ఆ బాధ్యత ప్రభుత్వానిదే.. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ
అసెంబ్లీలో 22ఏపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి
12 రకాల అంశాలను ప్రభుత్వం గుర్తించింది
యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణకు త్వరలో పాలసీ
అధీకృత లేఅవుట్లలోని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు కొత్త పథకం
సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో దరఖాస్తులకు జిల్లా స్థాయిలో కమిటీ
వివిధ జీవోల కింద ఉన్న దరఖాస్తులకు త్వరలో పరిష్కారం
ఇందిరమ్మ పథకంలో నిర్మించిన ఇళ్ల విక్రయానికి ఐదేళ్ల సీలింగ్
ప్రైవేటు పట్టా భూముల్లో నాలా సమస్యతో నిలిచిన వాటికి రిలీఫ్
త్వరలో ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలు, లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 22ఏ జాబితాలో చేర్చిన వివరాల్లో పొరపాట్లు జరిగాయని చెప్పారు. వాటిని పూర్తిగా సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం శాసనసభలో 22ఏపై చర్చలో భాగంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
అటవీ, అసైన్డ్ భూములు తొలగించలేం..
‘22ఏ కింద మొత్తం 1.02 కోట్ల ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇందులో సింహభాగం అటవీ, అసైన్డ్, ఇతర ప్రభుత్వ భూములే. వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించలేం. వాటిని తొలగించాలని కేసీఆర్, హరీశ్‌రావు లేఖ మీద రాసి ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆగస్టు 30, 2026 నాటికి 22ఏ జాబితాలో 1,02,05,250 ఎకరాలు ఉండగా, అందులో ప్రైవేట్ భూమి 3,73,980 ఎకరాలే. 22ఏలో ఉన్న మొత్తం విస్తీర్ణాన్ని ప్రైవేట్ పట్టా భూమిగా చూపడం సరికాదు. టీజీఐఐసీ, ఇతర భూములపై వచ్చేసారి బడ్జెట్ సెషన్‌లో వివరాలు బయటపెడతా. ఇప్పుడు కేవలం రెవెన్యూలో ధరణిలో పార్ట్–1 వివరాలు మాత్రమే బయటపెట్టా. సభలో వారుండాలి.. వారి ఎదురుగా నేనే మాట్లాడతా.. నా కళ్లలోకి చూడడానికి కూడా ధైర్యం రావొద్దు.. చూడాలంటే కూడా చేసిన దొంగతనాలకు ముక్కును నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ప్రత్యక్షంగా తీసుకువస్తా. నిజాం సర్కార్ ఇచ్చినదాన్ని పూర్తిగా లూటీ చేశారు.. జమీన్దార్, జాగిర్దార్‌లను లూటీ చేశారు. నిజాం పేదలు, దళితలులు, ఆదివాసులు, మైనారిటీలకు దక్కాల్సిన భూములను ఒకే కుటుంబం దోపిడీ చేసింది.
ప్రైవేట్ భూమిపై హైపవర్ కమిటీ
ప్రైవేటు భూమి 3.7 లక్షలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు సీసీఎల్‌ఎ, న్యాయ కార్యదర్శి, ఐజీఆర్‌ఎస్ ఉన్నతాధికారితో కూడిన హైపవర్ ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. నిషేధిత జాబితాలోని నిరుపేదలకు సంబంధించిన ఆస్తులపై 30 రోజుల్లోగా న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. న్యాయమైన, చట్టబద్ధమైన అంశాల్లో నిరుపేదలకు అన్యాయం జరక్కుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.
12 అంశాలకు పరిష్కారం..
ప్రధానంగా ప్రభుత్వం గుర్తించిన 12 అంశాలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది.
⇒ అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌సీ) భూములు కేటగిరీలో పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలు, యూఎల్సీ మిగులు భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం త్వరలోనే ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది.
⇒ ఈ విధానం పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులన్నింటికీ వర్తిస్తుంది.
⇒ భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు రెండూ సమాంతరంగా, ఏకకాలంలో చేపడతాం.
⇒ అదీకృత లేఅవుట్లలోని ప్రభుత్వ భూములు, కాంపిటెంట్ అథారిటీలు (హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ) ఆమోదించిన లేఅవుట్లలో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పరిశీలించి, తగిన పరిష్కారం చూపేందుకు వారం రోజుల్లోగా ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తాం.
⇒ ఇలాంటి ఆస్తుల క్రమబద్ధీకరణ త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెడుతుంది.
⇒ సింగరేణి బొగ్గు గని ప్రాంతాల (కోల్ బెల్ట్) సమస్య కోసం జిల్లా స్థాయి ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిర్దేశిత అర్హత ప్రమాణాల మేరకు పరిష్కరిస్తుంది.
అసైన్డ్ భూములపై న్యాయ సమీక్ష
⇒ జీవో నంబర్ 59 సమస్యకు కన్వెయన్స్ డీడ్స్ (హక్కు బదిలీ పత్రాలు) జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను నిర్దేశిత అర్హతల ప్రాతిపదికన తుది పరిశీలన జరిపి పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది.
⇒ మిగిలిన 18,590 పెండింగ్ దరఖాస్తులు నూతన క్రబద్ధీకరణ విధానం కింద పరిష్కరిస్తాం.
⇒ జీవో నంబర్ 118 (ఎల్బీ నగర్ నియోజకవర్గం) సమస్య కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ నిరీ్ణత గడువులోగా పరిష్కరిస్తాం.
⇒ పరిష్కారమైన అన్ని కేసులను వెంటనే సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం.
⇒ అసైన్డ్ భూములన్నీ తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధ) చట్టం 1977 పరిధిలోకి వస్తున్నందున, ఈ అంశంపై సమగ్ర న్యాయ సమీక్ష, విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటాం.
⇒ ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇళ్లు అత్యంత నిరుపేదల ఆస్తులకు సంబంధించినది అయినందున, దీనిపై విస్తృతస్థాయి సంప్రదింపులు జరుపుతాం.
ఇందిరమ్మ ఇళ్లకు ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్
ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారుని సొంత స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇళ్లను 5 సంవత్సరాల లాక్–ఇన్ పీరియడ్ (లావాదేవీల నియంత్రణ గడువు) ముగిసిన తర్వాత క్రయవిక్రయాలకు అనుమతి మంజూరు చేస్తాం.
⇒ ప్రైవేటు పట్టా భూములు – నాలా రుసుము చెల్లించని కేసులకు సంబంధించి నాలా చార్జీలు, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములను కలిపి క్రయ విక్రయాలకు అనుమతిస్తాం.
⇒ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అనధికార లేఅవుట్లు, కాలనీలకు సంబంధించి అనధికారిక లేఅవుదట్లు నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకొస్తాం.
⇒ సికింద్రాబాద్ పరిధిలోని లీజ్ హోల్డ్ ఆస్తుల ఫ్రీహోల్డ్ క్రమబద్ధీకరణ కేసులను 30 రోజుల నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించేందుకు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం.
⇒ స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్మెంట్ భూములు, భూదాన్ భూములకు సంబంధించి సమస్యలో నిరుపేద, బలహీన వర్గాల గృహ నిర్మాణ అవసరాల కోసం భూమిని, ఆర్థిక వనరులను సమీకరించే ఉద్దేశంతో ఈ భూములను దసమగ్ర ల్యాండ్ పూలింగ్ విధానం పరిధిలోకి తీసుకొస్తాం. ఈ విధానం ద్వారా సమీకరించిన నిధులను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని నిరుపేద లబ్ధిదారులకు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాలకు వినియోగిస్తాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు.


