ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేది కేవలం ఓటరు పాత్రే
ఏసీబీ దర్యాప్తు మొత్తం లోపభూయిష్టం
రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ కేసు నమోదు
ఈ కేసుకు పాత అవినీతి నిరోధక చట్టం నిబంధనలే వర్తిస్తాయి
ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు
ఎమ్మెల్యే ’పబ్లిక్ సర్వెంట్’ కాదా? అని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దం క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’కేసు విచారణ సుప్రీంకోర్టులో కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా హాజరై వాదనలు వినిపించారు. చట్ట నిబంధనలు, ఏసీబీ దర్యాప్తు లోపాలను ఎత్తిచూపుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం ఎమ్మెల్యే అధికారిక విధి కాదని, పాత చట్టం ప్రకారం ఈ కేసు నిలబడదని చెప్పారు.
పాత చట్టం ప్రకారం అది నేరం కాదు.. :
ఈ కేసు 2015 నాటిది కాబట్టి అప్పటి అవినీతి నిరోధక చట్టం (పీసీ) ప్రకారమే విచారించాలని లూథ్రా కోరారు. పాత చట్టంలోని సెక్షన్లు 7, 11 కేవలం లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులకే వర్తిస్తాయని, సెక్షన్ 12 ప్రకారం లంచం ఇవ్వడం నేరం కాదని వాదించారు. ఐక్యరాజ్యసమితి అవినీతి వ్యతిరేక తీర్మానం మేరకు 2018లో వచ్చిన చట్ట సవరణల తర్వాతే లంచం ఇవ్వడాన్ని (కొత్త సెక్షన్ 8 కింద) ప్రత్యేక నేరంగా చేర్చారన్నారు. ఈ కేసుకు పాత చట్టం నిబంధనలే వర్తిస్తాయని, ఆ ప్రకారం లంచం ఇవ్వజూపడం నేరం కిందకు రాదన్నారు. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 171 ప్రకారం ఈ ఎన్నికలు అసెంబ్లీ స్పీకర్ పరిధిలో కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పారు. ఇందులో స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టభద్రులతోపాటు ఎమ్మెల్యేలు సైతం ఓటరు (ఎలక్టోరేట్) పాత్రను మాత్రమే పోషిస్తారని తెలిపారు. దామాషా (సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్) పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో ఓటు వేయడం ఎమ్మెల్యే ’ప్రజా విధి’లేదా ’అధికారిక విధి’కిందకు రాదని స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన ‘సీతా సోరెన్’తీర్పు కేవలం సభా హక్కుల పరిరక్షణకు మాత్రమే పరిమితమని, ఈ కేసుకు ఆ తీర్పు వర్తించదని చెప్పారు.
ఎమ్మెల్యే ’పబ్లిక్ సర్వెంట్’కాదా?
ధర్మాసనం కలుగజేసుకుని.. ‘ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ (ప్రజా సేవకుడు) కాదా? నామినేటెడ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి?‘అని ప్రశ్నించింది. దీనికి లూథ్రా బదులిస్తూ.. పీసీ చట్టం వర్తించాలంటే వారు పబ్లిక్ సర్వెంట్ కావడంతో పాటు, వారు చేసే పని ’అధికారిక విధి’అయి ఉండాలన్నారు. కానీ, ఇక్కడ ఎమ్మెల్యే ఎక్స్–అఫీషియో హోదాలో ఓటరుగా మాత్రమే వ్యవహరిస్తారని, నామినేటెడ్ ఎమ్మెల్యేల పాత్ర కూడా అదేనని వివరించారు. వాదనల సందర్భంగా ఏసీబీ తీరును లూథ్రా తీవ్రంగా తప్పుబట్టారు. 2015 మే 28న అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే (స్టీఫెన్ సన్) నేరుగా ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేసినా కనీసం జనరల్ డైరీలో ఆ విషయాన్ని నమోదు చేయలేదన్నారు. ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా, కనీస ముందస్తు అనుమతులు తీసుకోకుండానే మే 31న వలపన్ని దాడులు చేశారని కోర్టుకు తెలిపారు. దాడులు పూర్తయిన తర్వాత ఆ రోజు రాత్రి 11 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, ముడుపులకు సంబంధించి ఎలాంటి ఒప్పందం జరగలేదన్నారు. అప్పట్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం, కక్షసాధింపుల్లో భాగంగానే ఈ కేసు నమోదైందని చెప్పారు. దర్యాప్తు లోపాల కారణంగానే ఈ కేసులో ఏ–4గా ఉన్న నిందితుడి (మత్తయ్య) కేసును గతంలో హైకోర్టు కొట్టివేసిందని, ఆ తీర్పు ఏ–1కు (రేవంత్ రెడ్డి) కూడా వర్తిస్తుందని లూథ్రా వాదించారు. దీంతో పిటిషనర్ల తరఫు వాదనలు ముగిశాయి. కాగా, విచారణ జరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాల్సిన సీనియర్ న్యాయవాది సుందరం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ప్రభుత్వ వాదనలు వినేందుకు వీలుగా తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 30కి వాయిదా వేసింది.


