నగరం చుట్టూ పటిష్టమైన భద్రత
సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటన
మక్కాపై తాము దాడి చేయలేదన్న హౌతీ రెబెల్స్
కైరో: అత్యంత పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేయడానికి హౌతీ మిలిటెంట్లు ప్రయత్నిస్తున్నారని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆరోపించింది. మక్కాను ‘రెడ్ లైన్’గా ప్రకటించింది. నగరం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు హౌతీలు సౌదీ అరేబియాలోని మౌలిక సదుపాయాలను, ఎర్ర సముద్రంలోని నౌకా రవాణాను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బాబ్ ఎల్–మాండేబ్ జలసంధిలో అనేక ద్వీపాలను స్వా«దీనం చేసుకున్నారు.
ఇరాన్ సైన్యం హార్మూజ్ జలసంధిలో విదేశీ చమురు రవాణా నౌకలను టార్గెట్ చేసింది. దాంతో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా, యెమెన్ సరిహద్దు నుంచి సుమారు 1,100 కిలోమీటర్ల(680 మైళ్ల) దూరంలో ఉన్న మక్కా వైపు డ్రోన్లను ప్రయోగించినట్లు వచ్చిన ఆరోపణలను హౌతీ రెబెల్స్ ఖండించారు. తాము ఎలాంటి దాడి చేయలేదని పేర్కొన్నారు.
అయితే, హౌతీలు ప్రయోగించిన డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా, నాటో సభ్య దేశమైన తుర్కియే, అణ్వస్త్ర శక్తి అయిన పాకిస్తాన్‌ల మధ్య కుదిరిన కొత్త రక్షణ ఒప్పందానికి ఈ తాజా దాడులు పరీక్షగా మారాయి. హౌతీల దాడులను తిప్పికొట్టాలని కోరుతూ సౌదీ అరేబియా నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన అందలేదని తుర్కియే, పాకిస్తాన్ అధికారులు చెప్పారు. ఈ ఒప్పందం అమలులోకి రాకముందే మూడు దేశాల కూటమిని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తుర్కియే అధికారి ఒకరు వెల్లడించారు.
మక్కాపై దాడి యత్నాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. పాక్, సౌదీ అరేబియాలు భుజం భుజం కలిపి నిలుస్తాయని వ్యాఖ్యానించారుర. దాడుల పట్ల ఏ దేశమూ ఉదాసీనంగా ఉండలేదని హౌతీలను పరోక్షంగా హెచ్చరించారు. 57కు పైగా ముస్లిం దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామిక్ సహకార సంస్థ కూడా మక్కాపై దాడి ప్రయత్నాన్ని ఖండించింది. బుధవారం రాత్రి సమయంలో యెమెన్‌లోని మధ్య ప్రాంతమైన మారిబ్‌పైన సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమికి చెందిన ఎఫ్–15 యుద్ధ విమానాన్ని తాము కూల్చివేసినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. అయితే, అందుకు ఆధారాలు చూపించలేదు.
దాడి యత్నం పట్ల భారత్ తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ: మక్కాపై డ్రోన్ దాడికి జరిగిన ప్రయత్నం పట్ల భారత్ బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది, పశ్చిమాసియాలో శాంతిని త్వరగా పునరుద్ధరించాలని మరోసారి పిలుపునిచి్చంది. మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడి పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై దాడులను, పౌరుల ప్రాణాలకు, మౌలిక సదుపాయాలకు ముప్పు కలిగించే చర్యలను భారత్ ఖండిస్తోందని స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ సాధ్యమైనంత త్వరగా జరగాలని ఉద్ఘాటించారు. మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీ మిలిటెంట్లు ప్రయోగించిన ఒక డ్రోన్‌ను మంగళవారం సాయంత్రం అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే.


