యూపీఐ ‘ట్యాక్స్‌’ రచ్చ.. చిదంబరం పేరుతో రాహుల్‌కు కౌంటర్‌! | UPI MDR Row: BJP Hits Back at Rahul Gandhi Cites P Chidambaram | Sakshi
Sakshi News home page

యూపీఐ ‘ట్యాక్స్‌’ రచ్చ.. చిదంబరం పేరుతో రాహుల్‌కు కౌంటర్‌!

Sep 17 2026 7:43 AM | Updated on Sep 17 2026 7:43 AM

UPI MDR Row: BJP Hits Back at Rahul Gandhi Cites P Chidambaram

యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమలు చేయనున్న మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) విషయంలో రాజకీయ రగడ ముదురుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఛార్జీల విధానాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని ఆయన ‘యూపీఐ ట్యాక్స్‌’గా అభివర్ణిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పేరును హైలైట్‌ చేస్తూ బీజేపీ తాజాగా కాంగ్రెస్‌పై ప్రశ్నలు సంధించింది.

బీజేపీ వర్గాల ప్రకారం.. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ యూపీఐకి సంబంధించి శ్రేణుల వారీగా (టైర్డ్‌) ఎండీఆర్‌/రెవెన్యూ విధానాన్ని తీసుకురావాలని సిఫార్సు చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్‌కు చెందిన పి. చిదంబరం(మాజీ ఆర్థిక మంత్రి), మనీష్‌ తివారీ, గౌరవ్‌ గొగోయ్‌, కిషోరీ లాల్‌, కే. గోపీనాథ్‌ కూడా సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 12న కమిటీ నివేదికను ఆమోదించిన సమావేశానికి వీరంతా హాజరయ్యారని, ప్రచురితమైన మినిట్స్‌లో ఎలాంటి అసమ్మతి నమోదు కాలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

దీంతో.. పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్‌ ఎంపీలు ఉన్నప్పుడే యూపీఐకి స్థిరమైన రెవెన్యూ మోడల్‌ అవసరమని సిఫార్సు చేశారని, ఇప్పుడు రాహుల్‌ గాంధీ కొత్త ఎండీఆర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.

ఆ కమిటీ ఏం చెప్పిందంటే..
యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలికంగా ఆర్థికంగా నిలబెట్టేందుకు టైర్డ్‌ రెవెన్యూ మోడల్‌ అవసరమని కమిటీ పేర్కొంది. యూపీఐ వ్యవస్థకు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం సుమారు రూ.2,000 కోట్లుగా ఉండగా.. పరిశ్రమ అంచనా వేసిన నిర్వహణ వ్యయం దాదాపు రూ.20,700 కోట్లుగా ఉందని కమిటీ ప్రస్తావించింది. తగిన రెవెన్యూ వ్యవస్థ లేకపోతే బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అధికంగా ఆధారపడాల్సి వస్తుందని, సైబర్‌ సెక్యూరిటీ, మోసాల నివారణ, నెట్‌వర్క్‌ మౌలిక వసతులపై పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.

అసలు కొత్త ఛార్జీ ఎంత?
కేంద్రం ప్రకటించిన ప్రస్తుత విధానం ప్రకారం అక్టోబర్‌ 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని మర్చంట్‌ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ అమల్లోకి రానుంది. ఈ ఛార్జీని వ్యాపారుల నుంచి వసూలు చేస్తారు. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300గా పరిమితి ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే సాధారణ యూపీఐ బదిలీలు ఈ ఛార్జీ పరిధిలోకి రావు.

రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్‌, ఇంధనం, విద్యుత్‌, నీటి వంటి కొన్ని విభాగాల్లో రూ.2,000కు మించిన చెల్లింపులకు శాతం ఆధారిత ఎండీఆర్‌కు బదులుగా ఫ్లాట్‌ రూ.5 రుసుము ఉండనుంది. క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీలకు 0.02 శాతం ఎండీఆర్‌, గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది.

రాహుల్‌ గాంధీ ఏమంటున్నారు?
ఈ కొత్త విధానాన్ని రాహుల్‌ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూపీఐ ట్యాక్స్‌ వెనక అమెరికా ఒత్తిడి ఉందని ఆరోపించారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణను తిరస్కరించింది. యూపీఐ విధాన నిర్ణయాలు ఎలాంటి బయటి ఒత్తిళ్లతో తీసుకోలేదని స్పష్టం చేసింది. అలాగే కేంద్రం మరోవైపు ఎండీఆర్‌ అంటే పన్ను కాదని, వినియోగదారుల నుంచి ప్రభుత్వం లేదంటే ఎన్‌పీసీఐ నేరుగా వసూలు చేసే ఛార్జీ కూడా కాదని చెబుతోంది. పేమెంట్‌ వ్యవస్థలోని బ్యాంకులు, యాప్‌ ప్రొవైడర్లు తదితర భాగస్వాముల మధ్య ఈ రుసుము పంపిణీ అవుతుందని వివరిస్తోంది.

ఇక రాజకీయంగా కొత్త చర్చ..
ఇలా రాహుల్‌ గాంధీ కొత్త ఎండీఆర్‌ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న వేళ.. అదే సమయంలో పార్లమెంటరీ కమిటీ గతంలో చేసిన టైర్డ్‌ రెవెన్యూ మోడల్‌ సిఫార్సును బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. కమిటీలో ఉన్న ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపీలు నివేదిక ఆమోద సమయంలో ఉన్నారని, ప్రచురితమైన మినిట్స్‌లో వారి అసమ్మతి నమోదు కాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన రెవెన్యూ మోడల్‌కు, ఇప్పుడు అమల్లోకి వస్తున్న ఎండీఆర్‌ విధానానికి ఉన్న తేడాలు ఏమిటన్నదే తాజా రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ పేమెంట్లు చేస్తున్నారా?.. ఛార్జీలు కట్టాల్సిందేనా?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement