మహీంద్రా గ్రూప్ హెవీ డ్యూటీ ట్రక్కుల విభాగంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా ‘బ్లేజో ఐ–టీఆర్‌కే’ ట్రక్కును మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనిని కేవలం ట్రక్కుగానే కాకుండా, వ్యాపార లాభాలను పెంచే ‘బిజినెస్ సొల్యూషన్’గా తీర్చిదిద్దారు. అత్యుత్తమ ఇంధన సామర్థ్యం (మైలేజ్), శక్తివంతమైన పవర్‌ట్రెయిన్, పరిశ్రమలోనే ఉత్తమమైన ‘అప్‌టైమ్ గ్యారెంటీ’తో ఈ ట్రక్కు అందుబాటులోకి వస్తోంది. ఇది ఆపరేటింగ్ ఖర్చులను తగ్గించి, ఉత్పాదకత, యజమానుల సంపాదనను పెంచుతుంది.
ఇందులో మహీంద్రాకు చెందిన నెక్ట్స్ జనరేషన్ కనెక్టెడ్ ప్లాట్‌ఫామ్ ‘ఐఎంఏఎక్స్‌ఎక్స్ 2.0’ సదుపాయం ద్వారా ముందస్తు డయాగ్నోస్టిక్స్, డ్రైవర్ ప్రవర్తన పర్యవేక్షణ సులభమవుతాయి. అలాగే బ్రేక్‌డౌన్ సాయం, వ్యాన్ రియల్–టైమ్ ట్రాకింగ్, వేగవంతమైన డిజిటల్ ఆమోదాలు, స్పేర్ పార్ట్స్ ఆర్డరింగ్, సర్వీస్ హిస్టరీ, రిమైండర్ల వంటి డిజిటల్ సేవలను నిర్వహించుకునేందుకు ‘నౌ 24 గీ7’ మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. ‘బ్లేజో ఐ–టీఆర్‌కే’ ట్రక్కు విడుదల ద్వారా హెవీ ట్రక్ విభాగంలో గతంలో తమకున్న అయిదు శాతం మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకోవడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది.
సరైన సమయంలోనే ఎలక్ట్రిక్ ట్రక్కులు
సుదూర రవాణాకు అవసరమైన చార్జింగ్ మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాకే.. సరైన సమయంలో హెవీ ఎలక్ట్రిక్ ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేస్తామని మహీంద్రా గ్రూప్ ఉన్నతాధికారి వినోద్ సహాయ్ తెలిపారు. ప్రతి 200–250 కి.మీలకు చార్జింగ్ పాయింట్లు అవసరమన్నారు. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ దేశంలో వాణిజ్య వాహనాల డిమాండ్ బాగుందన్నారు. పరిశ్రమ 10–12% వృద్ధి నమోదు చేస్తే, మహీంద్రా గ్రూప్ ఏకంగా 13% వృద్ధి సాధించిందని వివరించారు.


