అమెరికా డాలర్ విలువ, బంగారం ధరలపై ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న తన ఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు చేసిన ఆయన.. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బంగారం ప్రమాణాన్ని (గోల్డ్ స్టాండర్డ్) నిలిపివేసిన పరిణామాలను ప్రస్తావించారు. అప్పటి నుంచి డాలర్ కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు.
1971లో ఒక ఔన్స్ బంగారం విలువ 35 డాలర్లు ఉండేదని, ప్రస్తుతం అది 4,342 డాలర్లకు చేరిందని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. అంటే బంగారం ధర 124 రెట్లు పెరిగిందని చెప్పారు. అయితే ఇది బంగారం విలువ పెరగడం కంటే.. డాలర్ కొనుగోలు శక్తి భారీగా క్షీణించడాన్ని సూచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘రిచ్ డాడ్’ తనకు 21 ఏళ్ల వయసులో డాలర్ గురించి చెప్పిన విషయాన్ని కూడా కియోసాకి గుర్తు చేసుకున్నారు. నిక్సన్ ఒక్క రాత్రిలో డాలర్‌ను విలువ తగ్గించలేదని, అప్పటికే దాని విలువ తగ్గిపోయిందనే విషయాన్ని మాత్రమే వెల్లడించారని తన ‘రిచ్ డాడ్’ చెప్పేవారని పేర్కొన్నారు. అప్పట్లో ఈ పరిణామాలను గమనించిన వారు భూములు, చమురు, గనులు వంటి హార్డ్ అసెట్స్‌లో పెట్టుబడులు పెట్టారని, ఇతరులు బ్యాంకు ఖాతాల్లో పొదుపు చేసి కొనుగోలు శక్తిని కోల్పోయారని వ్యాఖ్యానించారు.
బంగారం కొనుగోలు గురించి అందరూ మాట్లాడుతున్నప్పటికీ, వాస్తవంగా కొద్దిమందే పెట్టుబడి పెడుతున్నారని కియోసాకి అన్నారు. నాణేలు లేదా గోల్డ్ ఆధారిత పెట్టుబడి సాధనాల కంటే బంగారం ఉత్పత్తి చేసే గనుల్లో యాజమాన్య వాటా కలిగి ఉండటమే మెరుగైన వ్యూహమని తన ‘రిచ్ డాడ్’ సూచించేవారని చెప్పారు.
ఈ నేపథ్యంలో ‘క్యాపిటల్ క్లబ్’ పేరుతో ఒక ప్రైవేట్ పెట్టుబడి వేదిక గురించి కూడా కియోసాకి తన పోస్టులో ప్రస్తావించారు. నాలుగు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బంగారం, వెండి మైనింగ్ కంపెనీలో ప్రీ-పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా పెట్టుబడి అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కొలరాడో, ఘనా, దక్షిణాఫ్రికా, పపువా న్యూ గినియాలో కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రైవేట్ రౌండ్‌లో ఇప్పటికే సగానికి పైగా పెట్టుబడులు సమీకరించబడ్డాయని, తదుపరి అవకాశం ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని కియోసాకి తెలిపారు. అయితే ప్రైవేట్ పెట్టుబడులు, మైనింగ్ కంపెనీల్లో వాటాలు వంటి అంశాల్లో అధిక రిస్క్ ఉండొచ్చన్న విషయాన్ని పెట్టుబడిదారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.


