగిన టాటా గ్రూప్ షేర్లు
టాటా కెమికల్స్ షేర్ల ధర 14% పెరిగి రూ.832 (19 వారాల గరిష్టం) లకు చేరి 6% లాభంతో రూ.775.10 వద్ద క్లోజైంది.
టాటా మోటార్స్ (PV) షేర్ల విలువ 6% పైగా పెరిగి రూ.319.8 (16 వారాల గరిష్టం) గరిష్టాల వద్ద స్థిరంగా ట్రేడవుతుతోంది.
టాటా ఇన్వెస్ట్‌మెంట్ షేర్లు 6% పెరిగి రూ.733.50 తాకి ఇంట్రాడే గరిష్ట స్థాయిల్లో కొనసాగుతోంది.
టీసీఎస్ (TCS) షేర్లు 3% పైగా ఎగిసి రూ.2,263.60 లను తాకి ఫ్లాట్‌గా (రూ.2,193.50) ట్రేడవుతున్నాయి.
కలిసొచ్చిన ఆర్బీఐ నిర్ణయం
కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC)గా ఉన్న టాటా సన్స్, లిస్టింగ్ నిబంధనల నుంచి మినహాయింపు పొందడానికి ఆ హోదాను రద్దు చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆ దరఖాస్తును ఆర్బీఐ ఇటీవల తిరస్కరించింది.
ఈ పరిణామం టాటా సన్స్‌లో వాటాలు కలిగిన గ్రూప్ కంపెనీలకు (ముఖ్యంగా టాటా కెమికల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్) తీవ్ర ప్రయోజనం చేకూర్చడంతో ఈ వారం ప్రారంభం నుంచే మార్కెట్లో కొనుగోళ్ల పండగ కనిపిస్తోంది. బోర్డులో తాజా నాయకత్వ నిర్ణయం ఈ ర్యాలీకి మరింత ఊపందించింది.


