సాక్షి, కీసర: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు కలకలం రేపాయి. ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు సీఐ... రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. దీంతో, ఈ కేసులో సీఐ ఆంజనేయులు, లంచం తీసుకున్న ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు సీఐ రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. అంతేకాకుండా కొంతకాలంగా నిందితుడితో బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులు భరించలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. లంచం డబ్బులు తీసుకునే బాధ్యతను సీఐ ఆంజనేయులు తన కింద పనిచేసే ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డికి అప్పగించినట్లు గుర్తించారు.
దీంతో డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో అధికారులు వల పన్నారు. కీసర చెరువుగట్టు వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ.. బాధితుడి నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకునే విధంగా ప్లాన్ చేశారు. అదే సమయంలో అధికారులు అక్కడికి చేరుకోవడంతో ఎస్‌ఐ అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు సమాచారం. కెమికల్ పరీక్షలకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డితో పాటు సీఐ ఆంజనేయులును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.
ఇదీ చదవండి: వారం రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి


