నరేంద్ర మోదీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న భారత ప్రధాని. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకంటూ భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది ఇవాళ ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే మోదీ చిన్ననాటి జీవితం గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో ఓ ఘటన తెలిస్తే మాత్రం.. ఆయన ‘గుండె ధైర్యం’ ఏపాటిదో ఇట్టే అర్థమైపోతుంది.
మోదీకి చిన్నతనంలో ఈత అంటే చాలా ఇష్టం ఉండేదట. ఉదయం కుటుంబ టీ దుకాణంలో పని చేసిన తర్వాత మోదీ వడ్నగర్‌లోని శర్మిష్ఠ సరస్సుకు వెళ్లేవారు. సరస్సు మధ్యలో ఉన్న ఆలయం వరకు ఈత కొట్టి, అక్కడి జెండాను తాకి తిరిగి ఒడ్డుకు వచ్చేవారు. ఇలా రోజుకు మూడుసార్లు చేసేవారు. అయితే ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఆయనకు ఓ భయానక అనుభవం ఎదురైంది.
ఈత కొడుతుండగా ఓ మొసలి ఆయన కాలిని బలంగా తాకింది. దీంతో తీవ్రంగా గాయపడి తొమ్మిది కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది. ఆ దెబ్బతో వారం రోజులు ఆయన మంచానికే పరిమితం అయ్యారు. అయితే నెల తిరగకుండానే ఆయన మళ్లీ అదే సరస్సులో ఈతకు వెళ్లారట. ఈ విషయాన్ని మోదీ జీవితంపై వచ్చిన నరేంద్ర మోదీ: ది గేమ్ చేంజర్ అనే పుస్తకంలో జర్నలిస్ట్ సురేశ్ కే వర్మ ప్రస్తావించారు.
అదే తొలిసారి కాదు!
మోదీ చిన్ననాటికి సంబంధించిన మరో మొసలి కథ కూడా ప్రచారంలో ఉంది. ఓసారి సరస్సు ఒడ్డున ఓ మొసలి పిల్ల కనిపించడంతో దాన్ని ఆయన భుజాన వేసుకుని ఇంటికి తీసుకెళ్లారట. అది అడుగుకుపైగా పొడవు ఉందట. దాన్ని ఇంట్లోనే పెంచుకోవాలని మోదీ అనుకున్నప్పటికీ.. తల్లి హీరాబెన్ మాత్రం వద్దని చెప్పారట. వెంటనే దాన్ని ఆయన తిరిగి సరస్సులో వదిలేశారట. ఈ చిన్ననాటి జ్ఞాపకాన్ని మోదీ స్వయంగా కూడా 2019లో బేర్ గ్రిల్స్‌తో కలిసి పాల్గొన్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు.
సాధారణ కుటుంబంలో, చిన్న ఇంటి నుంచి మొదలైన ఈ ప్రయాణం.. ఆ తర్వాత రాజకీయాల్లోకి మళ్లింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జూన్ 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ జీవితంలోనూ ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బాల్యంలో మొసలిని ఎదుర్కొన్న ఘటన కావొచ్చు.. తర్వాత పాలనలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కావొచ్చు.. మోదీ జీవిత ప్రయాణంలో ధైర్యం, నిర్ణయాత్మకతకు సంబంధించిన అధ్యాయాలు చాలానే కనిపిస్తాయి. అయితే వాటన్నింటికీ చాలా ముందే.. వడ్నగర్‌లోని శర్మిష్ఠ సరస్సు దగ్గర ఓ బాలుడిగా ఎదుర్కొన్న ఆ మొసలి ఘటన మాత్రం ఆయన చిన్ననాటి జ్ఞాపకాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.
ఇదీ చదవండి: మోదీని శ్రీ కృష్ణుడితో పోల్చేశాడే!


