ఉత్తర అరేబియా సముద్రంలో ఘటన
తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ
పాక్ దౌత్యవేత్తను పిలిపించి నిరసన
న్యూఢిల్లీ: ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకను పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన నౌక ఢీకొట్టడం సంచలనాత్మకంగా మారింది. ఈనెల 15న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. భారత యుద్ధనౌక సాధారణ నిఘా విధుల్లో ఉండగా, పీఎన్‌ఎస్ హునైన్ అనే పాక్ పెట్రోలింగ్ నౌక దానిని వెంబడించింది.
ప్రమాద సంకేతాలను తెలియజేయడానికి ఉపయోగించే ఛానల్ 16 (సముద్ర రేడియో ఛానల్) ద్వారా పదేపదే హెచ్చరికలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ పాకిస్తాన్ నౌక అకస్మాత్తుగా వేగం పెంచి, భారత యుద్ధనౌక ముందు భాగాన్ని కుడి వైపున ఢీకొట్టింది. చివరికి పాకిస్తానీ నౌక ముందు భాగం భారత యుద్ధనౌకను తాకింది. అయితే, భారత యుద్ధనౌకకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.
ఈ సంఘటన తర్వాత కూడా భారత యుద్ధనౌక తన కార్యకలాపాలను యథాతథంగా కొనసాగించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం పరిణామం పట్ల భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్(సీడీఏ) సాద్ వరైచ్‌కు సమన్లు జారీ చేసింది. బుధవారం ఆయనను పిలిపించింది. అరేబియా సముద్రంలో భారత యుద్ధనౌకను పాక్ నౌక ఢీకొట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. పాకిస్తాన్‌ది ఆమోదయోగ్యం కాని, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధమైన ప్రవర్తన అంటూ తేల్చిచెప్పారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అన్ని సైనిక విభాగాలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందాలు, నిబంధనలను గౌరవించాలని సంబంధిత పాకిస్తాన్ అధికారులకు తెలియజేయాలంటూ సాద్ వరైచ్‌కు సూచించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటన పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా ఇదే విధమైన నిరసనను తెలియజేయాలని అక్కడి భారత చార్జ్ డి అఫైర్స్‌ను ఆదేశించినట్లు స్పష్టంచేసింది.
‘‘అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ఘటన వల్ల పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ.. పాకిస్తాన్ నౌకాదళ నౌక వ్యవహరించిన తీరు మాత్రం సైనిక విన్యాసాలు, కదలికలు, దళాల తరలింపులకు సంబంధించిన ముందస్తు సమాచారంపై 1991 ఏప్రిల్‌లో భారత్–పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందంలోని 10వ అధికరణానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది’’అని భారత విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. మరోవైపు భారత నావికాదళం కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. తమ ఆందోళనను పాకిస్తాన్ సైన్యానికి తెలియజేసింది. పాకిస్తాన్‌కు చెందిన పీఎన్‌ఎస్ హునైన్ నౌక 2024 జూలైలో విధుల్లోకి ప్రవేశించింది. ఇందులో నౌకా విధ్వంసక, వైమానిక రక్షణ ఆయుధాలు, సెన్సార్లు, టెర్మినల్ రక్షణ వ్యవస్థ అమర్చారు.


