778 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
మూడు నెలల కనిష్టం
నిఫ్టీ 280 పాయింట్లు డౌన్
ఐదు నెలల కనిష్టం
ముడిచమురు ధరల సెగలు
అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు ఆందోళనలు
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, బాండ్లపై రాబడులతో పాటు ముడిచమురు ధరలు పెరగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ 1 శాతానికి పైగా నష్టపోయింది. సెన్సెక్స్ 778 పాయింట్లు కోల్పోయి మూడు నెలల కనిష్టం 74,004 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 280 పాయింట్లు పతనమై 5 నెలల కనిష్టం 23,119 వద్ద నిలిచింది. ప్రాథమిక మార్కెట్లో పలు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్ ప్రారంభంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత, పశ్చిమాసియాలోకు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు, వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి.
సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం (75,436) నుంచి 1,442 పాయింట్లు క్షీణించి 73,994 వద్ద, నిఫ్టీ డే హై (23,593) నుంచి 474 పాయింట్లు పతనమై 23,117 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 9 లక్షల కోట్ల మేర హరించుకుపోయి రూ.472 లక్షల కోట్లకు దిగొచి్చంది. ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. భారత్‌కు అత్యధికంగా దిగుమతయ్యే బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 108 డాలర్లకు చేరుకుంది.
⇒ ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో క్యాపిటల్ గూడ్స్ 4.19%, రియల్టీ 3.93%, మిడ్‌క్యాప్ సెలెక్ట్ 2.50%, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.41 శాతం పతనమయ్యాయి.
⇒ లిస్టింగ్ లాభాలు కోల్పోయిన ప్రణవ్ కన్‌స్ట్రక్షన్ షేరు స్వల్ప లాభాలతో గట్టెక్కింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.124)తో పోలిస్తే 31% ప్రీమియంతో రూ.162 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 33% ఎగసి రూ.165 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరికి షేరు 4.50% పెరిగి రూ.130 వద్ద స్థిరపడింది.
⇒ నూతన సీఈవో నియామక ప్రక్రియ ముందడుగుతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.27 శాతం పెరిగి రూ.717 వద్ద స్థిరపడింది.
⇒ టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ‘టాటా సన్స్’ తన కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (సీఐసీ) నమోదును రద్దు చేసుకోవడానికి సమర్పించిన దరఖాస్తును ఆర్‌బీఐ తోసిపుచి్చంది. దీంతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు (లిస్టింగ్‌కు) రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామంతో టాటా గ్రూప్ కంపెనీల షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. టాటా కెమికల్స్ 20%, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ 15.2% ర్యాలీ చేశాయి. టాటా కెమికల్స్ 20% ర్యాలీ చేశాయి. టీఎంపీవీ 5.9%, టీసీఎస్ 5.5%, టాటా ఎలాక్సీ 4.3%, టాటా పవర్ 3.4% పెరిగాయి.


