మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టీకరణ
న్యూయార్క్: కృత్రిమ మేధ టెక్నాలజీ సురక్షితమైందేనని నిర్ధారించుకోవాల్సింది ఆయా కంపెనీలేనని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రమాదకరంగా మారుతోందని, భద్రతను సునిశ్చితం చేసుకునేంతవరకూ అభివృద్ధి కార్యకలాపాలకు పగ్గాలు వేయాలన్న ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, స్పేస్‌ఎక్స్ ఏఐల పిలుపుకు భిన్నంగా మెటా సీఈవో వ్యాఖ్యానించడం గమనార్హం.
ఏఐ మనిషి నియంత్రణ నుంచి జారిపోకముందే దాన్ని ఎలా నియంత్రించాలన్న విషయంపై ఇటీవలి కాలంలో చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ఏఐ అభివృద్ధి ఇలాగే కొనసాగితే ఆరు నుంచి పన్నెండు నెలల కాలంలో అది ఇంటర్నెట్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసు కోగలదని ఆంత్రోపిక్ అధ్యక్షుడు డారి యో ఆందోళన వ్యక్తం చేయగా.. ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మ్యాన్, స్పేస్‌ఎక్స్ ఏఐ సీఈవో ఎలాన్ మస్క్లు అందుకు మద్దతు పలికారు.
అయితే ఈ వ్యాఖ్యలు వెలువడ్డ మూడు రోజులకు మెటా సీఈవో ఎక్స్ వేదికపై స్పందించడం గమనార్హం. ఏఐ కంపెనీలు ఇప్పటికే వాటిని సురక్షితంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నాయని, హాని జరక్కుండా చూడటం ఆయా కంపెనీలపై ఉన్న బాధ్యత కూడా అని జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. తాము అభివృద్ధి చేస్తున్న ఏఐ మోడల్ ‘మ్యూజ్’సురక్షితమైందని నిర్ధారించుకునేందుకు నెలలుగా దాని విడుదలను ఆపామని తెలిపారు.
కంపెనీలు భద్రమైన ఏఐ మోడళ్ల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని, తమని తాము అభివృద్ధి చేసుకోగల మోడళ్లకు కాదని తెలిపారు. రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ అని పిలిచే ఈ సామర్థ్యం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందన్నది అంచనా. ప్రజలకు ఉపయోగపడేందుకు కంప్యూటింగ్‌ను ఉపయోగించే మోడళ్లు కావాలి కానీ.. రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ సామర్థ్యమున్న వాటి కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేయడం కాదని పరోక్షంగా ప్రత్యర్థి కంపెనీకు చురకలంటించారు.


