న్యూఢిల్లీ: భారత తీర ప్రాంతాల దాకా దూసుకొచ్చిన శత్రు జలాంతర్గాముల జాడ కనిపెట్టి వాటిపై దాడి చేసే సత్తా ఉన్న మహీ శ్రేణి ‘మచిలీపట్నం’ నౌకను భారత నావికాదళం బుధవారం విజయవంతంగా జలప్రవేశం చేయించింది.
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఎనిమిదవ యాంటీ–సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్‌క్రాఫ్ట్‌ను నావికాదళంలో చేర్చారు. ఈ నౌకలో జలాంతర్గాములను విధ్వంసంచేసే ఆయుధ వ్యవస్థలు, జలాంతర్గత నిఘా వ్యవస్థలు, సముద్రపాతరలను గుర్తించే వ్యవస్థలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం తీర పట్టణ ఘన చరిత్రను స్మరిస్తూ కొత్త నౌకకు ‘మచిలీపట్నం’ అని నామకరణం చేసినట్లు రక్షణశాఖ తెలిపింది.


