నూతన సాంకేతికతల్లో భారత్‌ అగ్రస్థానానికి చేరాలి  | PM Modi urges semiconductor CEOs to support India next growth phase | Sakshi
Sakshi News home page

నూతన సాంకేతికతల్లో భారత్‌ అగ్రస్థానానికి చేరాలి 

Sep 17 2026 5:39 AM | Updated on Sep 17 2026 5:39 AM

PM Modi urges semiconductor CEOs to support India next growth phase

సెమీకండక్టర్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రధాని మోదీ ఆకాంక్ష

న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతల విషయంలో భారత్‌ అగ్రస్థానానికి చేరాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బుధవారం ఢిల్లీలో ప్రముఖ సీఈఓలతో జరిగిన సెమీకండక్టర్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వం, సెమీకండక్టర్‌ పరిశ్రమ మధ్య సన్నిహిత సహకారం అవసరమని తేల్చిచెప్పారు. 

దేశానికి ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ, మౌలిక సదుపాయాల విషయంలో బలమైన పునాది ఉందని గుర్తుచేశారు. సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ సాధించిన గణనీయమైన పురోగతిని ప్రస్తావించారు. ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రాథమిక ప్రయత్నాల దశ నుంచి విస్తృత స్థాయి, గొప్ప అవకాశాలు కలిగిన దశకు మారుతోందని అన్నారు. సాంకేతిక పురోగతులు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మన విధానాలు అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. 

విధానపరమైన, పరిపాలనాపరమైన చర్యలపై సూచనలు ఇవ్వాలని పరిశ్రమ వర్గాలను మోదీ ఆహ్వానించారు. సెమీకండక్టర్‌ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. భారతదేశ సెమీకండక్టర్‌ రంగం వృద్ధికి చొరవ తీసుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి వర్ధమాన సాంకేతికతల్లో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని మోదీ పిలుపునిచి్చనట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో వెల్లడించింది.

 ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి సెమీ, మైక్రాన్, ఇని్ఫనియోన్, అప్లైడ్‌ మెటీరియల్స్, ఏఎస్‌ఎంఎల్, మెర్సెక్, టోక్యో ఎల్రక్టాన్‌ లిమిటెడ్, ఫుజిఫిలిం, ఇంటెల్, టాటా ఎల్రక్టానిక్స్, సెలెస్టా క్యాపిటల్, ఫాక్స్‌కాన్, ఐబీఎం రీసెర్స్‌ తదితర కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ‘‘సెమీకండక్టర్‌ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. దేశంలో పెట్టుబడులకు, వ్యాపార వృద్ధికి అనుకూల వాతావరణం ఉంది. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల ఉన్నతీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మనమంతా నిరంతరం కృషి చేయాలి’’అని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement