మా ఆస్తులు, మీ ఆస్తులు, ధరణి, భూభారతి వ్యవహారాలపై విచారణ జరిపించండి
సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు సవాల్
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం లేకే వ్యక్తిగత ఆరోపణలు
డైవర్షన్ డ్రామాలతో ఎదురుదాడి.. దబాయింపులు, బెదిరింపులు
రేవంత్ కుటుంబం పేరిట 308ఎకరాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం
22ఏ తప్పిదం అని ఒప్పుకున్నావ్.. బాధ్యులపై చర్యలు ఎందుకు లేవు?
మీ ఇల్లు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టే సామాన్యుడికీ ఊరట కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: ‘నాతో పాటు మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్‌ఎస్ నేతలపై చేసిన ఆరోపణలన్నింటినీ నిరూపించండి. మా ఆస్తులు, మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యుల ఆస్తులు.. 2020 నుంచి ఇప్పటి వరకు ధరణి, భూభారతిలో జరిగిన వ్యవహారాలపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు మేం సిద్ధం. మీరు సిద్ధమా?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. ప్రజా సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం లేకే సీఎం వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ డ్రామాలు చేస్తూ ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్ని స్తున్న తమపై ఎదురుదాడి చేస్తున్నారని, దబాయింపులు, బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలపై బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు ఖండిస్తూ.. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
అధికారులు, మంత్రిపై చర్యలేవీ?
‘నిషేధిత భూముల అంశంలో బీఆర్‌ఎస్ ఇన్నాళ్లుగా చెబుతోంది సీఎం మాటలే ధ్రువీకరించాయి. 3.71 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టామని, సమస్యను పరిష్కరించే క్రమంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి 30 లక్షల కుటుంబాలకు సమస్య ఏర్పడిందని సీఎం చెప్పడమే ఇందుకు నిదర్శనం. మేం ఇదే విషయాన్ని ఇన్నాళ్లూ చెబుతున్నాం. ఇప్పుడు సీఎం స్వయంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఒప్పుకున్నారు. మరి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన తప్పిదానికి బాధ్యత ఎవరిది? ఆదేశాలు ఇచ్చిన అధికారులపై, జాబితాను అప్‌లోడ్ చేసిన కలెక్టర్లపై చర్యలెందుకు లేవు? ఒక్క ఎకరా కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని చెప్పిన రెవెన్యూ మంత్రిపై చర్యలెందుకు తీసుకోలేదు? 22ఏపై తప్పు జరిగిందని ఒప్పుకున్న ప్రభుత్వం ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎప్పటిలోగా సమస్యను పరిష్కరిస్తారో కాలపరిమితితో ప్రకటించాలి. కమిటీ వేస్తాం.. పరిశీలిస్తాం.. మార్గదర్శకాలు ఇస్తాం.. ఫీజులు కట్టించుకుంటాం.. అంటూ మాటలు చెబుతున్నారు. ప్రజలకు పరిష్కారం ఎప్పుడు ఇస్తారో చెప్పరు. ఎదురుదాడితో ప్రజల బాధ పోతుందా? సీఎంకు ఒక చట్టం.. సామాన్యుడికి మరో చట్టమా? మీ ఇల్లు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టే రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడి భూమికీ ఊరట కల్పించాలి..’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
రేవంత్ పొంతన లేని లెక్కలు
‘కేసీఆర్ ఎకరం కోసం, గజం కోసం ఆలోచించే వ్యక్తి కాదు. తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన ఉద్యమ నాయకుడు. ఆయనకు వెయ్యి ఎకరాలున్నాయని ఒకసారి.. ఇప్పుడు 60 ఎకరాలు ఉన్నాయని రేవంత్ పొంతన లేని లెక్కలు చెప్తున్నాడు. ఫామ్‌హౌస్, భూముల విషయంలో చేసిన ఆరోపణలన్నీ ఎన్నికల అఫిడవిట్లు, ఆదాయపు పన్ను రిటర్నుల్లో నేను వెల్లడించివే. నా భూములపై కలెక్టర్లు, సర్వేయర్లు, విజిలెన్స్, సీఐడీ, ఇంటెలిజెన్స్ వంటి విభాగాలతో విచారణలు జరిపించినా అక్రమాలు నిరూపించలేకపోయారు. నా భూములపై అనుమానం ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించు. నీ ఆస్తులు, నీ తమ్ముళ్ల ఆస్తులు, నీ కుటుంబ ఆస్తులపైనా అదే విచారణ జరుపుదాం. ఒక్క కొట్రలోనే మీ కుటుంబ సభ్యుల పేరిట 170 ఎకరాలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. మీ కుటుంబ సభ్యుల పేరిట 308 ఎకరాలకు ఉన్నట్లు ప్రాథమిక వివరాలు అందాయి.
సస్పెన్షన్ ఎత్తేస్తే అసెంబ్లీలో అన్నీ మాట్లాడతాం..
ధరణి, భూభారతిలో బీఆర్‌ఎస్ హయాంలోనే కాదు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అవకతవక పైనా విచారణకు సిద్ధం. మేం చేసిన ఆరోపణలకు ఆధారాలు సభలో పెడతాం. సస్పెన్షన్ ఎత్తేస్తే అసెంబ్లీకి వచ్చి ఆధారాలతో మాట్లాడతాం. భూ భారతి చలాన్ల వ్యవహారం, ప్రజల ఆస్తులు ఇతరుల పేర్లకు మారిన లావాదేవీలు, నాదర్‌గుల్ భూముల అంశం.. ఇలా మేం లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి..’ అని హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడి బీఆర్‌ఎస్ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేశారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తమ వద్ద ఒక్క ఇంచు భూమి అక్రమంగా ఉన్నా నిరూపించాలని సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్‌ఎస్ నేతలపై సీఎం చేసిన ఆరోపణలు సభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు.


