ఇన్నాళ్లూ ఉచితంగా సాగిన యూపీఐపై ఇప్పుడు వాయింపు మొదలైందనే చర్చ జోరందుకుంది. అక్టోబర్ 15 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని, ఆన్‌లైన్‌లో రూ.2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీలు పడతాయంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని రకాల లావాదేవీలకు రూ.5, మరికొన్నింటికి అంతకంటే ఎక్కువే చెల్లించాల్సి వస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఇక యూపీఐతో డబ్బులు పంపినా.. షాపులో చెల్లించినా.. మన జేబుకు మోత పడుతుందా? అన్న ఆందోళన సామాన్యుల్లో మొదలైంది. అసలు ఈ ఛార్జీలు ఎవరికి వర్తిస్తాయి? ఎంత చెల్లించాలి? కస్టమర్ జేబు నుంచి డబ్బులు పోతాయా? లేక వ్యాపారే భరించాలా? యూపీఐ వాడే ప్రతి ఒక్కరిపైనా ఛార్జీల భారం పడుతుందా?..
మీరు కిరాణా షాపులో సామాన్లు కొన్నారు.. బయట షాపింగ్ చేశారు. ఫోన్ తీసి యూపీఐతో డబ్బులు పంపారు. ఏమైనా అదనంగా కట్టాలా?.. అవసరం లేదు. స్నేహితుడికి రూ.10 వేలు పంపారు.. ఛార్జీ పడుతుందా? అదీ లేదు. మరి యూపీఐపై ఛార్జీలు అంటూ వస్తున్న వార్తలేంటి? ఇక్కడే అసలు గందరగోళం మొదలైంది. కొత్త నిబంధనల ప్రకారం అందరూ యూపీఐకి ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 15 నుంచి కొన్ని రకాల వ్యాపార చెల్లింపులపై మాత్రమే ‘ఎండీఆర్’ అనే ఛార్జీ ఉంటుంది. అది కూడా సాధారణ కస్టమర్ చెల్లించాల్సింది కాదు.. వ్యాపారి చెల్లించాల్సింది.
చాలా సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు ఒక వ్యక్తికి డబ్బులు పంపితే ఎలాంటి ఛార్జీ ఉండదు. ఎంత మొత్తం పంపినా ఇదే నిబంధన. ఉదాహరణకు మీ స్నేహితుడికి రూ.10 వేలు పంపినా, కుటుంబ సభ్యుడికి రూ.50 వేలు పంపినా యూపీఐ ఛార్జీ ఉండదు. అలాగే షాపులో మీరు రూ.2 వేల వరకు యూపీఐతో చెల్లించినా ఎలాంటి ఛార్జీ లేదు. అంటే రూ.500, రూ.1,000, రూ.2,000 బిల్లు కట్టేటప్పుడు మీరు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.
మరి రూ.2 వేలు దాటితే?
ఇక్కడే కొత్త నిబంధన వస్తుంది. ఒక వ్యాపారికి రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపు చేస్తే కొన్ని సందర్భాల్లో 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. కానీ ఆ డబ్బును కస్టమర్ నుంచి తీసుకోకూడదు. వ్యాపారే భరించాలి. ఈ ఛార్జీ ఒక్క లావాదేవీకి గరిష్ఠంగా రూ.300కే పరిమితం.
ఉదాహరణకు మీరు ఓ రెస్టారెంట్‌లో రూ.6,000 బిల్లు కట్టారనుకోండి. 0.4 శాతం ప్రకారం రూ.24 ఎండీఆర్ వస్తుంది. మీరు రూ.6,000 మాత్రమే చెల్లించాలి. ఆ రూ.24ను రెస్టారెంట్ భరిస్తుంది. అలాగే రూ.30 వేల విలువైన మొబైల్ కొంటే.. మీరు రూ.30 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అదనంగా యూపీఐ ఛార్జీ పేరుతో డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు.
పెట్రోల్ పోయించుకుంటే?
ఇక్కడ మరో చిన్న తేడా ఉంది. పెట్రోల్, రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, వ్యవసాయ ఇన్‌పుట్స్ వంటి కొన్ని రంగాల్లో రూ.2,000 కంటే ఎక్కువ చెల్లింపులకు రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ ఉంటుంది. ఈ రూ.5 కూడా కస్టమర్ చెల్లించాల్సినది కాదు.. వ్యాపారి భరించాల్సిందే. అంటే పెట్రోల్ బంకులో రూ.5,000 విలువైన ఇంధనం పోయించుకుని యూపీఐతో చెల్లించినా.. మీరు రూ.5,000 మాత్రమే చెల్లిస్తారు.
చిన్న షాపుల వాళ్లకు ఏంటి?
ఇదీ చాలా ముఖ్యమైన విషయం. చిన్న కిరాణా దుకాణాలు, తోపుడు బండ్లు, వీధి వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదు. యూపీఐ ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు పొందే చిన్న వ్యాపారులకు జీరో ఎండీఆర్ సదుపాయం కొనసాగుతుంది. అందుకే చిన్న షాపు దగ్గర రూ.200, రూ.500, రూ.1,000 ఇలా యూపీఐతో చెల్లించే వారికి ఎలాంటి మార్పు ఉండదు.
ఈ డబ్బు ఎవరికి వెళ్తుంది?
ఇది ప్రభుత్వానికి వెళ్లే పన్ను కాదు. ‘ఎండీఆర్’ అంటే యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారికి సంబంధించిన చిన్న ఛార్జీ. వచ్చిన మొత్తాన్ని బ్యాంకులు, చెల్లింపు సేవలు అందించే సంస్థలు, యూపీఐ యాప్‌లతో కూడిన చెల్లింపు వ్యవస్థలోని భాగస్వాములకు పంచుతారు. యూపీఐ వ్యవస్థను నడపడం, భద్రత పెంచడం, మరింత విస్తరించడమే దీని ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.
వ్యాపారి మీ దగ్గర అడిగితే?
ఇదే ఇప్పుడు చాలామందికి ఉన్న భయం. యూపీఐ ఛార్జీ వచ్చింది.. అదనంగా డబ్బులు ఇవ్వండి అని షాపు యజమాని అడిగితే?. నిబంధనల ప్రకారం ఆ ఛార్జీని కస్టమర్‌పై వేయకూడదు. బ్యాంకులు వ్యాపారులు ఈ ఎండీఆర్‌ను కస్టమర్ల నుంచి వసూలు చేయకుండా చూడాలని ఆర్థిక శాఖ సూచించింది. యూపీఐ యాప్‌లు కూడా అదనపు ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదంటే అదనపు చార్జీలు విధించకూడదు.
అంటే.. యూపీఐ ఇక ఫ్రీ కాదా?
సామాన్యుడి విషయంలో ఇప్పటికీ ఫ్రీనే. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితం. రూ.2 వేల వరకు వ్యాపార చెల్లింపులూ ఉచితమే. చిన్న వ్యాపారులకు కూడా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. ఆర్థికశాఖ, ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త ఎండీఆర్ వల్ల మొత్తం వ్యాపారి-కస్టమర్ యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96 శాతం ప్రభావితం కావు. అంటే వార్తల్లో ‘‘యూపీఐ ఛార్జీలు’’ అని కనిపించినంతగా సామాన్యులపై కొత్త భారం పడటం లేదన్నమాట.
చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరు స్నేహితుడికి డబ్బు పంపుతున్నారా? ఛార్జీ లేదు. పేమెంట్లు చేస్తున్నారా? ఛార్జీ లేదు. షాపులో రూ.2 వేల వరకు చెల్లిస్తున్నారా? ఛార్జీ లేదు. చిన్న వ్యాపారి QRకి డబ్బు పంపుతున్నారా? ఛార్జీ లేదు. రూ.2 వేలకు మించిన కొన్ని వ్యాపార చెల్లింపుల్లో ఎండీఆర్ ఉన్నా.. దాన్ని కస్టమర్ కాకుండా వ్యాపారే భరించాలి.
యూపీఐ అంటే ఒక్క యాప్ కాదు. మనం రోజూ ఉపయోగించే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్, అమెజాన్ పే, వాట్సాప్ పే వంటి యాప్‌ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేస్తుంటాం. అలాగే చాలా బ్యాంకుల యాప్‌లలోనూ యూపీఐ సదుపాయం ఉంటుంది. ఏ యాప్ ద్వారా డబ్బులు పంపినా.. వెనుక పనిచేసేది యూపీఐ వ్యవస్థే.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ పేమెంట్లతో మనం ఏడాదికి ఎంత చెల్లిస్తున్నామో తెలుసా?


