ఉచిత లావాదేవీల విధానానికి కేంద్రం చెల్లుచీటీ.. వ్యాపారులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధింపు
వ్యక్తుల నుంచి వ్యాపారులకు రూ. 2 వేలకుపైగా యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం చార్జీ
రూ. 75 వేలు మించిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ గరిష్టంగా రూ. 300గా ఖరారు
రైల్వే, టెలికం, బీమా, ఇంధన రంగాలకు రూ. 2 వేలకుపైగా జరిపే చెల్లింపులపై రూ. 5 చార్జీ
వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు, చిరు వ్యాపారులకు మాత్రం ఉచితం
ఎండీఆర్‌ను కస్టమర్ల నుంచి వసూలు చేయరాదని.. వ్యాపారులే భరించాలని స్పష్టీకరణ
అక్టోబర్ 15 నుంచి అమల్లోకి.. కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: దేశంలో దాదాపు ఆరేళ్లుగా కొనసాగుతున్న పూర్తి ఉచిత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) చెల్లింపుల సేవలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. యూపీఐ చెల్లింపులపై చార్జీల విధానాన్ని పునఃప్రవేశపెట్టాలంటూ గూగుల్ పే, అమెజాన్ పే, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్ సహా మరికొన్ని సంస్థలు సభ్యులుగా ఉన్న పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెచ్చిన ఒత్తిడితోపాటు ఏటా రూ. 40 లక్షలకుపైగా టర్నోవర్ ఉండే వ్యాపారులపై చార్జీలు విధించాలన్న ఆర్‌బీఐ, బ్యాంకుల సూచనను పరిగణనలోకి తీసుకుంది. వ్యక్తుల నుంచి వ్యాపారులకు రూ. 2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపుల లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. అలాగే రూ. 75 వేలకన్నా ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ను గరిష్టంగా రూ. 300గా ఖరారు చేసినట్లు తెలిపింది. అయితే రూ. 2 వేలలోపు వ్యక్తుల నుంచి వ్యాపారులకు జరిపే యూపీఐ చెల్లింపులతోపాటు వ్యక్తుల నుంచి వ్యక్తుల మధ్య జరిగే యూపీఏ లావాదేవీలు, చిరు వ్యాపారులకు ఎలాంటి ఎండీఆర్ చార్జీ వర్తించదని స్పష్టం చేసింది. అక్టోబర్ 15 నుంచి నూతన విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) సంయుక్తంగా నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఎండీఆర్ రుసుము రూపంలో ఏటా పేమెంట్స్ పరిశ్రమకు రూ. 16,000 కోట్లు వస్తాయని అంచనా.
వినియోగదారులు చార్జీ చెల్లించక్కర్లేదు..
‘యూపీఏ ద్వారా చేసే చెల్లింపులపై వినియోగదారులు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారుల చెల్లింపుల వ్యవస్థలో ఎండీఆర్ ఒక రకమైన చార్జీ. ఇది యూపీఐ చెల్లింపులు జరిపే వినియోగదారులపై విధించే చార్జీ కాదు. వ్యక్తులు ఎప్పటిలాగే ఎలాంటి పరిమితులు, కోటాలు లేకుండా పూర్తి ఉచితంగా యూపీఐ లావాదేవీలు కొనసాగించవచ్చు’ అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఎండీఆర్‌ను కస్టమర్ల నుంచి వసూలు చేయరాదని.. వ్యాపారులే భరించాలని స్పష్టం చేసింది. అలాగే ఎండీఆర్ చార్జీల భారాన్ని వ్యాపారులు వినియోగదారులపై మోపకుండా చూడాలని బ్యాంకులను ఆదేశించింది. అదే సమయంలో యూపీఐ యాప్‌ల ప్రొవైడర్లు ప్లాట్‌ఫాం ఫీజులు లేదా హిడెన్ చార్జీలు వసూలు చేయడాన్ని నిషేధించింది.
కీలక రంగాలకు యూపీఐ చెల్లింపులపై..
అయితే రైల్వే టికెట్ల బుకింగ్, టెలికం రీచార్జీలు, బీమా ప్రీమియం చెల్లింపులు, పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపుకోవడం వంటి వాటికి వ్యక్తులు రూ. 2 వేలకుపైగా జరిపే యూపీఐ చెల్లింపులపై ఒక్కో లావాదేవీకి రూ. 5 చొప్పున ఎండీఆర్ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే రూ. 2 వేలకు మించిన విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, పైప్డ్ గ్యాస్ బిల్లులపై జరిపే యూపీఏ చెల్లింపులతోపాటు రూ. 2 వేలకు మించిన స్కూలు ట్యూషన్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు చెల్లింపులపైనా ఒక్కో లావాదేవీపై రూ. 5 చొప్పున ఎండీఆర్ ఉంటుందని పేర్కొంది. అయితే రూ. 2 వేలకన్నా తక్కువగా ఉండే బిల్లులు, ఫీజులపై మాత్రం ఎలాంటి టీడీఆర్ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీల చెల్లింపులు, స్టాక్‌బ్రోకర్లు, డీలర్ల ద్వారా జరిపే చెల్లింపులపై 0.02 శాతం టీడీఆర్ వర్తిస్తుందని తెలిపింది. అయితే వ్యక్తుల ఖాతా నుంచి వ్యాపారుల ఖాతాకు నేరుగా జరిగే యూపీఐ చెల్లింపులకు మాత్రమే ఎండీఆర్ వర్తిస్తుందని.. యుటిలిటీ బిల్లులు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, పునరావృత పెట్టుబడులకు సంబంధించి అమలయ్యే యూపీఐ మ్యాండేట్‌లు లేదా ఆటోపే విధానాలకు ఎండీఆర్ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
ఎందుకీ చార్జీ?
మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ద్వారా వసూలయ్యే మొత్తంలో కొంత యూపీఐ లావాదేవీల సేవలు అందిస్తున్న బ్యాంకులు, యాప్‌లకు పంచుతామని ఎన్‌పీసీఐ తెలిపింది. అలాగే మిగిలిన మొత్తాన్ని దేశంలో మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల ఊతానికి, నూతన ఆవిష్కరణాలు, సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ సర్వీస్ రంగాలకు ఉపయోగిస్తామని వివరించింది. అలాగే టైర్–3 పట్టణాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ–కాశ్మీర్, లద్దాఖ్‌లలో డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ఆర్థిక రాయితీలు ఇవ్వడానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. కొత్త వ్యాపారులను డిజిటల్ పరిధిలోకి తీసుకురావడానికి ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించనుంది. దేశంలో 2021లో కోవిడ్ వ్యాప్తి వేళ యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ చార్జీని తొలగించిన కేంద్ర ప్రభుత్వం.. దీనివల్ల బ్యాంకులు, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లకు అయ్యే వ్యయాన్ని బడ్జెట్ కేటాయింపుల ద్వారా భరిస్తూ వచ్చింది. అయితే యూపీఏ సేవల నిర్వహణ, సర్వర్ల బ్యాండ్‌విడ్త్ వ్యయం, బ్యాంకుల సాంకేతిక సహాయ ఖర్చులు ఏటా సుమారు రూ. 20 వేల కోట్లను చేరడంతో తమ బడ్జెట్ కేటాయింపుల ద్వారానే ఆ మొత్తాన్ని భర్తీ చేయలేమని కేంద్రం చెబుతోంది. యూపీఐని నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకారం ఆగస్టులో దేశవ్యాప్తంగా రూ.29,82,356 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. అలాగే లావాదేవీల సంఖ్య 2,451 కోట్లు దాటింది.
లావాదేవీల వాటా ఇలా..
– ఆగస్టులో నమోదైన యూపీఐ లావాదేవీల సంఖ్యలో 63 శాతం వాటా వ్యాపారులకు చేసిన చెల్లింపులదే.
– వ్యాపారులకు చేసిన మొత్తం చెల్లింపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీల వాటా 67 శాతం. అంటే వ్యాపార రంగంలో జరిగే మెజారిటీ నగదు చలామణి పెద్ద మొత్తాల్లోనే సాగుతోంది.
– సంఖ్య పరంగా చూస్తే రూ.2,000 పైబడిన లావాదేవీలు కేవలం 4 శాతం మాత్రమే. కానీ విలువ పరంగా అవి 67 శాతం ఉండటం వల్ల ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు, బట్టలు, బంగారు ఆభరణాలు, విమాన/రైలు టికెట్లు, హోటల్ బిల్లుల వంటి పెద్ద చెల్లింపులపై ఈ అదనపు భారం పడనుంది.
– వ్యాపారులు ఈ ఎండీఆర్ భారాన్ని తాము భరించలేక వినియోగదారులపైకి నెట్టేసే ప్రమాదం ఉంది. దీనివల్ల పెద్ద కొనుగోళ్లు చేసేటప్పుడు ప్రజలు యూపీఐని పక్కనపెట్టి మళ్లీ నగదు వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.
– నెలవారీ వ్యాపార టర్నోవర్ రూ.1 లక్ష లోపు ఉన్న చిన్న చిన్న దుకాణదారులకు ఈ రుసుము నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు.
– ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు పంపే వ్యక్తిగత నగదు బదిలీల విషయానికి వస్తే మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో దీని వాటా అత్యధికంగా 70 శాతం.
– పర్సన్–టు–పర్సన్ విభాగంలో జరిగిన మొత్తం లావాదేవీల విలువలో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన బదిలీల వాటా ఏకంగా 85 శాతం నమోదైంది.
– సంఖ్య పరంగా ఇవి 18 శాతం మాత్రమే అయినప్పటికీ, విలువలో 85 శాతం కలిగి ఉండటం గమనార్హం.
మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్): మనం ఏదైనా దుకాణానికి వెళ్లి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బులు చెల్లించినప్పుడు.. ఆ సేవను అందించినందుకు బ్యాంకులు, చెల్లింపు కంపెనీలు వ్యాపారి నుండి వసూలు చేసే రుసుము.
– డిజిటల్ చెల్లింపు చేసినప్పుడు ఆ డబ్బు వినియోగదారుడి ఖాతా నుండి వ్యాపారి ఖాతాకు సురక్షితంగా చేరాలి. దీనికోసం పని చేసే బ్యాంకులు, కార్డు కంపెనీలు, యాప్‌లు తమ సాఫ్ట్‌వేర్, భద్రతను నిర్వహించడానికి ఈ ఛార్జీని తీసుకుంటాయి.
– నిబంధనల ప్రకారం ఈ భారాన్ని వ్యాపారస్తులే భరించాలి. వినియోగదారులు కాదు. ఉదాహరణకు ఈ రుసుము 1 శాతం ఉందనుకుందాం. దుకాణంలో మీరు రూ.3,000 చెల్లిస్తే వ్యాపారికి రూ.2,700 మాత్రమే అందుతాయి. ఛార్జీల కింద రూ.30 కట్ అవుతుంది.
– వ్యాపారస్తులు తమ లాభాలు తగ్గిపోకుండా ఉండటానికి ఈ భారాన్ని వస్తువుల ధరలు పెంచి చివరికి వినియోగదారుల పైకే నెట్టేసే ప్రమాదం ఉంది.


