అభివృద్ధికి సరికొత్త నమూనాగా రాష్ట్రం
సందేహాల రాష్ట్రం నుంచి దేశాభివృద్ధికి సమాధానంగా నిలిచాం
కాళేశ్వరం నుంచి టి–హబ్ వరకు.. ప్రజలకు భరోసా, యువతకు అవకాశాలే లక్ష్యం
ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ‘కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిలదొక్కుకోగలదా? అవసరమైన వనరులు, సంస్థలు, పరిపాలనా సామర్థ్యం తెలంగాణకు ఉన్నాయా? రాష్ట్ర ఏర్పాటు సమయంలో వ్యక్తమైన అనేక సందేహాలకు అభివృద్ధి, పరిపాలనా విధానాల ద్వారా సమాధానం ఇచ్చాం’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అనేది దేశ అభివృద్ధికి సమాధానంగా ఉండటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణను కేవలం కొత్త రాష్ట్రంగా కాకుండా ప్రజల కోసం విలువను సృష్టించే ‘స్టార్టప్ స్టేట్’గా తీర్చిదిద్దే ఆలోచనతో ముందుకు సాగి విజయం సాధించామన్నారు. బుధవారం హరియాణా రాష్ట్రం సోనిపట్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘పాలనలో నవకల్పన–ఒక స్టార్టప్ రాష్ట్రం కథ’అనే అంశంపై కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు.
కొత్త రాష్ట్రం నిలబెట్టుకోగలదా? అన్నారు
‘తెలంగాణ ఏర్పడిన సమయంలో కొందరు ఈ రాష్ట్రం తనను తాను నిలబెట్టుకోగలదా? అని ప్రశ్నించారు. కొత్త పరిపాలనా వ్యవస్థను నిర్మించడం పెద్ద భారమని చెప్పారు. మేము మాత్రం అదే పరిస్థితిని కొత్త తరహా పాలనా సంస్కృతిని నిర్మించుకునే అవకాశంగా చూశాం. సందేహాలతో వాదించకుండా పనితీరుతో సమాధానం చెప్పడమే తెలంగాణ విధానంగా సాగింది’అంటూ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కథకు రెండు ప్రధాన కోణాలు ఉన్నాయని వివరించారు. ఒకటి నీరు, విద్యుత్, వ్యవసాయం వంటి ప్రాథమిక అవసరాల ద్వారా ప్రజలకు భరోసా కల్పించడం కాగా.. రెండోది స్టార్టప్‌లు, నైపుణ్యాలు, ఆవిష్కరణల ద్వారా కొత్త అవకాశాలను సృష్టించడం.
వ్యవసాయ రంగంపై...
వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పును కూడా ఈ అభివృద్ధి నమూనాకు ఉదాహరణగా కేటీఆర్ ప్రస్తావించారు. 2014–15లో తెలంగాణలో సుమారు 44.4 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా, 2023–24 నాటికి అది 168.8 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు. ఆ ఏడాది దేశంలోనే అత్యధిక బియ్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. అదే విధంగా ఇళ్లకు 24 గంటల తాగునీరు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించామన్నారు. ఇప్పుడు తెలంగాణ దేశంలోని అగ్ర రాష్ట్రాల సరసన నిలిచిందని, దశాబ్ద కాలంలో తలసరి ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగిందని, జాతీయ సగటు కంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు.
ఎకోసిస్టమ్‌ను నిర్మించాం
ప్రాథమిక సదుపాయాలపై భరోసా ఏర్పడిన తర్వాత అవకాశాల ఎకోసిస్టమ్‌ను నిర్మించడంపై దృష్టి పెట్టామని కేటీఆర్ చెప్పారు. టీ–హబ్, డబ్ల్యూఈ–హబ్, టీ–వర్క్స్, టాస్క్ వంటి సంస్థలను ఒకదానికొకటి అనుసంధానమయ్యే విధంగా రూపొందించామని తెలిపారు. ఈ–ఎకోసిస్టమ్ ఫలితాలను వివరించేందుకు స్కైరూట్‌ను ఉదాహరణగా ప్రస్తావించారు. విక్రమ్–1 అంతరిక్షంలోకి చేరడం హైదరాబాద్ ఆవిష్కరణ నమూనాను ప్రపంచానికి పరిచయం చేసిందని, స్కైరూట్ ప్రస్తుతం భారత తొలి స్పేస్‌టెక్ యూనికార్న్‌గా హైదరాబాద్ నుంచి ప్రపంచ మార్కెట్ కోసం రాకెట్లు నిర్మిస్తోందని పేర్కొన్నారు.
బీజేపీతో పొత్తు ఉండనే ఉండదు
ప్రసంగం తర్వాత విద్యార్థులతో కేటీఆర్ ముఖాముఖీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ‘2028 ఎన్నికల్లో మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా’? అంటూ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ బదులిస్తూ.. ‘మేం వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుకోం. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తాము ఏ పారీ్టతోనూ పొత్తు పెట్టుకోలేదు’అంటూ సమాధానమిచ్చారు. ‘డీలిమిటేషన్‌పై బీఆర్‌ఎస్ వైఖరి ఏమిటి’అని మరో విద్యార్థి ప్రశ్నించగా.. ‘దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం లోక్‌సభలో 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్యను దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో మాకు సమస్య లేదు’అన్నారు. ఏఐ, సాంకేతిక పరివర్తనలపై ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రతి పెద్ద సాంకేతిక మార్పు సమయంలోనూ ఆందోళనలు, సందేహాలు వ్యక్తమయ్యాయన్నారు. ఏఐ విషయంలోనూ అదే జరుగుతోందని, సాంకేతిక మార్పును స్వీకరించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమావేశం తర్వాత సెల్ఫీ అంటూ విద్యార్థులు పోటీపడటంతో ఆయన అందరికీ ఓపిగ్గా సెలీ్ఫలు ఇచ్చారు.


