మరణ సమయాన్ని స్పష్టం చేయనున్న కీటకాలు
సరికొత్త సాఫ్ట్‌వేర్ తయారు చేసిన తెలుగు పరిశోధకులు
సాక్షి, హైదరాబాద్: పాపాలు చేస్తే పురుగులు పట్టిపోతావు... అనేది ముతక సామెత. ప్రస్తుతం మృతదేహంపై వచ్చే ఈ పురుగులే మరణ సమయాన్ని స్పష్టం చేయనున్నాయి. దీనికి సంబంధించిన సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను తెలుగు పరిశోధకులు రూపొందించారు. ‘ఆటోమేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎంటమాలజీ’పేరుతో జరిగిన పరిశోధన ద్వారా దీనికి రూపమిచ్చారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఆరు విద్యా సంస్థలు పాల్గొన్నాయి. హైదరాబాద్ క్లూస్ టీమ్‌లో పని చేస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.వెంకన్న ఈ పరిశోధన ఉపయుక్తమన్నారు.
హత్య కేసుల్లో అదే కీలకం
మరణం ఎప్పుడు సంభవించిందనేది హత్య కేసుల దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశం. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘టైమ్ సిన్స్ డెత్’అని పిలుస్తారు. ఇప్పటి వరకు మృతదేహం లభించిన సమయం, శవపరీక్ష నివేదిక, శరీర ఉష్ణోగ్రత, కండరాలు బిగుసుకుపోవడం తదితర అంశాల ఆధారంగా దీన్ని అంచనా వేస్తున్నారు. అయితే మృతదేహం కుళ్లిపోయిన తర్వాత ఈ అంచనా అత్యంత క్లిష్టంగా మారుతోంది. ఇలాంటి సందర్భాల్లో శవంపై వాలే ఈగలు, వాటి లార్వాలు తదితరాలు కీలక ఆధారాలుగా మారుతున్నాయి. వాటి పెరుగుదల దశ, పరిమాణాన్ని విశ్లేíÙంచి మరణం జరిగి ఎన్ని రోజులైందో అంచనా వేస్తున్నారు.
40 మృతదేహాలపై పరిశోధన
ఈ పరిశోధనలో అమృత్‌సర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో శవపరీక్షకు గురైన 40 కుళ్లిన మృతదేహాలను పరిశీలించారు. ఈ విధానంలో కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా వచ్చిన ఫలితాలు సంప్రదాయ పద్ధతిలో వచి్చన ఫలితాలతో 99 శాతానికి పైగా సరిపోలాయి. దీంతో క్లిష్టమైన హత్య కేసుల్లో మరణ సమయాన్ని వేగంగా అంచనా వేసేందుకు ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. మృతదేహం కుళ్లడం ప్రారంభమైన తర్వాత ప్రత్యేక రకాల ఈగలు దానిపై గుడ్లు పెడతా యి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి పెరుగుదల వేగంలో మార్పులు ఉన్నప్పటికీ.. ఒక నిర్దిష్ట జాతి పురుగు ఏ దశలో ఉందో, దాని పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవడం ద్వారా మృతదేహంపై పురుగులు చేరిన సమయాన్ని అంచనా వేయొచ్చు.
ఈ సాఫ్ట్‌వేర్ ఎలా పని చేస్తుందంటే...
మొదటి దశలో మృతదేహం లేదా దానిపై ఉన్న పురుగులు/కీటకాలు స్పష్టంగా కనిపించేలా ఫొటో తీస్తారు. దీన్ని ఆ సాఫ్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్ చేసినప్పుడు ఒక్కో పురుగును ప్రత్యేకంగా గుర్తించి సంఖ్య కేటాయిస్తుంది. ఆ తర్వాత ప్రతి పురుగు పొడవు, ఆకారం, పరిమాణాన్ని లెక్కిస్తుంది. ఆపై పురుగు ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తుంది. అనంతరం పురుగు ఆక్రమించిన ప్రాంతాన్ని లెక్కించి దాని విస్తీర్ణాన్ని లెక్కిస్తుంది. ఆపై పురుగు పరిమాణాన్ని దాని ఎదుగుదల దశతో పోలుస్తుంది. గుడ్డు నుంచి ఈగగా మారే క్రమానికి పట్టే సమయాలను పరిశోధకులు ముందుగానే సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. ఇలా ఆ కీటకాలు ఎంతకాలంగా పెరుగుతున్నాయో అంచనా వేస్తుంది. ఆ సమాచారాన్ని ఉపయోగించి మరణించి ఎన్ని రోజులైందో చూపిస్తుంది.


