ఆఫీసులో కుక్కల హల్‌చల్‌.. ట్రెండింగ్‌లో వీడియో | Stray Dog Problem, Activists Release Dogs In Niphad Civic Office To Protest, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఆఫీసులో కుక్కల హల్‌చల్‌.. ట్రెండింగ్‌లో వీడియో

Sep 17 2026 10:16 AM | Updated on Sep 17 2026 10:50 AM

Activists Release Stray Dogs in Niphad Office to Protest Bites Viral

నిరసనలు పలు రకాలు.. సమస్యను బట్టి వినూత్నంగా, వెరైటీగా చేపట్టేవి మరికొన్ని. కానీ వీధికుక్కల బెడదపై చేపట్టిన ఈ నిరసన మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అధికారులెంతకూ పట్టించుకోవడం లేదంటూ ఏకంగా కుక్కలనే నగర పంచాయతీ కార్యాలయంలోకి తీసుకొచ్చి అధికారి టేబుల్‌పై వదిలేశారు. అంతేకాదు.. కరెన్సీ నోట్లతో దండ వేసి మరీ తమ నిరసనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా నిఫాడ్‌ నగర్‌ పంచాయతీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌ రాంధవే ఆధ్వర్యంలో కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు. చిన్న సంచుల్లో తీసుకొచ్చిన వీధికుక్కలను కార్యాలయంలోకి తీసుకెళ్లి చీఫ్‌ ఆఫీసర్‌ ధీరజ్‌ భామ్రే టేబుల్‌పై వదిలారు. దీంతో అవి అక్కడి నుంచి అటూ ఇటూ పరుగులు తీయడం వీడియోలో కనిపించింది.

నిఫాడ్‌ పట్టణంలో వీధికుక్కల సంఖ్య పెరిగిపోయిందని, వాటి వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యకర్తలు ఆరోపించారు. పలువురు కుక్కకాటుకు గురయ్యారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. గణేశ్‌ ఉత్సవాల సమయంలో మండపాలకు వచ్చే ప్రజల్లోనూ వీధికుక్కల కారణంగా భయాందోళన నెలకొందని తెలిపారు.

వీధికుక్కలకు స్టెరిలైజేషన్‌ నిర్వహించడంతోపాటు వాటిని పట్టుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని రాంధవే డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకుండా టెండర్‌ ప్రక్రియలపైనే అధికారులు దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇదే తరహాలో అధికారుల కార్యాలయంలో కుక్కలను తీసుకొచ్చి నిరసన చేపడతామని హెచ్చరించారు.

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలోనూ వీధికుక్కల సమస్యను నిరసిస్తూ ఓ వ్యక్తి కుక్క మాస్క్‌ ధరించి ప్రజావాణికి హాజరైన ఘటన వైరల్‌గా మారింది. తాజాగా నిఫాడ్‌లో కార్యకర్తలు ఏకంగా కుక్కలనే అధికారుల కార్యాలయంలోకి తీసుకురావడంతో ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఇదీ చదవండి: మొసలిని ఇంటికి తెచ్చాడు.. అమ్మ మాటతో వెనక్కి వెళ్లాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement