సౌదీకి భారీ షాక్‌.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్‌! | Pakistan Effect Saudi Arabia rushes to Israel for help | Sakshi
Sakshi News home page

సౌదీకి భారీ షాక్‌.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్‌!

Sep 16 2026 8:08 AM | Updated on Sep 16 2026 8:26 AM

Pakistan Effect Saudi Arabia rushes to Israel for help

ప్రపంచ చమురు మార్కెట్‌ను ప్రభావితం చేసే సౌదీ అరేబియా ఇప్పుడు ఊహించని సంక్షోభంలో చిక్కుకుంది. ఎర్ర సముద్ర తీరంలోని కీలక ప్రాంతాలతో పాటు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలో హౌతీలు పట్టు సాధించడంతో.. సౌదీ చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు హౌతీల ముప్పు.. మరోవైపు మిత్రదేశాల నుంచి ఆశించిన స్థాయిలో ప్రత్యక్ష సైనిక సహకారం లేకపోవడంతో రియాద్‌కు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్న చందంగా పరిస్థితి మారింది. మరోవైపు సౌదీ మిత్రదేశంగా ఉన్న పాకిస్తాన్‌.. యెమెన్‌లో హౌతీలపై నేరుగా పోరాడేందుకు తమ బలగాలను పంపబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో రియాద్.. అధికారిక దౌత్య సంబంధాలే లేని ఇజ్రాయెల్‌ నుంచి కూడా పరోక్షంగా సాయం కోరినట్లు వార్తలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టెల్ అవీవ్‌కు చెందిన ది జెరూసలెం పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. హౌతీల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సహాయం కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇజ్రాయెల్ హయోమ్ కథనం ప్రకారం.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) ఇతర గల్ఫ్ దేశాలు, ఈజిప్ట్ నుంచి కూడా సహాయం కోరినట్లు సమాచారం. కాగా, సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఆపదలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు’ అన్న సామెత గుర్తుకొచ్చేలా.. రియాద్ ఇప్పుడు తనకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్నీ పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. యెమెన్‌లో రియాద్ ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్ల తీవ్రతను ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

అసలు సంక్షోభం ఏంటి?
ఇటీవల వరకు సౌదీ ఇంధన మౌలిక వసతులపై అప్పుడప్పుడు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిన హౌతీలు.. గత వారం అనూహ్యంగా పెద్ద ఎత్తున దాడికి దిగినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. సౌదీ మద్దతున్న నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను వెనక్కి నెట్టి.. ఎర్ర సముద్ర తీరంలోని విస్తారమైన ప్రాంతాలతో పాటు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలోని కొన్ని ద్వీపాలపై హౌతీలు నియంత్రణ సాధించినట్లు సమాచారం. కాగా, ఈ జలసంధి ద్వారా సౌదీ అరేబియా ఇరాన్ ఆధిపత్యంలో ఉన్న హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకోగలదు. ఇప్పుడు ఈ మార్గంపైనా ముప్పు ఏర్పడటంతో సౌదీ చమురు ఎగుమతులపై ఆందోళన పెరిగింది.

ఇప్పటికే జులై నుంచి సౌదీ నౌకలపై ఆంక్షలు కొనసాగిస్తున్న హౌతీ నాయకత్వం.. ఈ నిర్బంధాన్ని కొనసాగిస్తామని ప్రకటించినట్లు కథనాలు చెబుతున్నాయి. ఇతర దేశాల నౌకలకు మాత్రం రాకపోకలకు అనుమతిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు సౌదీకి చెందిన కీలక పైప్‌లైన్ వ్యవస్థలపై కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. చమురు ఉత్పత్తి మాత్రమే కాకుండా దాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు తరలించే సామర్థ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పాక్‌ ఎందుకు వెనక్కి?
సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ మధ్య ఏర్పడిన మక్కా డిఫెన్స్ అలయన్స్ నేపథ్యంలో ఇస్లామాబాద్ నుంచి సైనిక సహాయం వస్తుందని రియాద్ ఆశించినట్లు కథనాలు సూచిస్తున్నాయి. అయితే యెమెన్‌లో హౌతీలపై పోరాటానికి తమ బలగాలను పంపే విషయంలో పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. సౌదీ భూభాగాన్ని రక్షించేందుకు మాత్రం తమ బలగాలను మోహరించవచ్చని పాక్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే విదేశీ గడ్డపై జరిగే ప్రత్యక్ష యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనబోమని ఇస్లామాబాద్ స్పష్టమైన గీత గీసినట్లు కథనాలు చెబుతున్నాయి.

అమెరికా, బ్రిటన్‌ కూడా దూరం
హౌతీలపై అమెరికా, బ్రిటన్ కూడా ప్రత్యక్ష సైనిక చర్య విషయంలో వెనుకంజ వేసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. యెమెన్‌లో హౌతీలపై నేరుగా దాడులు చేయబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. బ్రిటన్ కూడా సైనిక సలహాదారులను అందించే దిశగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్ సాయం ఎంతవరకు?
ఇజ్రాయెల్ నుంచి సౌదీకి వచ్చే సహాయం కూడా ప్రధానంగా ఇంటెలిజెన్స్‌కే పరిమితం కావచ్చని ఇజ్రాయెల్ హయోమ్ కథనం పేర్కొంది. హౌతీలు ఇజ్రాయెల్ నగరాలపై రాకెట్లతో దాడులు చేసే ప్రమాదం ఉండటంతో.. యెమెన్‌లో ప్రత్యక్ష సైనిక చర్యకు ఇజ్రాయెల్ కూడా పరిమితులు విధించుకునే అవకాశం ఉందని సమాచారం. హౌతీలకు వ్యతిరేకంగా ఏదైనా చర్య తీసుకోవాల్సి వస్తే ఇజ్రాయెల్ ఒంటరిగా కాకుండా విస్తృత అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమిలో భాగంగా చేపట్టాలని ఆ దేశ రక్షణ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. 

ఇదీ చదవండి: ట్రంప్‌ తెచ్చిన యుద్ధం.. అమెరికాకు 3 లక్షల కోట్ల బిల్లు!

అయితే, సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేకపోయినా, గతంలో కొన్ని సందర్భాల్లో తెరవెనుక సహకారం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి.

1960లలోనే రహస్య సహకారం
1960లలో యెమెన్‌లో అంతర్యుద్ధం జరిగినప్పుడు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ రెండూ సనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాయలిస్టు వర్గాలకు మద్దతు ఇచ్చాయి. బ్రూకింగ్స్ ప్రకారం, ఇరుదేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు రాయలిస్టులకు ఆయుధాలు, నిపుణుల సహాయం అందించడంలో సమన్వయం చేసుకున్నాయి. అంటే ఇది కొత్తగా ఏర్పడిన సహకారం కాదు.. యెమెన్ విషయంలో ఇరుదేశాలకు ఉమ్మడి శత్రువు ఉన్నప్పుడు దశాబ్దాల క్రితమే పరోక్షంగా కలిసి పనిచేసిన చరిత్ర ఉంది.

2010లలో ఇరాన్ అంశం కీలకమైంది. తర్వాత ఇరాన్ ప్రభావం పెరగడంతో సౌదీ, ఇజ్రాయెల్ రెండింటికీ ఒకే భద్రతా ఆందోళన ఏర్పడింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ మిలీషియాలు, యెమెన్‌లో హౌతీల అంశాల్లో ఇంటెలిజెన్స్, భద్రతా సహకారంపై తెరవెనుక సంప్రదింపులు జరిగినట్లు పలు విశ్లేషణలు పేర్కొంటున్నాయి. 2017లో అప్పటి ఇజ్రాయెల్ సైనిక చీఫ్ గాడి ఐసెన్‌కోట్ కూడా సౌదీతో ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు అనుభవాలు, ఇంటెలిజెన్స్ పంచుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని సౌదీ మీడియాకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement