డిజిటల్ యుగంలోనూ తగ్గని ‘నగదు’ హవా | Why Cash Still Rules in Digital Era Surprising Rise of Dollar Euro Rupee | Sakshi
Sakshi News home page

డిజిటల్ యుగంలోనూ తగ్గని ‘నగదు’ హవా

Aug 19 2026 1:04 PM | Updated on Aug 19 2026 1:38 PM

Why Cash Still Rules in Digital Era Surprising Rise of Dollar Euro Rupee

డిజిటల్ లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు ఆకాశాన్ని తాకుతున్న వేళ నోట్ల చలామణి తగ్గిపోతుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా నగదు వినియోగం సరికొత్త గరిష్టాలకు చేరుతోంది. పాత నోట్ల రద్దు, డిజిటలైజేషన్ వంటి పరిణామలు చోటుచేసుకున్నప్పటికీ భారత్ నుంచి అమెరికా, యూరప్ వరకు ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ప్రజల వద్ద నగదు చలామణి గణనీయంగా పెరగడం గమనార్హం.

అగ్రస్థానంలో అమెరికా కరెన్సీ

గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అయిన అమెరికన్ డాలర్ చలామణి విలువపరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.45 ట్రిలియన్ డాలర్లకు పైగా విలువైన కరెన్సీ విపణిలో ఉంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నివేదికల ప్రకారం దాదాపు 56.6 బిలియన్ల నోట్లు చలామణిలో ఉండగా అందులో సగానికి పైగా విలువ ఒక్క 100 డాలర్ల నోట్ల రూపంలోనే ఉంది. ముద్రించిన మొత్తం 100 డాలర్ల నోట్లలో 60% కంటే ఎక్కువ అమెరికా వెలుపలే నిల్వ ఉండటం విశేషం.

డాలర్ తర్వాత ప్రజాదరణ పొందిన కరెన్సీ

యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పరిధిలో దాదాపు 1.56 ట్రిలియన్ యూరోలు (సుమారు 1.7 ట్రిలియన్‌ డాలర్లు) చలామణిలో ఉన్నాయి. మొత్తం 30 బిలియన్ల కంటే ఎక్కువ యూరో నోట్లు అందుబాటులో ఉండగా ఇందులో 50-100 యూరో నోట్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అంతర్జాతీయంగా డాలర్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన కరెన్సీగా యూరో తన బలాన్ని నిలబెట్టుకుంది.

రూపాయి పరిస్థితి ఇలా..

మరోవైపు భారత్‌లో యూపీఐ విప్లవాత్మక మార్పులు తెచ్చినప్పటికీ నగదు వినియోగం ఏమాత్రం తగ్గలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ.35 లక్షల కోట్లకు పైగా దాటింది. నోట్ల సంఖ్య పరంగా ఏకంగా 135 బిలియన్లకు పైగా నోట్లు ప్రజల వద్ద ఉన్నాయి. రూ.2000 నోట్ల రద్దు తర్వాత ప్రస్తుతం భారత కరెన్సీ వ్యవస్థలో రూ.500 నోటే 85% కంటే ఎక్కువ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది.

యుద్ధాలు, ఆర్థిక మాంద్యం భయాల వల్ల అత్యవసర సమయాల కోసం నగదును దాచుకునే అలవాటు పెరగడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిజిటల్ యుగంలో ఈ-రూపీ, డిజిటల్ కరెన్సీలు వస్తున్నప్పటికీ భవిష్యత్తులో డిజిటల్, ఫిజికల్ కరెన్సీలు రెండూ ఒకదానికొకటి పోటీగా ఉన్నాయి. పేపర్ నోట్ల మనుగడ తక్షణమే ప్రశ్నార్థకం కాబోదని ఈ ట్రెండ్ నిరూపిస్తోంది.

ఇదీ చదవండి: బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement