ఓవర్‌లోడ్‌కు అడ్డే లేదు! | overloaded vehicles can operate with impunity | Sakshi
Sakshi News home page

ఓవర్‌లోడ్‌కు అడ్డే లేదు!

Jun 25 2026 5:10 AM | Updated on Jun 25 2026 5:10 AM

overloaded vehicles can operate with impunity

చేవెళ్ల దుర్ఘటన తర్వాత కూడా మారని తీరు 

నాలుగు రోజుల క్రితం తనిఖీలో ఒకేరోజు వంద ఓవర్‌లోడ్‌ ట్రక్కుల జప్తు 

ఆ మరుసటి రోజే తనిఖీ డ్యూటీలో లారీ ఢీకొని డీటీఓ దుర్మరణం 

ఇప్పటికీ రవాణా శాఖ, గనుల శాఖ మధ్య కుదరని సమన్వయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెద్దయెత్తున ఓవర్‌లోడ్‌తో కూడిన ట్రక్కుల్లాంటి వాహనాలు ఇప్పటికీ రోడ్ల మీద యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి. కేవలం రెండు రోజుల తనిఖీల్లో దాదాపు 190 ఓవర్‌ లోడ్‌ వాహనాలను అధికారులు జప్తు చేశారంటే, పరిమితికి మించిన లోడ్‌తో ఎన్ని వాహనాలు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాయో అవగతమవుతోంది. ఇదెంత ప్రమాదకరమో కూడా అర్థమవుతోంది. 

గత సోమవారం భూపాలపల్లి జిల్లాలో పరిమితికి మించిన లోడ్‌తో వెళ్లే వాహనాల తనిఖీలో ఉండగా బొగ్గు లోడు లారీ ఢీకొనటంతో జిల్లా రవాణా అధికారి వెంకన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఓవర్‌లోడ్‌ వాహనాలు రాత్రి 11 తర్వాతే ప్రయాణిస్తుండటంతో అర్ధరాత్రి వేళ అధికారులు తనిఖీలు చేయాల్సి వస్తోంది. అసలు ఓవర్‌లోడ్‌ సమస్యే లేకుంటే ఆ రోజు వెంకన్న తనిఖీ డ్యూటీలో ఉండేవారు కాదు.. ఆయన దుర్మరణం చెంది ఉండేవారు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

రాయల్టీ చెల్లిస్తే..ఓవర్‌లోడ్‌కు ఓకే!: ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక, క్రషర్ల నుంచి కంకర, గ్రానైట్, థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి ఫ్లైయాష్ లను భారీ ట్రక్కుల్లో తరలిస్తుంటారు. ఇక్కడే పరిమితికి మించిన లోడ్‌ ట్రక్కుల్లోకి చేరుతోంది. ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగుతున్న ఇసుక రీచుల వద్ద అక్రమంగా అదనపు లోడ్‌ను లారీల్లోకి ఎక్కించేస్తున్నారు. లోడ్‌ వివరాలు వెల్లడిస్తూ జారీ అయ్యే వే బిల్లుల్లో మాత్రం నిబంధనలకు లోబడే లోడ్‌ ఉంటుండటం గమనార్హం.

ఈ క్రమంలో భారీ మొత్తం చేతులు మారుతోంది. ఇక మైనింగ్‌ శాఖ ఆధ్వర్యంలో క్రషర్లలో లోడింగ్‌ జరుగుతోంది. కంకర, గ్రానైట్‌ రాళ్లను పరిమితికి మించి తరలిస్తున్నారు. ఇక సిమెంటు కంపెనీలు సిమెంటును, థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు ఫ్లైయాష్ ను అలాగే తరలిస్తున్నాయి. ట్రక్కు సామర్థ్యం మేరకు లోడ్‌ ఉండాల్సి ఉండగా, దాన్ని పట్టించుకోకుండా ఎంత పరిమాణానికి రాయల్టీ చెల్లిస్తే అంత లోడ్‌ను నింపేస్తున్నారు. రవాణా, గనుల శాఖల మధ్య సమన్వయ లోపంతో ఓవర్‌లోడ్‌ ట్రక్కులకు అడ్డు లేకుండా పోతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి.  

నిపుణులేం చెబుతున్నారు? 
‘ప్రతి క్రషర్, క్వారీ, మైనింగ్‌ ప్రాంతం వద్ద ఉండే డిజిటల్‌ వే బ్రిడ్జ్‌లను రవాణా శాఖ సర్వర్‌తో అనుసంధానించాలి. వాహన పరిమితి కన్నా ఒక్క కేజీ ఎక్కువ ఉన్నా అక్కడి గేటు దాటకుండా కఠిన లాకింగ్‌ సిస్టమ్‌ తీసుకురావాలి. ఓవర్‌లోడ్‌ ఎక్కించిన సదరు క్రషర్‌/క్వారీ యాజమాన్యాలపై భారీ జరిమానాలతో పాటు లైసెన్స్‌ రద్దు చేసేలా గనుల శాఖ నిబంధనలు సవరించాలి. రవాణా, గనులు, పోలీస్‌ శాఖలతో కలిపి ’ఉమ్మడి హైవే టాస్‌్కఫోర్స్‌’ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాలి. క్షేత్రస్థాయిలో తనిఖీలుచేసే అధికారులకు బాడీ కెమెరాలతో పాటు, స్పీడ్‌ బ్రేకింగ్‌ బారికేడ్లు, తగిన పోలీస్‌ రక్షణ కల్పించాలి..’అని నిపుణులు సూచిస్తున్నారు.  

గతేడాది నవంబర్‌ 3న చేవెళ్ల సమీపంలోని మిర్జాగూడ వద్ద పరిమితికి మించిన కంకర లోడ్‌తో దూసుకొచ్చిన టిప్పర్‌ ఆర్టీసీ బస్సును ఢీకొనటంతో 19 మంది ప్రయాణికులు చనిపోయారు. దూసుకొచ్చిన ట్రక్కు, ఓవర్‌లోడ్‌ వల్లనే బీభత్సం సృష్టించింది. ఓవర్‌లోడ్‌ వాహనాలను నియంత్రించనున్నట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. రవాణాశాఖ–గనుల శాఖ మధ్య సమన్వయం తీసుకొస్తామని పేర్కొంది. ఏడునెలల తర్వాత.. జూన్‌ 20న రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు ఆకస్మికంగా వాహనాలను తనిఖీ చేశారు. ఒకేరోజు ఏకంగా 100 ట్రక్కులను ఓవర్‌లోడ్‌ కారణంతో జప్తు చేశారు. అయితే తనిఖీ జరిగింది కొన్ని ప్రాంతాల్లోనే కాగా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తే ఇంకా ఎన్ని వందల వాహనాలు పట్టుబడేవోనన్న చర్చ జరుగుతోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement