డాలర్ మారకంలో 34 పైసలు డౌన్
95.88 వద్ద ముగింపు
ముంబై: రూపాయి పతనం ఆరో రోజూ ఆగలేదు. డాలర్ మారకంలో 34 పైసలు బలహీనపడి 95.88 వద్ద స్థిరపడింది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 108 డాలర్లకు చేరుకోవడం దేశీయ కరెన్సీ కోతకు ప్రధాన కారణమైంది. దేశీయ ఈక్విటీ మార్కెట్ బలహీనపడటం, అమెరికా కరెన్సీ డాలర్ బలోపేతం, అంతర్జాతీయంగా బాండ్లపై రాబడులు పెరగడం తదితర అంశాలు మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.
ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో 95.84 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌లో 95.75 – 95.96 శ్రేణిలో కదలాడింది. క్రూడాయిల్ దిగుమతిదారుల నుంచి డాలర్ల కొనుగోళ్లు ఎగబాకడం మార్కెట్లో కలకలం రేపింది. మొత్తం ఆరు ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి విలువ 148 పైసలు (1.45%) కరిగిపోయింది.


